ఎవరీ రాణా? వారి అరాచకం ఎంతంటే?
పాక్ మూలాలు ఉన్న రాణా 1990లో కెనడాకు వలస వెళ్లాడు. దానికి ముందు అతడు పాకిస్థాన్ లోని ఆ దేశ సైనిక మెడికల్ కోర్ లో పని చేసేవాడు.;
ముంబయి మారణహోమంలో కీలక సూత్రధారుల్లో ఒకడు తహవ్వు హుస్సేన్ రాణా. కెనడా జాతీయుడైన ఇతడ్ని కొన్నేళ్ల క్రితం అమెరికాలో అరెస్టు చేయటం.. నేరస్తుల అప్పగింతలో భాగంగా తాజాగా అతడ్ని భారత్ కు అప్పగించింది అమెరికా. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ భారత్ కు తీసుకొచ్చారు. ఈ పాక్ మూలాలు ఉన్న రాణా కతేంటి? కెనడాకు ముందు అతడేం చేసేవాడు? కెనడా నుంచి అమెరికాకు.. ఆ తర్వాత ముంబయి ఉగ్ర పేలుళ్లలో అతగాడి పాత్ర తదితర అంశాల్ని చూస్తే..
పాక్ మూలాలు ఉన్న రాణా 1990లో కెనడాకు వలస వెళ్లాడు. దానికి ముందు అతడు పాకిస్థాన్ లోని ఆ దేశ సైనిక మెడికల్ కోర్ లో పని చేసేవాడు. అక్కడ ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీని షురూ చేసి.. కెనడా నుంచి అమెరికాకు వెళ్లాడు. అక్కడి షికాగోలో ఆఫీసు ఓపెన్ చేశాడు. తన సంస్థ ద్వారా హెడ్లీ ముంబయిలో గూఢచర్యానికి పాల్పడేలా ఛాన్స్ ఇచ్చాడు. అతడు ఇచ్చిన సమాచారంతోనే ఉగ్రవాదులు తమ టార్గెట్లను పూర్తి చేశారు. ఉగ్రదాడికి ముందు తన భార్యతో సహా భారత్ కు వచ్చిన రాణా.. ఉత్తరాది, దక్షిణాది ప్రాంతాల్లో పలు చోట్ల పర్యటించాడు. ప్రస్తుతం ఇతడికి 64 ఏళ్లు. ముంబయి మారణహోమం సమయానికి ఇతడికి 47 ఏళ్లు.
ఉత్తరప్రదేశ్ లోని హాపుర్.. ఆగ్రా.. ఢిల్లీ.. కేరళలోని కొచ్చి.. గుజరాత్ లోని అహ్మదాబాద్.. ముంబయిలో తిరిగాడు. ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా.. హర్కత్ ఉల్ జిహాదీ ఇస్లామీతో పాటు డేవిడ్ కోల్ మన్ హెడ్లీ అలియాస్ దావూద్ గిలానీ.. మరికొందరితో కలిసి ముంబయిలో మారణహోమానికి ప్లాన్ చేసి వందలాది మంది ప్రాణాలు పోవటానికి కారణమయ్యారు. అరేబియా సముద్ర మార్గంలో భారత్ కు చేరుకున్న ఉగ్రవాదులు దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పలుచోట్ల దాడులకు పాల్పడటం తెలిసిందే. ఈ ఘటనల్లో 166మంది మరణించగా.. 238 మంది గాయపడ్డారు. ఉగ్రవాదులు తమ లక్ష్యాలకు చేరుకోవటానికి అవసరమైన సమాచారాన్ని సమకూర్చింది రాణానే.
ముంబయి ఉగ్రదాడిలో ప్రధాన భాగస్వాముల్లో ఒకడైన రాణాకు సంబంధించిన సమాచారాన్ని.. పలు ఆధారాల్ని భారత్ అమెరికాకు ఇచ్చింది. ఈ నేపథ్యంలో అతడ్ని 2009 అక్టోబరులో అరెస్టు చేశారు. అయితే.. ఈ కేసులో తనకు సంబంధం లేదని చెబుతూ.. కేసు నుంచి తప్పించుకున్నాడు. కట్ చేస్తే.. 2011లో మరో కేసులో అతడ్ని అరెస్టు చేశారు. ఈ కేసులో అతడికి 14 ఏళ్లు జైలుశిక్ష పడింది. భారత్ - అమెరికా మధ్య నేరస్తులను ఎక్సైంజ్ చేసుకునే ఒప్పందం ఉండటంతో రాణాను భారత్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఎట్టకేలకు అది కాస్తా పూర్తైంది.
ఇదే కేసులో అంతకు ముందు అజ్మల్ కసబ్.. జబీయుద్దీన్ అన్సారీ అలియాస్ అబు జుందాల్ లు విచారణ ఎదుర్కోవటం.. కసబ్ ను ఉరి తీయటం తెలిసిందే. ఇక.. రాణాను తిహార్ జైల్లో ఉంచేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. రాణాను అప్పగించేందుకు అమెరికా ఓకే చెప్పటం.. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రత్యేక విమానంలో జాతీయ దర్యాప్తు సంస్థ లాస్ ఏంజెలెస్ నుంచి ఢిల్లీకి తీసుకురావటం తెలిసిందే.
ఎయిర్ పోర్టులో లాంఛనంగా అరెస్టు చేసి.. అనంతరం సీజీవో కాంప్లెక్స్ లోని ఎన్ఐఏ ఆఫీసుకు తరలించారు. రాత్రి వేళలో పటియాలా హౌస్ కోర్టులో హాజరుపర్చారు. రాణాను తరలించే వేళలో అటు ఎయిర్ పోర్టులోనూ.. ఇటు ఎన్ఐఏ కార్యాలయం వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎన్ఐఏ చుట్టుపక్కల రోడ్లను మూసేసి.. ట్రాఫిక్ ను మళ్లించారు. ఇక.. కోర్టులోకి ఎవరినీ అనుమతించలేదు. మీడియాను దూరంగా ఉంచేశారు. ఇతడికి రక్షణగా ఎన్ఐఏ టీంతో పాటు ఎన్ఎస్ జీ కమాండోలు ఉండటం గమనార్హం.