రూ.1.47 కోట్లు పన్ను కట్టని తాజ్ బంజారా వారి సొంతమైంది

కొన్ని ఉదంతాలు చాలా చిత్రంగా ఉంటాయి. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఆ కోవకు చెందిందే. హైదరాబాద్ మహానగరంతో పరిచయం ఉన్న చాలామందికి తెలిసే ఫైవ్ స్టార్ హోటల్ లో ఒకటి తాజ్ బంజారా.;

Update: 2025-12-12 03:47 GMT

కొన్ని ఉదంతాలు చాలా చిత్రంగా ఉంటాయి. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఆ కోవకు చెందిందే. హైదరాబాద్ మహానగరంతో పరిచయం ఉన్న చాలామందికి తెలిసే ఫైవ్ స్టార్ హోటల్ లో ఒకటి తాజ్ బంజారా. హైదరాబాద్ లోని ల్యాండ్ మార్క్ ఫైవ్ స్టార్ హోటళ్లలో తాజ్ బంజారా ఒకటి. ఇప్పుడంటే హైదరాబాద్ మహానగరంగా మారింది. పాతికేళ్ల క్రితం ఈ నగరానికి చారిత్రక నగరంగా పేరున్నా.. ప్రపంచ స్థాయిలో దీని గురించి మాట్లాడుకున్నది తక్కువే.

ఐటీ పుణ్యమా అని ఎక్కడలేని గుర్తింపు ఈ నగరానికి దక్కింది. అలానే తాజ్ కు చెందిన మూడు హోటళ్లు బంజారాహిల్స్ లో ప్రముఖంగా కనిపిస్తాయి. అందులో మొదటిది తాజ్ దక్కన్ అయితే రెండోది తాజ్ క్రిష్ణా.. ఈ రెండు హోటళ్లు ఎదురెదురుగా ఉంటాయి. వీటికి కాస్త దూరంలో.. ఉండే తాజ్ బంజారా ప్రత్యేకత ఏమంటే.. ఈ హోటల్ కు వెళ్లే ముందు నీటి కొలను వస్తుంది. మహానగరంలో కాంక్రీట్ జంగిల్ అన్న దానికి భిన్నమైన వాతావరణం ఉంటుంది.

బంజారాహిల్స్ రోడ్ నెంబరు వన్ లాంటి రద్దీ ప్రాంతంలో.. ఈ హోటల్ కు వెళ్లే రహదారిలోకి ఎంట్రీతోనే మనసును ఆకట్టుకునేలా పరిసరాలు ఉంటాయి. అలాంటి ఈ హోటల్ ఇటీవల కాలంలో నిర్వాహణ పరంగా విమర్శలు ఎదుర్కొన్న దుస్థితి. కాలంతో పాటు తనను తాను మార్చుకునే విషయంలో వెనుకపడిందన్న ఆరోపణ ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే. ఈ ఏడాది మొదట్లో ఊహించని రీతిలో ఈ హోటల్ ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారన్న వార్త షాకిచ్చేలా చేసింది.

ప్రైమ్ లొకాలిటీలో ఉన్న ఈ హోటల్ జీహెచ్ఎంసీకి 1.47 కోట్ల పన్ను చెల్లించని కారణంగా సీజ్ చేసినట్లుగా అధికారులు ప్రకటించారు. కట్ చేస్తే.. అప్పటి నుంచి ఈ హోటల్ అలా ఉంది. తాజాగా మరోసారి ఈ హోటల్ వార్తల్లోకి వచ్చింది. కారణం.. దీన్ని ఒక సంస్థ సొంతం చేసుకోవటమే. తాజాగా ఈ హోటల్ ను రూ.315 కోట్లకు ఆరో రియాల్టీ సంస్థ సొంతం చేసుకుందని వెల్లడైంది. ఇంతకు ముందు వరకు తాజ్ బంజారా హోటల్ ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ నిర్వాహణలో ఉండేది. తాజ్ బంజారాను ఆరో రియాల్టీ సంస్థ కొనుగోలు చేసిన వైనం వ్యాపార వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెర తీసింది. ఎందుకంటే ఆరో రియాల్టీ ఎవరిదంటే.. అరబిందో గ్రూపునకు (అరబిందో ఫార్మా) చెందిన రియల్ ఎస్టేట్ విభాగం. దీని డైరెక్టర్లుగా వెంకటరామిరెడ్డి.వి, బాలా వీర సత్య సుబ్రహ్మణ్యం గాదెలు ఉన్నారు. ఈ సంస్థకు సీఈవోగా రవీంద్రకుమార్ వీజే ఉన్నారు.

Tags:    

Similar News