తమిళనాడు ఎన్నికల్లో అద్భుతం - జోస్యం నిజమవుతుందా ?

తమిళనాడు ఎన్నికలు ఈసారి బాగా ఆసక్తిగా మారుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికలు ఉన్నాయని చెప్పాలి.;

Update: 2026-02-23 17:30 GMT

తమిళనాడు ఎన్నికలు ఈసారి బాగా ఆసక్తిగా మారుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికలు ఉన్నాయని చెప్పాలి. తమిళనాడులో గత ఆరు దశాబ్దాల కాలంలో ఇలాంటి ఎన్నికలు ఎవరూ చూసి ఉండకపోవచ్చు అని అంటున్నారు. ఎందుకంటే ఎపుడూ రెండు పార్టీల మధ్యనే పోరు సాగుతూ వచ్చింది. మొదట్లో కాంగ్రెస్ డీఎంకేల మధ్య పోరు సాగితే ఆ తరువాత అన్నా డీఎంకే డీఎంకేల మధ్య భీకర పోటీ ఉండేది. అటూ ఇటూ చెరొక కూటమి మోహరిస్తే జనాలు తమకు నచ్చిన పార్టీలను ఎన్నుకునేవారు. మరో మాట చెప్పాలీ అంటే తమిళనాడు ప్రజలకు ద్రవిడ పార్టీలు తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది. ఈ మధ్యలో జీకే మూపనార్ పార్టీ వచ్చినా విజయ్ కాంత్ పార్టీ బరిలో నిలిచినా లేక ఇతర పార్టీలు రంగ ప్రవేశం చేసిన ప్రభావవంతమైన పాత్రను పూర్తి స్థాయిలో పోషించలేక పోయాయి అని చెప్పాల్సి ఉంటుంది.

అధికార పీఠం కోసం :

ఇదిలా ఉంటే తొలిసారి ఒక కొత్త పార్టీ నేరుగా అధికార పీఠాన్ని గురి పెడుతూ తమిళనాడులో దూసుకుని పోతోంది. ఆ పార్టీ తమిళ దళపతి విజయ్ కి చెందిన టీవీకే. విజయ్ తమిళ ప్రజలకు వెండి తెర ఆరాధ్యుడిగా ఉన్నారు. రజనీకాంత్ మాదిరిగా ఆయనకు ఎంతో భారీ మాస్ ఫాలోయింగ్ ఉంది. పైగా రాజకీయంగా చూస్తే యంగ్ కిందనే లెక్క. యాభై ప్లస్ ఏజ్ లో రాజకీయాల్లోకి వస్తున్న విజయ్ కి అనుకూలించే అంశాలు ఎన్నో ఉన్నాయి. అదే సమయంలో తమిళనాడులో పొలిటికల్ వాక్యూమ్ ఉందని అంటున్నారు. దాంతో ఈసారి త్రిముఖ పోరుని సెట్ చేసి మరీ విజయ్ టీవీకే బల్ల గుద్ది బిగ్ సౌండ్ చేస్తోంది.

మ్యాజిక్ చేస్తామన్న విజయ్ :

ఈసారి తమిళనాడు ఎన్నికల్లో ఒక అద్భుతం జరుగుతుంది అని టీవీకే అధినేత విజయ్ చెబుతున్నారు. అది కూడా ఆయన ఎంతో నమ్మకంగా చెబుతున్నారు. తమ పార్టీకి అన్ని వర్గాల ప్రజల ఆదరణ నిండుగా ఉందని అంటున్నారు. కొత్త పార్టీ ఏ రకమైన అవినీతి అక్రమాలు లేని పార్టీగా తాము రంగంలోకి దిగుతున్నామని చెప్పారు. ఈసారి ప్రజలు విలక్షణమైన తీర్పు ఇస్తారని ఆయన అంటున్నారు. అందువల్ల తాము గెలిచి తీరుతామని కూడా విజయ్ పూర్తి విశ్వాసం ప్రకటిస్తున్నారు.

పోటీ మాతోనే :

ఇక తమిళనాడులో త్రిముఖ పోరు అన్నది కూడా ఆయన కొట్టి పారేస్తున్నారు. ప్రధానంగా పోటీ అన్నది అధికార డీఎంకే టీవీకేకల మధ్యనే ఉందని స్పష్టం చేస్తున్నారు. అంటే అన్నా డీఎంకే రేసులో లేదని ఆయన పక్కా క్లారిటీగా చెబుతున్నారన్న మాట. ఈ పోటీలో తాము గెలిచి డీఎంకేని ఓటమి చూపిస్తామని చెబుతున్నారు. తమిళనాడులోని ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం మీద తమ రాజకీయ యుద్ధం అని కూడా విజయ్ చెబుతున్నారు. ప్రజలు అంతా విసిగిపోయారని వారు తమ పార్టీని ఎన్నుకుంటారని అంటున్నారు.

పోలరైజ్ అవుతోందా :

సహజంగా కొత్త పార్టీలు వస్తే అవి త్రిముఖ పోరులో సైడ్ అవుతాయి. లేదా ఓట్లను కొంత చీల్చి ఏదో ఒక పార్టీని కానీ కూటమిని కానీ దెబ్బ తీస్తాయి. కానీ తమిళనాడులో మాత్రం పోలరైజేషన్ జరుగుతోందని టీవీకే వర్గాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. అధికార డీఎంకే మీద వారికి ఉన్న కోపం కాస్తా మరో పార్టీకి అనుకూలం అవుతుందని అంటున్నారు. ఆ ప్రజా వ్యతిరేకత గుత్తామొత్తంగా ఒకే వైపు సాగితేనే డీఎంకేని ఓడించగలమని జనాలు భావిస్తున్నారు అని ఆ శక్తి ఒక్క టీవీకేకి మాత్రమే ఉందని భావిస్తున్నారని అంటున్నారు. అందుకే టీవీకే అధినేత విజయ్ ఇంత ధీమాగా చెబుతున్నారు అని అంటున్నారు. చూడాలి మరి తమిళనాడులో ఈసారి అద్భుతం జరుగుతుందా అన్నది. ఆరు దశాబ్దాల తమిళ రాజకీయాన్ని మార్చి రెండు ద్రవిడ పార్టీలని విపక్షానికి పరిమితం చేస్తే కనుక ఇది తమిళనాడు లో లాండ్ మార్క్ విక్టరీగానే ఉంటుందని విశ్లేషిస్తున్నారు.

Tags:    

Similar News