మ‌రోసారి 'వైఎస్‌' పేరు తీసేశారు.. ఏం జ‌రిగింది?

వైసీపీ హ‌యాంలో ప‌లు ప్రాంతాల‌కు దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పేరును పెట్టారు.;

Update: 2025-09-20 04:44 GMT

వైసీపీ హ‌యాంలో ప‌లు ప్రాంతాల‌కు దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పేరును పెట్టారు. అప్ప‌టి వైసీపీ నాయ‌కుల కోరిక‌, జ‌గ‌న్ ఆకాంక్ష‌ల మేర‌కు.. ప‌లు ప్రాంతాల‌కు వైఎస్ పేరును పెడుతూ నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే, కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత ఆ పేరును మార్పు చేస్తోంది. గ‌తంలో క‌డ‌ప జిల్లా ఉంటే.. వైసీపీ హ‌యాంలో క‌డ‌ప పేరు తీసేసి.. 'వైఎస్సార్‌' జిల్లాగా మార్చారు. అయితే, కూట‌మి వ‌చ్చాక క‌డ‌ప‌ను-వైఎస్సార్‌ను క‌లిపి 'వైఎస్సార్ క‌డ‌ప జిల్లా'గా మార్పు చేసింది. ఇదే త‌ర‌హాలో ఇప్పుడు విజ‌య‌వాడ శివారులోని తాడిగ‌డ‌ప ప్రాంతానికి కూడా పేరును మార్చింది.

వైసీపీ హ‌యాంలో తాడిగ‌డ‌ప పేరును 'వైఎస్సార్ తాడిగ‌డ‌ప‌'గా పేరు పెడుతూ.. అప్ప‌టి కేబినెట్ నిర్ణ‌యం తీసుకుంది. అయితే.. దీనిపై టీడీపీ నాయ‌కులు స‌హా.. స్థానికుల నుంచి అభ్యంత‌రాలు రావ‌డంతో తాజాగా నిర్వ‌హించిన కేబినెట్ స‌మావేశంలో సీఎం చంద్ర‌బాబు 'తాడిగ‌డ‌ప మునిసిపాలిటీ' పేరును పున‌రుద్ధ‌రించారు. దీనికి వైసీపీ హ‌యాంలో పెట్టిన 'వైఎస్సార్‌' పేరును తీసేశారు. అదేవిధంగా రాజ‌ధాని అమ‌రావ‌తి కోసం.. రైతులు గ‌తంలోనే 33 వేల ఎక‌రాల భూముల‌ను స‌మీక‌ర‌ణ‌(పూలింగ్‌) విధానంలో ఇచ్చారు. అయితే.. ఇలా ఇచ్చిన భూముల్లో మ‌ధ్య మ‌ధ్యలో ఉన్న భూములను కొంద‌రు ఇవ్వ‌లేదు. దీనిపై పెద్ద ఎత్తున వివాద‌మే న‌డుస్తోంది.

ఈ క్ర‌మంలో రాజ‌ధాని ప్రాంత సాధికార, అభివృద్ధి సంస్థ‌(సీఆర్ డీఏ) ఆయా భూముల‌ను సేక‌ర‌ణ‌(ల్యాండ్ అక్విజిష‌న్‌) విధానం లో అయినా.. తీసుకునేందుకు రెడీ అయింది. దీంతో రైతుల‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు ఉండ‌వు. కేవ‌లం సేక‌ర‌ణ కింద వారికి రావాల్సిన ప‌రిహారాన్ని ఇస్తారు. ఈ విష‌యంపై రైతుల‌నుంచి అందిన విజ్ఞ‌ప్తులు.. స్థానికంగా ఉన్న నాయ‌కులు చేసిన విన్న‌పాల నేప‌థ్యంలో స‌ద‌రు 350 ఎక‌రాల‌కుపైగా భూముల‌ను కూడా పూలింగ్ విధానంలోనే సేక‌రించేందుకు కేబినెట్ నిర్ణ‌యించింది. రైతుల‌ను ఇబ్బంది పెట్ట‌కుండా వారికి మేలు జ‌రిగేలా నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని కేబినెట్ తీర్మానం చేసింది.

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించిన కీల‌క విష‌యాల‌పై కూడా కెబినెట్ చ‌ర్చించింది. స్థానిక ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ముందు.. ఓట‌ర్ల జాబితాను స‌వ‌రించేందుకు, పున‌రుద్ధ‌రించేందుకు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి అధికారం క‌ల్పిస్తూ నిర్ణ‌యించారు. ఇదేస‌మ‌యంలో వాటి కోసం గ‌తంలో నిర్ణ‌యించిన తేదీలకు మ‌రో రెండు రోజుల పాటు వెసులుబాటు క‌ల్పించారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్య‌వ‌సాయ భూముల‌ను పారిశ్రామిక అవ‌స‌రాల కోసం మార్చుకునేందుకు నాలా ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. దీనిని పూర్తిగా ర‌ద్దు చేయాల‌ని గ‌తంలోనే నిర్ణ‌యించారు. తాజాగా దీనికి కూడా కేబినెట్ తీర్మానం చేసింది.

Tags:    

Similar News