ఓటీటీలు.. ఇకపై ఆధార్ తో లాగిన్ అవ్వాలా?

ప్రస్తుతం దేశంలో ఓటీటీ ప్లాట్‌ ఫారమ్‌ లు విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. సినిమాలు, వెబ్‌ సిరీస్‌ లను ఎక్కువమంది ఇంట్లోనే కూర్చుని ఓటీటీల్లోనే చూస్తున్నారు.;

Update: 2025-11-28 18:30 GMT

ప్రస్తుతం దేశంలో ఓటీటీ ప్లాట్‌ ఫారమ్‌ లు విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. సినిమాలు, వెబ్‌ సిరీస్‌ లను ఎక్కువమంది ఇంట్లోనే కూర్చుని ఓటీటీల్లోనే చూస్తున్నారు. అయితే సాధారణ సినిమాలు, టీవీ షోలతో పోలిస్తే.. ఓటీటీల్లో అశ్లీల కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుందన్న విమర్శలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి.

కుటుంబ సభ్యుల మధ్య చూడడానికి ఇబ్బందికరంగా ఉండే సీన్స్, డైలాగ్స్ ఉండడంతో అనేక మంది ఓటీటీ లవర్స్.. అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీ, యూట్యూబ్ కంటెంట్‌పై నియంత్రణ అవసరం ఉందన్న అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టంచేసింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం కీలక సూచనలు చేసింది.

అశ్లీల కంటెంట్‌ ను యాక్సెస్ చేయడానికి ఆధార్ ఆధారంగా వయసు ధ్రువీకరణను అమలు చేసే అవకాశంపై సుప్రీంకోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. ఆ విషయంలో సాధారణ హెచ్చరికలు మాత్రమే సరిపోవని, అదనపు చర్యలు కచ్చితంగా అవసరమని భావించినట్లు పరోక్షంగా చెప్పింది. ఈ మేరకు పుస్తకాలు, పెయిటింగ్స్ ను ప్రస్తావించింది.

పుస్తకాల్లో, పెయింటింగ్స్ సహా వివిధ కళారూపాల్లో అశ్లీలతపై ముందుగానే తెలియజేస్తారని, కానీ ఫోన్ ఆన్ చేసిన వెంటనే, ఇష్టం లేని కంటెంట్ ప్రత్యక్షమైతే ఎలా అంటూ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం డిజిటల్ యుగంలో ఇలాంటి సమస్యలు పెరుగుతున్నాయని, అందుకే ఆధార్ ద్వారా ఏజ్ అథంటికేషన్ ఒక ఆలోచనగా పరిశీలించవచ్చని తెలిపింది.

అయితే కమెడియెన్స్ సమయ్ రైనా, రణవీర్ అలహాబాదియా చేసిన వ్యాఖ్యలు, యూట్యూబ్‌ లో వచ్చిన కంటెంట్‌ పై ఇప్పటికే దాఖలైన పిటిషన్ల నేపథ్యంలో విచారణ జరగ్గా.. కోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియా, వీడియో షేరింగ్ ప్లాట్‌ ఫారమ్‌ లు, ఓటీటీల్లో నియంత్రణ లేకపోవడంపై ఫిర్యాదులు వస్తుండడంతో న్యాయస్థానం సూచనలిచ్చింది.

ఆ సమయంలో డిజిటల్ మీడియా నియంత్రణపై కేంద్రం ఇప్పటికే కొత్త నిబంధనలను రూపొందిస్తున్నట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. కొత్త చట్టాలు రూపొందించవచ్చని చెప్పారు. అయితే పెరుగుతున్న డిజిటల్ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని, స్ట్రిక్ట్ రూల్స్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఓటీటీల్లో లాగిన్ అవ్వాలంటే.. ఆధార్ అథంటికేషన్ చేయాల్సి రావచ్చని ప్రచారం జరుగుతోంది. మరే జరుగుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News