ఉరిశిక్ష, ఇంజెక్షన్, కేంద్ర ప్రభుత్వం.. మధ్యలో సుప్రీం కీలక వ్యాఖ్యలు!

సీనియర్‌ న్యాయవాది రిషి మల్హోత్రా తన పిటిషన్ లో... మరణశిక్ష పడిన ఖైదీకి ఉరితీతా? లేదా ప్రాణాంతక ఇంజెక్షనా? అని ఎంచుకునే అవకాశమైనా ఇవ్వాలని కోరారు.;

Update: 2025-10-15 16:47 GMT

గతంలో మరణశిక్ష పడిన ఖైదీలను ఉరి తీసేవారు.. కాలం మారింది.. ఇటీవల కాలంలో చాలా దేశాల్లో ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చి మరణశిక్ష విధించే విధానాన్ని అనుసరిస్తున్నారు! ఈ క్రమంలో దేశంలో మరణశిక్ష పడిన ఖైదీలకు ప్రస్తుతం అనుసరిస్తున్న ఉరితీత విధానాన్ని తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన సర్వోనత న్యాయస్థానం, కేంద్ర ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేసింది.

అవును... దేశంలో మరణశిక్ష పడిన ఖైదీలకు ప్రస్తుతం అనుసరిస్తున్న ఉరితీత విధానాన్ని తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో సీనియర్‌ న్యాయవాది రిషి మల్హోత్రా పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ పై బుధవారం విచారణ జరిగింది. అయితే మరణశిక్ష అమలు విధానాన్ని మార్చే ఉద్దేశం లేదని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

ఆప్షన్ మరణశిక్ష పడిన ఖైదీకి ఇవ్వాలి!:

సీనియర్‌ న్యాయవాది రిషి మల్హోత్రా తన పిటిషన్ లో... మరణశిక్ష పడిన ఖైదీకి ఉరితీతా? లేదా ప్రాణాంతక ఇంజెక్షనా? అని ఎంచుకునే అవకాశమైనా ఇవ్వాలని కోరారు. ఇదే సమయంలో... అమెరికాలోని 50 రాష్ట్రాల్లో 49 రాష్ట్రాలు మరణశిక్ష అమలులో ప్రాణాంతక ఇంజెక్షన్‌ విధానాన్ని అనుసరిస్తున్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీని వల్ల మరణ సమయంలో శిక్షపడ్డ నేరస్థుడికి తక్కువ వేదన ఉంటుందని పలు అధ్యయనాల్లో తేలిందని తెలిపారు.

కేంద్రం వెర్షన్ ఇదే!:

పిటిషనర్ వాదన అనంతరం స్పందించిన ధర్మాసనం.. ఈ ప్రతిపాదనను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని, దాన్ని పరిగణించేలా చూడాలని ప్రభుత్వం తరఫున వాదిస్తున్న న్యాయవాదికి సూచించారు. అయితే.. పిటిషనర్‌ సూచన సాధ్యమయ్యేది కాదని.. దాన్ని ఇప్పటికే తమ కౌంటర్‌ అఫిడవిట్‌ లో పేర్కొన్నామని కేంద్రం తరఫు కౌన్సిల్‌ వివరించింది. ఇది విధానపరమైన నిర్ణయమని, దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.

ధర్మాసనం ఒకింత అసహనం!:

మరణశిక్ష అమలు విషయంలోది విధానపరమైన నిర్ణయమని, దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని.. దీనికోసం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసే అంశాన్ని గతంలో పరిశీలించినట్లు కేంద్ర ప్రభుత్వం తరుపు అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి చెప్పిన అంశంపై ధర్మాసనం ఒకింత అసహనం వ్యక్తం చేసింది! ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

ఇందులో భాగంగా.. కాలానుగుణంగా ఎన్నో అంశాల్లో మార్పులు వచ్చాయి కానీ, ప్రభుత్వం మాత్రం ఆ మార్పులను స్వీకరించేందుకు సిద్ధంగా లేదని.. అదే ఇక్కడ సమస్యగా మారిందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అనంతరం.. ఈ పిటిషన్‌ పై తదుపరి విచారణను నవంబరు 11వ తేదీకి వాయిదా వేసింది.

Tags:    

Similar News