పూర్తి స్వేచ్ఛ కావాలంటే పెళ్లెందుకు?.. సుప్రీం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

విచార‌ణ సంద‌ర్భంగా జ‌స్టిస్ బీవీ నాగ‌ర‌త్న క‌లుగ‌జేసుకుంటూ.. ఆర్థికంగా కాక‌పోయినా భార్య త‌న భ‌ర్త‌పై ఆధార‌ప‌డ‌ను అని చెప్ప‌డం అసాధ్యం అని పేర్కొన్నారు.;

Update: 2025-08-22 08:21 GMT

ఆమె హైద‌రాబాద్ లో ఉన్న మ‌హిళ‌.. ఆయ‌న సింగపూర్ లో ఉద్యోగి... ఇద్ద‌రికీ పెళ్ల‌యింది. పిల్ల‌లున్నారు. కానీ, విడాకుల కోసం కోర్టుకెక్కారు. విష‌యం సుప్రీం కోర్టు వ‌ర‌కు చేరింది. ఈ శుక్ర‌వారం విచార‌ణ‌కు వ‌చ్చింది. ఈ కేసును విచార‌ణ చేసింది కూడా భార‌త దేశ సుప్రీంకోర్టు తొలి మ‌హిళా ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా నియ‌మితుల‌య్యే అవ‌కాశం ఉన్న జ‌స్టిస్ బీవీ నాగ‌ర‌త్న‌. ఆమెతో పాటు జస్టిస్ ఆర్. మహదేవన్ తో కూడిన బెంచ్... దంప‌తుల విడాకుల కేసులో వాద‌న‌లు విన్నారు.

అస‌లు కేసు ఏమిటి..??

ఇద్ద‌రు పిల్ల‌లున్న జంట విడాకుల కోసం కోర్టుకెక్కింది. భ‌ర్త సింగ‌పూర్ లో ఉద్యోగం చేస్తున్నారు. కోర్టు విచార‌ణ‌లో మ‌హిళ హైద‌రాబాద్ నుంచి వ‌ర్చువ‌ల్ గా పాల్గొన్నారు. అయితే, ఆమె త‌న భ‌ర్తతో క‌లిసి ఉండ‌లేన‌ని, సింగ‌పూర్ వెళ్లిన స‌మ‌యంలో స‌రిగా చూసుకోలేద‌ని, డ‌బ్బు విష‌య‌మై గొడ‌వలు వ‌చ్చాయ‌ని, తాను ఎవ‌రిపైనా ఆధార‌ప‌డ‌కుండా స్వ‌తంత్రంగా జీవించాల‌ని కోరుకుంటున్న‌ట్లు చెప్పింది.

భార్య భ‌ర్త‌పై ఆధార‌ప‌డ‌ను అన‌డం సాధ్య‌మా?

విచార‌ణ సంద‌ర్భంగా జ‌స్టిస్ బీవీ నాగ‌ర‌త్న క‌లుగ‌జేసుకుంటూ.. ఆర్థికంగా కాక‌పోయినా భార్య త‌న భ‌ర్త‌పై ఆధార‌ప‌డ‌ను అని చెప్ప‌డం అసాధ్యం అని పేర్కొన్నారు. భావోద్వేగ‌ప‌రంగా, మాన‌సికంగా అయినా భాగ‌స్వాములు ఒక‌రిపై ఒక‌రు ఆధార‌ప‌డ‌డం వివాహ బంధంలో స‌హ‌జం అని వ్యాఖ్యానించారు. అంతేకాక‌.. పూర్తి స్వేచ్ఛ కావాలంటే అస‌లు పెళ్లే చేసుకోవ‌ద్దు అని... వివాహం అనంత‌రం ఒక‌రిపై ఒక‌రు ఆధార‌ప‌డ‌కుండా ఉండ‌లేర‌ని అన్నారు. విడిపోవ‌డం కంటే కూడా.. పిల్ల‌ల భ‌విష్య‌త్ కోసం ఆలోచించాల‌ని, సాధ్య‌మైతే రాజీ ప‌డాల‌ని హిత‌వు ప‌లికారు. విడిపోయిన కుటుంబాన్ని పిల్ల‌లు చూడ‌కూడ‌ద‌ని పేర్కొన్నారు. పిల్ల‌ల భ‌విష్య‌త్ కోసం రూ.5 ల‌క్ష‌లు జ‌మ చేయాల‌ని భ‌ర్త‌కు సూచించింది.

భ‌ర్త రాజీ.. భార్య స‌సేమిరా...

ఈ కేసులో న్యాయ‌మూర్తులు ఎంత హిత‌వు ప‌లికినా.. హైద‌రాబాద్ నుంచి వ‌ర్చువ‌ల్ గా విచార‌ణ‌లో పాల్గొన్న మ‌హిళ మాత్రం రాజీకి విముఖంగానే ఉన్న‌ట్లు తెలుస్తోంది. భ‌ర్త మాత్రం రాజీకి సిద్ధంగా ఉన్న‌ట్లు స‌మాచారం.

Tags:    

Similar News