మమత భరించలేని వ్యక్తి బెంగాల్ సీఎంగా ?

మమతకు తృణమూల్ కాంగ్రెస్ పెట్టినపుడు కుడి భుజంగా ఉన్న వారు సువేందు అధికారి. ఆమె వల్లనే తొలిసారి 2006లో ఎమ్మెల్యేగా ఆ పార్టీ నుంచి గెలిచారు.;

Update: 2026-05-05 06:52 GMT

బెంగాల్ లో మమతా బెనర్జీకి జరిగిన పరాభావం ఒకటి కాదు రెండు కాదు మూడు. అవేంటి అంటే తాజాగా జరిగిన భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీని సీఎం గా ఉండగానే బీజేపీ నాయకుడు సువేందు అధికారి ఓడించారు. అలా ఇలా కాదు ఏకంగా 15 వేల పై చిలుకు భారీ తేడాతో. అంతకు ముందు 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమత నందిగ్రాం లో పోటీ చేస్తే అక్కడ కూడా సువేందు అధికారి పోటీ చేసి ఓడించారు. ఆ తరువాత ఉప ఎన్నికల్లో పోటీ చేసి మమత సీఎం గా కొనసాగారు. ఇలా రెండు సార్లు వ్యక్తిగతంగా మమతను ఓడించడమే కాదు ఆమెను గద్దె నుంచి దించడంలో తృణమూల్ కాంగ్రెస్ ని ఏకంగా పాతాళానికి అణచేయడంలో సువేందు అధికారి అత్యంత కీలక పాత్ర పోషించారు.

కుడు భుజంగా ఉంటూ :

మమతకు తృణమూల్ కాంగ్రెస్ పెట్టినపుడు కుడి భుజంగా ఉన్న వారు సువేందు అధికారి. ఆమె వల్లనే తొలిసారి 2006లో ఎమ్మెల్యేగా ఆ పార్టీ నుంచి గెలిచారు. టూరిజం మంత్రిగా పనిచేశారు. అంతే కాదు ఆ పార్టీలో నంబర్ టూ అంటే సువేందు అధికారి అని చెప్పాల్సి ఉంది. అంతటి స్థానంలో ఉన్న ఆయన ఎందుకు మమతకు దూరం అయ్యారు, గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే మమత మేనల్లుడు జోక్యం, పార్టీలో ఇతరుల ప్రాముఖ్యత పెరగడం, తాను ఎంత పనిచేసినా మంత్రిగానే ఉండిపోతాను అన్న ఆలోచనతోనే ఆయన 2021 ఎన్నికల ముందు బీజేపీ లోకి వచ్చేశారు.

మూడు నుంచి 77 కి :

ఇక సువేందు అధికారి బీజేపీ తల రాతను బెంగాల్ లో పూర్తిగా మార్చేశారు. 2016 లో కేవలం మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే ఉన్న ఆ పార్టీని 77 సీట్లకు పెంచారు 2021లో బీజేపీకి అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం హోదా దక్కింది. అయిదేళ్ళ పాటు మమత ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ ముచ్చెమటలు పట్టించారు. అంతే కాదు తృణమూల్ కాంగ్రెస్ లో ఉన్న కీలక నేతలను అందరినీ తెచ్చి బీజేపీని బలోపేతం చేశారు. తనకు తృణమూల్ కాంగ్రెస్ గుట్టూ మట్లూ అన్నీ తెలుసు కాబట్టి ఆయన ఆ పార్టీని బీజేపీ శిబిరంలో ఉంటూ చేయాల్సిన నష్టం అంతా చేశారు. దాంతో 2026 ఎన్నికల నాటికి తృణమూల్ కాంగ్రెస్ కకావికలం అయిపోయింది. ఇక బీజేపీ ఎత్తుగడలు, కేంద్ర పెద్దలు నరేంద్ర మోడీ అమిత్ షాల వ్యూహాలు అన్నీ కలసి బెంగాల్ లో బీజేపీ జెండా గట్టిగా ఎగిరేలా చేశాయి.

ఆయనే సీఎం గా :

మరి బీజేపీకి ఇంత చేసి అధికారంలోకి వచ్చేందుకు కారణం అయిన సువేందు అధికారినే ముఖ్యమంత్రిగా చేయాలని బీజేపీ పెద్దలు దాదాపుగా నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు. ఎన్నో పేర్లు బయటకు వినిపిస్తున్నప్పటికీ పార్టీ మాత్రం సువేందు అధికారి మీదనే ఫోకస్ పెట్టింది అని అంటున్నారు. బీజేపీకి బెంగాల్ లో అధ్యక్షుడిగా చేసిన దిలీప్ ఘోష్ తో పాటు రాజ్యసభ మాజీ మెంబర్ టీవీ సినీ నటి రూపా గంగూలీ మరింత మంది పేర్లు కూడా చక్కర్లు కొడుతున్నాయి. కానీ సువేందు అధికారికే సీఎం పదవి అని అంటున్నారు. ఆయన సీఎం అయితేనే మమతను సరైన తీరులో కట్టడి చేయగలరని తృణమూల్ కాంగ్రెస్ మళ్ళీ లేవకుండా దెబ్బ కొట్టగలరని కూడా బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. అంతే కాదు ఆయనను సీఎం గా చూడడం మమతకు కూడా భరించరానిది అవుతునని కూడా అంచనా వేస్తున్నారు.

9న ప్రమాణ స్వీకారం :

ఇక బీజేపీ సీఎం గా సువేందు అధికారి ఈ నెల 9న ప్రమాణం చేస్తారు అని అంటున్నారు. మే 9న రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి అని ఆ సందర్భాన్ని పురస్కరించుకొని జరిపే పొచిశే బోయ్ షోక్ సాంస్కృతిక వేడుక సందర్భంగా బెంగాల్ కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అని తెలుస్తోని. మొతానికి మమతను రెండు సార్లు ఓడించి ఆమె అధికారాన్ని దూరం చేసి మాజీ సీఎం గా మాజీ ఎమ్మెల్యేగా మార్చిన సువేందు అధికారి ముఖ్యమంత్రి అయితే మమత తట్టుకోగలరా అన్నదే చూడాల్సి ఉంది.

Tags:    

Similar News