రిక్షా ఫుల్లర్ కొడుకు.. సుప్రీంకోర్టు జడ్జి కొడుకు ఒకే క్లాస్ లో చదవాలి

విద్యకు సంబంధించిన అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.;

Update: 2026-01-15 13:30 GMT

విద్యకు సంబంధించిన అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యా వ్యవస్థతో రాజ్యాంగం ఆశించిన సౌభ్రాత్రత్వ లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన అంశాన్ని తాజాగా ఒక కేసు విచారణలో భాగంగా సుప్రీం ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగానే కాదు.. కొత్త చర్చకు అవకాశాన్ని ఇచ్చాయని చెప్పాలి. విద్యాహక్కు చట్టం కింద ప్రైవేటు అన్ ఎయిడెడ్ స్కూళ్లలో పేద.. వెనుకబడిన వర్గాల పిల్లలకు కేటాయించిన 25 శాతం ఉచిత సీట్ల అమలుపై విచారణ చేపట్టింది.

ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నరసింహ.. జస్టిస్ ఏఎస్ చందుర్కర్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సారథ్యం వహించింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్య చేసింది. ఒక ఆటో డ్రైవర్ కొడుకు లేదంటే వీధి వ్యాపారి సంతానం.. సంపన్నుల బిడ్డతో కలిసి ఒకే స్కూల్లో.. ఒకే బెంచ్ లో కూర్చోవటం.. విద్యను అభ్యసించటం లాంటివి సహజమైన.. నిర్మాణాత్మక ప్రక్రియగా మారాలని వ్యాఖ్యానించింది.

ఇదేమీ సంక్షేమ పథకం కాదని.. ఆర్టికల్ 21ఏ, 39ఎఫ్ కింద దేశం చిన్నారులకు ఇచ్చిన హక్కుగా స్పష్టం చేసింది. కులం.. తరగతి, ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ఉండే అంశాల్ని పక్కన పెట్టి.. విద్యార్థులు ఒకరితో ఒకరు మమేకం కావాలని కోర్టు పేర్కొంది. అంతేకాదు.. ఈ విచారణ సందర్భంగా కొఠారి కమిషన్ ఇచ్చిన రిపోర్టును సుప్రీం ధర్మాసనం గుర్తు చేసింది. పేద పిల్లలు ధనిక వాతావరణంలో ఇమడగలరా? అన్న సందేహాలను పక్కన పెట్టి.. ఉపాధ్యాయులు ఆ పిల్లల నేపథ్యాలను ఒక వనరుగా మార్చుకోవాలని.. వారి గౌరవాన్ని పెంచాలన్న సూచన చేసింది.

నిబంధనల రూపకల్పన ప్రక్రియ ఏకపక్షంగా కాకుండా.. సంబంధిత విభాగాల భాగస్వామ్యం కూడా ఉండాలని చెప్పిన సుప్రీం ధర్మాసనం.. ‘‘జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, జాతీయ, రాష్ట్ర స్థాయి సలహా మండలితో సమగ్రంగా సంప్రదించి విధివిధానాలను ఖరారు చేయాలి’’ అని పేర్కొంది. అంతేకాదు.. ఈ ప్రక్రియకు గడువును కూడా విధించింది. తాము చెప్పినట్లుగా చేసి.. ఆ వివరాల్ని మార్చి 31లోపు సమగ్ర అఫిడవిట్ ను దాఖలు చేయాలని పేర్కొంది. సుప్రీం ధర్మాసనం పేర్కొన్నట్లుగా.. ఆర్థిక అంశాలతో సంబంధం లేకుండా విద్యార్థులకు అందాల్సిన విద్య అందుతుందో.. అప్పుడే రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్షలు నెరవేరుతాయని చెప్పక తప్పదు.

Tags:    

Similar News