బీఆర్ఎస్ తో డీల్.. బీజేపీ కూడా టచ్ లోకి.. ఆసక్తికరంగా జీవన్ రెడ్డి ఎపిసోడ్
బీఆర్ఎస్ లో చేరేందుకు జీవన్ రెడ్డి ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారని అంటున్నారు. బీఆర్ఎస్ సైతం జీవన్ రెడ్డి రాకను స్వాగతిస్తోందని అంటున్నారు.;
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత టి.జీవన్ రెడ్డి పార్టీ మార్పుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధమైన జీవన్ రెడ్డి నెక్ట్స్ ఏ పార్టీ చేరనున్నారనేది బయటకి చెప్పలేదు. రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకోవాల్సిన దశలో... కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతున్న జీవన్ రెడ్డి తన సెకెండ్ ఇన్నింగ్స్ పై సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అధికార పార్టీ నుంచి ఓ సీనియర్ నేత బయటకు వస్తుండటాన్ని తమకు అనుకూలంగా మార్చుకోడానికి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తోపాటు బీజేపీ చురుకుగా పావులు కదుపుతోందని అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని దాదాపు నిర్ణయించుకున్న జీవన్ రెడ్డి తన తదుపరి మజిలీ ఏ పార్టీతో అనే విషయంపై తర్జనభర్జనకు గురవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ లో ప్రస్తుతం తనకు అనువైన వాతావరణం లేదని భావించిన జీవన్ రెడ్డి ముందుగా బీఆర్ఎస్ అగ్రనాయకత్వంతో టచ్ లోకి వెళ్లినట్లు చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరడంతో ఆయన రాజకీయ ప్రత్యర్థిగా తాను బీఆర్ఎస్ లో చేరడమే ఉత్తమమని ఆయన నిర్ణయించుకున్నారని అంటున్నారు. అయితే ఈ సమయంలో బీజేపీ అగ్ర నాయకత్వం రంగంలోకి దిగి జీవన్ రెడ్డిని పునరాలోచనలో పడేసిందని ప్రచారం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
బీఆర్ఎస్ లో చేరేందుకు జీవన్ రెడ్డి ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారని అంటున్నారు. బీఆర్ఎస్ సైతం జీవన్ రెడ్డి రాకను స్వాగతిస్తోందని అంటున్నారు. కానీ, బీజేపీ నేతలు మాత్రం బీఆర్ఎస్ కంటే తమ పార్టీ బెటర్ అంటూ పెద్ద ఆఫర్ ఇచ్చారని వ్యాఖ్యానిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం అధికారం లేదని, అధికారం వదులుకుని వస్తున్న జీవన్ రెడ్డి మూడేళ్లు ప్రతిపక్షంగా పోరాడే బదులు, తమ పార్టీలోకి వస్తే మంచి గుర్తింపు, గౌరవం ఇస్తామని బీజేపీ ఆఫర్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం తమకు కేంద్రంలో అధికారం ఉందని, మళ్లీ తమ పార్టీయే కేంద్రంలో అధికారంలోకి వస్తుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ రాష్ట్రంలో ప్రధాన రాజకీయ శక్తిగా ఎదుగుతుందని, ఇందుకు ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలను ఉదహరిస్తున్నారని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తామని లేని పక్షంలో కేంద్రంలో అధికారం ఉంటుంది కనుక తగిన గౌరవం ఇస్తామని బీజేపీ ఆఫర్ చేస్తోందని అంటున్నారు.
దీంతో సీనియర్ నేత జీవన్ రెడ్డి పునరాలోచనలో పడినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం తెలిసి బీఆర్ఎస్ కూడా అప్రమత్తమైనట్లు వ్యాఖ్యానిస్తున్నారు. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ను రంగంలోకి దింపి జీవన్ రెడ్డి చేరికను ఫైనల్ చేయాలని సూచించినట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో జీవన్ రెడ్డి తదుపరి మజిలిపై హాట్ డిబేట్ జరుగుతోంది.