తాలిబన్ అఫ్ఘాన్.. భారత్ దోస్తాన్..మోటోవ్లాగర్ స్వాగతమే సాక్ష్యం
కాందహార్.. ఈ పేరు భారతీయులకు బాగా గుర్తుంటుంది. 1999లో పాకిస్థాన్ ఉగ్రవాదులు నేపాల్ నుంచి వస్తున్న భారత విమానాన్ని హైజాక్ చేసి తీసుకెళ్లింది కాందహార్ కే.;
కాందహార్.. ఈ పేరు భారతీయులకు బాగా గుర్తుంటుంది. 1999లో పాకిస్థాన్ ఉగ్రవాదులు నేపాల్ నుంచి వస్తున్న భారత విమానాన్ని హైజాక్ చేసి తీసుకెళ్లింది కాందహార్ కే. కారణం.. అప్పట్లో ఆ నగరం తాలిబన్ల ఆధీనంలో ఉంది. నాడు తాలిబన్లు పాక్ కు జాన్ జిగ్రీ. దీంతో భారత విమానాన్ని తాలిబన్లు కొన్ని రోజుల పాటు కాపలా కాశారు. ఉగ్రవాదులను భారత ప్రభుత్వం విడుదల చేశాక.. పాక్ ఆదేశాల మేరకు విమానాన్ని వదిలిపెట్టారు. అంతగా పాక్-తాలిబన్ బంధం బలంగా ఉండేది. మరిప్పుడు.. పాక్ పేరు చెబితినే తాలిబన్లు తాచుపాములా అంతెత్తున లేస్తున్నారు.
నాలుగేళ్ల కిందట ఆందోళన...
అమెరికా దళాలు వెళ్లిపోవడం ఆలస్యం సరిగ్గా నాలుగేళ్ల కిందట తాలిబాన్లు మొత్తం అఫ్ఘానిస్థాన్ ను హస్తగతం చేసుకున్నారు. దీంతో అప్పట్లో తీవ్ర భయాందోళనలు కమ్ముకున్నాయి. మరీ ముఖ్యంగా భారత్ తో వారు ఎలా ఉంటారనే ప్రశ్నలు వచ్చాయి. కశ్మీర్ విషయంలోనూ తాము కలగజేసుకుంటామంటూ ప్రకటనలు ఇచ్చారు. కానీ, కాలం అన్నిటికీ సమాధానం చెబుతుంది అన్నట్లు... దుష్మన్ ఎవరో, దోస్తాన్ ఎవరో తాలిబన్లు గుర్తించారు. పాకిస్థాన్ అసలు బుద్ధి తెలిశాక వారిలో మార్పు మొదలైంది. భారత్ పై సానుకూల ధోరణి కనబర్చడం మొదలుపెట్టారు.
భారత్ స్నేహ హస్తం..
అఫ్ఘాన్ లో తాలిబన్ల పాలనను భారత్ సహా ప్రపంచం గుర్తించలేదు. అయితే, మన దేశం మాత్రం అఫ్ఘాన్ తో దౌత్య సంబంధాలు కొనసాగిస్తోంది. మే నెలలో అఫ్ఘాన్ మంత్రితో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్ లో మాట్లాడారు. పెహల్గాం ఉగ్రదాడిని తాలిబన్లు ఖండించడాన్ని స్వాగతించారు. ఇప్పుడు రెండు దేశాల సంబంధాల్లో కీలక ఘటన జరగనుంది. అఫ్ఘాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ మరికొద్ది రోజుల్లో భారత్ రానున్నారు. తాలిబన్ పాలన మొదలయ్యాక అక్కడి నాయకులు భారత్ లో పర్యటించడం ఇదే మొదటిసారి. వాస్తవానికి ఇప్పటికే ఆయన భారత్ రావాల్సింది. కానీ, భద్రతా మండలి ఆంక్షలు ఉండడంతో వీలు కాలేదు. ఇప్పుడు మండలి మినహాయింపు ఇవ్వడంతో భారత పర్యటనకు రూట్ క్లియర్ అయింది.
భారత్ నుంచి వచ్చారా...?
తాజాగా భారత్ కు చెందిన మోటో వ్లాగర్ ఒకరు అఫ్ఘాన్ కు వెళ్లారు. సరిహద్దులో చెక్ పోస్టు వద్ద ఆయనను తాలిబన్ సైనికుడు ఆపారు. అయితే, తాను భారత్ నుంచి వస్తున్నట్లు అతడు తెలపడంతో మర్యాదగా స్వాగతించారు. పాస్ పోర్టు కూడా అడగలేదు. పైగా చాయ్ ఇచ్చి స్వాగతించారు. ఇది భారత్ పట్ల తాలిబన్ల వైఖరి పూర్తిగా మారింది అనేందుకు నిదర్శనం అని నెటిజన్లు కొనియాడుతున్నారు.
కొసమెరుపుః భౌగోళికంగా అఫ్ఘానిస్థాన్ తో భారత్ కు సరిహద్దు ఉంది. కానీ, అది పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో ఉంది. భవిష్యత్ లో భారత్ గనుక పీవోకేను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తే అఫ్ఘాన్ తాలిబన్లు మనకు సాయం చేయడం ఖాయం. భారత దౌత్య విజయానికి ఇదొక మచ్చుతనకగా నిలుస్తోంది.