చెస్‌ను బ్యాన్ చేసిన తాలిబన్లు.. ఎందుకో తెలుసా?

అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం ఓ కొత్త రూల్ తీసుకొచ్చింది. అదేంటంటే ఇకపై అక్కడ చెస్ ఆడకూడదట.;

Update: 2025-05-12 07:00 GMT

అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం ఓ కొత్త రూల్ తీసుకొచ్చింది. అదేంటంటే ఇకపై అక్కడ చెస్ ఆడకూడదట. ఎందుకంటే ఆ ఆట జూదానికి దారి తీస్తుందని వాళ్లు భావిస్తున్నారట. తమ ఇస్లామిక్ చట్టాల ప్రకారం జూదం ఆడటం నేరం కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నామని వాళ్లు చెప్తున్నారు. ఈ విషయాన్ని అక్కడి క్రీడా శాఖ అధికారి ఒకరు ఆదివారం ధృవీకరించారు. అఫ్గానిస్తాన్‌లో అన్ని క్రీడా కార్యక్రమాలను చూసేది తాలిబన్ల క్రీడా విభాగమే. ఆ శాఖ ప్రతినిధి అటల్ మష్వానీ చెప్పిన దాని ప్రకారం.. షరియా చట్టం ప్రకారం చెస్‌ను జూదంగా పరిగణిస్తున్నారట. తాలిబన్లు ఈ చట్టాన్ని చాలా కఠినంగా పాటిస్తారు.

మష్వానీ ఇంకా మాట్లాడుతూ.. "షరియాలో చెస్‌ను జూదానికి ఒక మార్గంగా భావిస్తారు. గతేడాది ప్రకటించిన ఓ చట్టం ప్రకారం ఇది నిషేధించబడినట్లు ఆయన తెలిపారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం మతపరమైన అంశాలేనని ఆయన స్పష్టం చేశారు. "చెస్ క్రీడ విషయంలో మతపరమైన కొన్ని ఆందోళనలు ఉన్నాయి. ఆ సమస్యలు పరిష్కారమయ్యే వరకు అఫ్గానిస్తాన్‌లో చెస్‌పై నిషేధం కొనసాగుతుంది" అని మష్వానీ తేల్చి చెప్పారు.

స్థానికుల పరిస్థితి ఏంటి?

కాబూల్‌లో అజీజుల్లా గుల్జాదా అనే వ్యక్తికి ఒక కేఫ్ ఉంది. అక్కడ గత కొన్నేళ్లుగా అనధికారికంగా చెస్ పోటీలు జరిగేవి. అయితే అక్కడ ఎలాంటి జూదం జరగలేదని ఆయన ఖండించారు. అంతేకాదు, చాలా ముస్లిం దేశాల్లో చెస్ ఆడుతున్నారని ఆయన గుర్తు చేశారు. "చాలా ఇతర ఇస్లామిక్ దేశాల్లో అంతర్జాతీయ స్థాయిలో ఆడే ప్లేయర్లు ఉన్నారు" అని ఆయన ఏఎఫ్పీ వార్తా సంస్థతో అన్నారు.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని, కానీ ఇది తన వ్యాపారానికి, ఆ ఆటను ఇష్టపడేవారికి బాధ కలిగిస్తుందని ఆయన అన్నారు. "ఈ రోజుల్లో యువతకు పెద్దగా సరైన పనులు లేవు. అందుకే చాలా మంది ప్రతిరోజూ ఇక్కడికి వచ్చేవారు. ఒక కప్పు టీ తాగి తమ స్నేహితులతో చెస్ ఆడేవారు" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అఫ్గానిస్తాన్ అధికారులు గత కొన్నేళ్లుగా ఇతర క్రీడలపై కూడా ఆంక్షలు విధించారు. దేశంలో మహిళలు క్రీడల్లో పాల్గొనకుండా పూర్తిగా నిషేధించారు. గత ఏడాది, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) వంటి ఫ్రీ ఫైటింగ్ ప్రొఫెషనల్ పోటీలను కూడా ప్రభుత్వం నిషేధించింది. అది చాలా హింసాత్మకంగా.. షరియాకు విరుద్ధంగా ఉందని వారు చెప్పారు.

Tags:    

Similar News