హాట్ ఇష్యూ... తమిళనాట ఇకపై హిందీ కనిపించదు, వినిపించదా?

అటు తమిళ మీడియాతో పాటు జాతీయ మీడియాలోనూ వస్తోన్న నివేదికల ప్రకారం.. తమిళనాడు అంతటా హిందీ హోర్డింగ్‌ లు, బోర్డులు, సినిమాలు, పాటలను నిషేధించాలని స్టాలిన్ సర్కార్ భావిస్తోంది!;

Update: 2025-10-15 10:13 GMT

కేంద్ర ప్రభుత్వంతో జరుగుతున్న భాషా వివాదం మధ్య.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని హిందీ వాడకంపై కొత్త తీర్మానాన్ని తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా... రాష్ట్రంలో హిందీ భాష వాడకంపై తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు కథనాలొస్తున్నాయి. అదే జరిగితే తమిళనాట ఇకపై హిందీ కనిపించదు, వినిపించదని అంటున్నారు!

అవును... తమిళనాడులో సీఎం స్టాలిన్ నేతృత్వంలోని ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) ప్రభుత్వం అసెంబ్లీలో హిందీ భాష వాడకాన్ని నిషేధించే బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందనే ప్రచారం సంచలనంగా మారింది. అటు తమిళ మీడియాతో పాటు జాతీయ మీడియాలోనూ వస్తోన్న నివేదికల ప్రకారం.. తమిళనాడు అంతటా హిందీ హోర్డింగ్‌ లు, బోర్డులు, సినిమాలు, పాటలను నిషేధించాలని స్టాలిన్ సర్కార్ భావిస్తోంది!

ఈ బిల్లుపై చర్చించడానికి ముఖ్యమంత్రి స్టాలిన్ తో పాటు కేబినెట్ కలిసి.. మంగళవారం రాత్రి న్యాయ నిపుణులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసిందని సమాచారం. ఈ నేపథ్యంలో అక్టోబర్ 17వరకూ జరగనున్న ఈ అసెంబ్లీ సమావేశాల్లో బుధ, గురు వారాల్లో ఈ బిల్లును డీఎంకే ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుందని అంటున్నారు. అదే జరిగితే ఈ నిర్ణయం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారనుంది!

ఈ సందర్భంగా స్పందించిన డీఎంకే పార్టీ సీనియర్ నాయకుడు టీకేఎస్ ఎలంగోవన్.. ప్రాంతీయ భాషలపై హిందీని రుద్దడానికి ప్రతిస్పందనగా ఈ బిల్లు వస్తోందని అన్నారు. ఇదే సమయంలో.. తాము రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏమీ చేయమని.. దానికి కట్టుబడి ఉంటామని చెబుతూ.. హిందీని రుద్దడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని వ్యాఖ్యానించారు!

మారిన రూపాయి చిహ్నం!:

తమిళనాడులో హిందీ భాష వాడకంపై స్టాలిన్ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఈ ఏడాది మార్చిలో 2025-26 రాష్ట్ర బడ్జెట్ చిహ్నం నుండి రూపాయి చిహ్నమైన '₹' స్థానంలో తమిళ అక్షరం 'రూ' ను ఉంచారు. ఈ విషయంలో తమిళనాట మేధావులు, ప్రజల నుంచి స్టాలిన్ సర్కార్ కి మద్దతు లభించిందని అంటారు!

మరోవైపు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన త్రిభాషా విధానాన్ని సీఎం స్టాలిన్ వ్యతిరేకిస్తున్నారు. ఈ సందర్భంగా... రాష్ట్ర ప్రజలపై భారతీయ జనతాపార్టీ హిందీని కావాలనే బలవంతంగా రుద్దుతోందని ఆయన పదే పదే ఆరోపించారు. ఇదే సమయంలో... రాష్ట్ర ద్విభాషా విధానం (తమిళం, ఇంగ్లీష్) విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధికి ప్రయోజనం చేకూర్చిందని అన్నారు.

25 భారతీయ భాషలు అంతరించిపోయాయి!:

ఈ ఏడాది ఫిబ్రవరిలో మాట్లాడుతూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్... బలవంతంగా హిందీని రుద్దడం వల్ల 100 సంవత్సరాలలో 25 ఉత్తర భారత భాషలు అంతరించిపోయాయని అన్నారు. ఇందులో భాగంగా... భోజ్‌ పురి, అవధి, మైథిలీ, గర్వాలీ, కుమావోని, బ్రజ్, బుందేలీ, మాల్వీ, ఛత్తీస్‌ గఢి, మగాహి, మార్వారీ, సంథాలీ, ఖరియా, ఖోర్తా, అంజికా, హో, కుర్మాలి, కురుఖ్, ముండారి వంటి అనేక భాషలు ఇప్పుడు ఉనికి కోసం గాలిస్తున్నాయని తెలిపారు!

Tags:    

Similar News