సీఎంవో కాదు సీ-వ్యూ ఆఫీస్ - దళపతి విజయ్ వినూత్న నిర్ణయం
దశాబ్దాల చరిత్ర ఉన్న సీఎంవోని వేరేచోటకు ఎందుకు మార్చాలని అనుకుంటున్నారనేది విస్తృత చర్చనీయాంశంగా మారింది.
తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ సంచలన నిర్ణయాలకు కేరాఫ్ గా మారుతున్నారు. సంప్రదాయ వస్త్రధారణను పక్కన పెట్టి స్టైలిష్ సీఎంగా ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న విజయ్ పాలనలో అనేక సంస్కరణలు ప్రవేశపెడుతున్నారు. ఇప్పుడు ఏకంగా తన పరిపాలనకు కేంద్రమైన ముఖ్యమంత్రి కార్యాలయాన్ని వేరొక చోటకు మార్చేయాలని భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. బ్రిటిష్ కాలం నుంచి మద్రాసు రాష్ట్ర పరిపాలన కేంద్రంగా కొనసాగుతున్న చారిత్రక ‘సెంట్ జార్జ్ కోట’ నుంచి కొత్తగా నిర్మించిన ‘నమ్మక్కల్ కవింజర్ మాళిగై’ భవనంలోకి సీఎంవోను మార్చాలని ముఖ్యమంత్రి విజయ్ నిర్ణయం తీసుకున్నట్లు కథనాలు వస్తున్నాయి. సీఎం తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం ప్రస్తుతం స్టేట్ లో హాట్ టాపిక్ అవుతోంది. దశాబ్దాల చరిత్ర ఉన్న సీఎంవోని వేరేచోటకు ఎందుకు మార్చాలని అనుకుంటున్నారనేది విస్తృత చర్చనీయాంశంగా మారింది.
తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ‘నమ్మక్కల్ కవింజర్ మాళిగై’ భవనంలోకి మార్చాలని ప్రభుత్వం భావిస్తుందని జరుగుతున్న ప్రచారం హాట్ టాపిక్ అవుతోంది. సీఎం దళపతి విజయ్ కోసమే సీఎంవోను కొత్త భవనంలోకి మార్చాల్సివస్తోందని జరుగుతున్న ప్రచారం మరింత ఆసక్తి రేపుతోంది. స్వాతంత్ర్యం వచ్చిన నుంచి తమిళనాడు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు అంతా ఒకే గది నుంచి పాలన కొనసాగించగా, దళపతి విజయ్ మాత్రం తన కార్యాలయాన్ని వేరొకచోటుకు ఎందుకు మార్చుతున్నారనే ప్రశ్న ఉత్కంఠ రేపుతోంది.
ప్రస్తుతం ఉన్న భవనంతో ఇబ్బంది లేకపోయినా, కొన్ని భద్రతా కారణాలు, పరిపాలనలో మార్పులు తేవడానికే సీఎంవోను ‘నమ్మక్కల్ కవింజర్ మాళిగై’ భవనంలోకి మార్చాలని సీఎం భావిస్తున్నారని చెబుతున్నారు. సినీ గ్లామర్ తోపాటు ప్రజలకు అందుబాటులో ఉంటుండటం వల్ల ముఖ్యమంత్రి కార్యాలయానికి రద్దీ ఎక్కువగా పెరిగిపోయిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీనివల్ల సీఎం భద్రతకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని అంటున్నారు. అదే సమయంలో ప్రస్తుతం కార్యాలయాన్ని తరలించాలని భావిస్తున్న భవనంలోనే రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు ఉండటం వల్ల అందరూ ముఖ్యమంత్రికి అందుబాటులో ఉంటారని, అధికారుల పనితీరుపై ముఖ్యమంత్రికి అవగాహన వస్తుందనే ఆలోచనతో ఈ మార్పు చేస్తున్నట్లు చెబుతున్నారు.
అయితే, ముఖ్యమంత్రి కార్యాలయం తరలింపులో ఒక విషయం విశేషంగా చర్చకు తావిస్తోంది. కొత్త సీఎంవో భవనం సముద్రానికి అభిముఖంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ అంశమే ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి పెంచుతోంది. సముద్ర అందాలను అస్వాదించడం కోసమే సీఎం తన కార్యాలయాన్ని తరలించాలని చూస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఏదిఏమైనా సీఎం దళపతి విజయ్ నిర్ణయంతో బ్రిటిష్ కాలం నాటి చారిత్రాత్మకమైన ‘సెంట్ జార్జ్ కోట’ తన వైభవాన్ని కోల్పోతున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 1640లో బ్రిటిష్ వారి హయాంలో నిర్మితమైన ఈ కోట, స్వాతంత్రం అనంతరం రాష్ట్ర ప్రభుత్వ సచివాలయంగా మారింది. ఇక్కడ ఉన్న పురాతన భవనంలో ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయాలు కొనసాగుతున్నాయి.
ఈ సచివాలయ క్యాంపస్‌లోనే 1975లో నిర్మించిన 11 అంతస్తుల ‘నమ్మక్కల్ కవింజర్ మాళిగై’ భవనంలోకి ప్రస్తుతం సీఎంవోను మార్చాలని ప్రతిపాదన పరిశీలిస్తున్నారు. కోట పరిధిలో ఉన్న ఎత్తైన భవనాలలో ఇది ఒకటి. భద్రత, ఆధునిక వసతుల కోసం గతంలో ఈ భవనాన్ని ప్రభుత్వం సుమారు 28 కోట్ల రూపాయలతో పునరుద్ధరించింది.ఈ భవనంలోని 11వ అంతస్తులో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు సీఎం కార్యాలయాన్ని అదే భవనంలోని 10వ అంతస్తులోకి మార్చాలని చూస్తున్నారని చెబుతున్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపడానికి, ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతం చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రభుత్వ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.