గృహిణులకు కితాబు... సుప్రీం సంచలన తీర్పు

గృహిణులు అంటే ఇంటికి మహరాణులు అన్నది అంతా చెబుతారు. కానీ వారి కష్టానికి మాత్రం ఎవరూ వెల కట్టలేరు.

Update: 2026-06-11 22:30 GMT

గృహిణులు అంటే ఇంటికి మహరాణులు అన్నది అంతా చెబుతారు. కానీ వారి కష్టానికి మాత్రం ఎవరూ వెల కట్టలేరు. అయితే దేశ అత్యున్నత న్యాయ స్థాం మాత్రం గృహిణుల విషయంలో చారిత్రాత్మకమైన తీర్పునే వెలువరించింది. వారి వెలకట్ట లేని సేవలకు ఈ రోజున ఒక చట్టపరమైన ఆర్ధికపరమైన గౌరవాన్ని గుర్తింపుని ఇస్తూ కీలక తీర్పుని వెలువరించింది. గృహిణులకు ప్రమాద పరిహారం లెక్కింపు విషయంలో సుప్రీం కోర్టు తీర్పు ఇస్తూ వారికి నెలకు ముప్పై వేల రూపాయల ఆదాయంగా గుర్తిస్తూ దీనిని అమలు చేయాలని తీర్పు ఇచ్చింది. నష్ట పరిహారం విషయంలో ఇది ప్రత్యేకమైన అదనపు విభాగంలో చేర్చాలని ఆదేశించింది.

ఆమె తక్కువ కాదు :

ఇదిలా ఉండగా సుప్రీంకోర్టు పాతికేళ్ళ క్రితం నాటి కేసు మీద తీర్పు చెప్పింది. అందులో గృహిణుల కష్టాన్ని గుర్తించింది. ఇంట్లో ఉంటూ కుటుంబాన్ని చూసుకునే గృహిణులు ఈ జాతికే నిర్మాతలు అని పేర్కొంది. మోటార్ వాహన ప్రమాదాలలో వారు మరణిస్తే నష్టపరిహారం లెక్కించే విషయంలో వారి నెలసరి ఆదాయన్ని కనీసంగా ముప్పయి వేలకు తక్కువ కాకుండా పరిగణించాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పడం విశేషం. అంతే కాదు ప్రతి మూడేళ్లకు ఈ మొత్తంలో 10 శాతం పెంపుదల కచ్చితంగా ఉండాలని స్పష్టం చేసింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్. కోటేశ్వర్ సింగ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

జీతం లేని గృహిణులుగా :

ఈ తీర్పు ప్రకారం కేవలం కుటుంబానికే అంకితం అయి జీతం లేని విధంగా సేవ చేస్తున్న వారికి సుప్రీం కోర్టు ఈ గుర్తింపు గౌరవం ఇచ్చింది అని అంటున్నారు. అంతే కాదు మోటారు ప్రమాదాల పరిహార మార్గదర్శకాలకు సంబంధించి గతంలో వచ్చిన ప్రణయ్ సేథి కేసు తీర్పునకు ఇది అదనమని ధర్మాసనం వివరించింది. ప్రమాదంలో ఒకవేళ మరణించిన గృహిణికి వేరే ఆదాయ మార్గాలు ఉన్నా కూడా ఈ మొత్తాన్ని అదనంగా కలపాలని సుప్రీం కోర్టు పేర్కొంది. ఒక గృహిణి ఇంటి పనులు చేయడం పిల్లలను పెంచడం, కుటుంబాన్ని చూసుకోవడం వంటివి సమాజానికి దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటివని సుప్రీం కోర్టు తన తీర్పులో స్పష్టం చేయడం విశేషం. ఆమెకు వేతనం లేనంత మాత్రాన ఈ పనులకు ఆర్థిక విలువ లేదని భావించడం చారిత్రక తప్పిదమని కూడా పేర్కొంది. అలాంటి తప్పుని సరిదిద్దేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని సుప్రీం కోర్టువ్యాఖ్యానించింది. ఇదిలా ఉంటే ఈ సమాజం సజావుగా సాగడంలో గృహిణుల పాత్ర అమూల్యమైనదని అంటూ సుప్రీం కోర్టు కొనియాడింది.

పాతికేళ్ళ నాటి కేసు :

ఇదిలా ఉండగా 2001లో పంజాబ్‌లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో రేష్మ అనే మహిళ మరణించారు. ఆమెకి సరైన నష్టపరిహారం విషయంలో ఆనాటి నుంచి ఆమె భర్త, పిల్లలు న్యాయ స్థానాలలో పోరాడుతున్నారు. అది సుప్రీం కోర్టు దాకా వచ్చేసరికి పాతికేళ్ళు అయినిద్. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ తీర్పుని వెలువరించింది. దీంతో ఈ తీర్పు దేశవ్యాప్తంగా ఇలాంటి వేలాది కేసులపై ప్రభావం చూపనుంది. అయితే ఈ తీర్పు కేవలం మహిళలకే కాకుండా ఇంటి బాధ్యతలు చూసుకునే పురుషులకు సైతం వర్తిస్తుంది.

Tags:    

Similar News