మమత పెంచిన సువేందు- ఓడించి మరీ గద్దెనెక్కి !

మమతా బెనర్జీ విప్లవ వనిత. ఆమె చిన్న నాటి నుంచి దూకుడుగానే ఉండేవారు. ఆమె రాజకీయ జీవితం 1976లో కాంగ్రెస్ తో మొదలైంది.;

Update: 2026-05-08 17:48 GMT

మమతా బెనర్జీ విప్లవ వనిత. ఆమె చిన్న నాటి నుంచి దూకుడుగానే ఉండేవారు. ఆమె రాజకీయ జీవితం 1976లో కాంగ్రెస్ తో మొదలైంది. 21 ఏళ్ళ వయసులోనే బెంగాల్ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పదవిని చేపట్టారు. ఇక 29 ఏళ్ళ వయసులో జాదవ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి సీపీఎం యోధుడు అప్పటికి రెండు సార్లు గెలిచిన దిగ్గజ నేత సోమనాధ్ చటర్జీని ఓడించారు. అలా ఆమె పిన్న వయసులోనే తన పేరు మారు మోగేలా చేసుకున్నారు. దేనికైనా వెరవని తత్వం మొండిగా ముందుకు సాగే నైజం మమత సొంతం. ఇక మమత 1997 దాకా కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. 1998లో ఆమె తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ప్రారంభించారు.

శిష్యుడుగా మొదలై :

ఇక పశ్చిమ బెంగాల్ కి కొత్త ముఖ్యమంత్రి కాబోతున్న సువేందు అధికారి 1995లో తొలిసారి కాంగ్రెస్ తరఫున కాంటాయ్ మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఆయనది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలైన రాజకీయమే. 1998 నాటికి ఆయన మమతా బెనర్జీతో కలిసి తృణమూల్ కాంగ్రెస్ స్థాపనలో పాలు పంచుకున్నారు. 2006లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంతి దక్షిణ్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఆయన ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

కలసి వచ్చిన పోరాటం :

ఇక సువెందు అధికారి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో మమతా బెనర్జీ కీలక అనుచరుడిగా ఎదిగారు. నందిగ్రాం లో ఎకనమిక్ సెజ్‌లకు వ్యతిరేకంగా పోరాడిన రైతులకు అండగా పోరాడిన నాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తరువాత రెండు సార్లు ఎంపీ అయ్యారు. ఇక 2016లో తృణమూల్ కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రిగా వివిధ హోదాల్లో పనిచేశారు. మమతకు ఎంతో దగ్గరి వారిగా పేరు తెచ్చుకున్నారు. మమతకు సువేందు అధికారి అంటే ఎంతో నమ్మకం. తృణమూల్ కాంగ్రెస్ లో ఆయన నంబర్ టూ స్థానంలో ఉండేవారు.

ఆయన వల్లనే గ్యాప్ :

అయితే తృణమూల్ కాంగ్రెస్ లో మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ రంగ ప్రవేశంతో సువేందుకు మమతకు మధ్యన బిగ్ గ్యాప్ ఏర్పడింది. 2011లో మమత తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత అభిషేక్ బెనర్జీ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆయన తృణమూల్ స్టూడెంట్ కాంగ్రెస్ విభాగానికి అధ్యక్షుడిగా తన కార్యకలాపాలు ప్రారంభించారు. 2014 లో తొలిసారి అభిషేక్ బెనర్జీ దక్షిణ 24 పరగణాల జిల్లా, డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుండి లోక్ సభకు పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత 2019, 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అదే సీటు నుంచి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఆయన రాకతో సువేందు అధికారి ప్రాధాన్యత పార్టీలో గణనీయంగా తగ్గడం మొదలైంది.

తీవ్ర అసంతృప్తితోనే :

ఈ నేపథ్యంలో తీవ్ర అసంతృప్తితో సువేందు అధికారి తృణమూల్ కాంగ్రెస్ కి 2020 డిసెంబరు 17న రాజీనామా చేశారు. ఆ వెంటనే డిసెంబర్ 19న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు ఇక ఆయన 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి మమతా బెనర్జీపై 1,736 ఓట్ల స్వల్ప మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు. మూడు సీట్లు ఉన్న బీజేపీని ఏకంగా 78 సీట్లు అందించి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో నిలబెట్టారు. దాంతో ఆయనను తరువాత బీజేపీ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా నియమించారు. 2026 ఎన్నికల్లో అయితే ఏకంగా 206 సీట్లు బీజేపీకి దక్కేలా చేయడంలో ఆయనది అత్యంత కీలకమైన పాత్ర. దాంతో ఆయనకే ఈ రోజున బీజేపీ ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించింది. మొత్తానికి చూస్తే మమత పెంచి పోషించిన సువేందు అధికారి ఆమె మీదనే రెండు సార్లు పోటీ చేసి ఎమ్మెల్యేగా ఓడించారు, మాజీ ముఖ్యమంత్రిని చేశారు. తన జీవిత కాలం కల అయిన సీఎం పోస్టు దక్కించుకుని ఈ నెల 9న బెంగాల్ కి 9వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. రాజకీయాల్లో ఇలాంటి ట్విస్టులే ఉంటాయి మరి.

Tags:    

Similar News