అమెరికాను వణికిస్తున్న సూపర్ ఫ్లూ..

సూపర్ ఫ్లూ అంటే.. ఇదొక ఇన్ఫ్లు ఎంజా -A రకానికి చెందిన H3N2 వైరస్. సాధారణంగా వైరస్లలో సహజంగా జరిగే యాంటీజెనిక్ డ్రిఫ్ట్ ప్రక్రియ వల్ల ఈ కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది.;

Update: 2026-01-06 16:46 GMT

ప్రాణాంతక వ్యాధులు ఈ మధ్య వేగంగా విస్తరిస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇలాంటి వ్యాధుల వల్ల ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారు. 2019లో కరోనా మహమ్మారి ఏ విధంగా ప్రజలను భయాందోళనకు గురిచేసి హరించుకుపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లక్షల్లో ప్రజలు పిట్టల్లా రాలిపోయారు . ఇక ఆ భయం నుంచి ఇంకా బయటపడలేదనే చెప్పాలి. అందుకే ఆరోగ్యం విషయంలో ఎప్పటికప్పుడు అత్యంత జాగ్రత్తలు పాటిస్తున్నారు. అయినా సరే ఎప్పటికప్పుడు కొన్ని రకాల వ్యాధులు ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

వేగంగా వ్యాపిస్తున్న సూపర్ ఫ్లూ..

ఇదిలా ఉండగా తాజాగా ఇప్పుడు మరో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. అసలు విషయంలోకి వెళ్తే.. అమెరికా, ఐరోపా వంటి దేశాలలో "సబ్ క్లేడ్ K" అనే ఒక కొత్త రకం ఇన్ఫ్లు ఎంజా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. అయితే డాక్టర్లతోపాటు అంతర్జాతీయ మీడియా కూడా దీనిని సూపర్ ఫ్లూ అని పిలుస్తున్నారు. సాధారణ ఫ్లూ కంటే ఇది అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో అటు ఆరోగ్య సంస్థలు కూడా అప్రమత్తం అవుతున్నాయి. ఇకపోతే ఈ సూపర్ ఫ్లూ వ్యాధి సాధారణ లక్షణాలు ఏంటి? దీనికి చికిత్స ఏంటి? ఎటువంటి టీకా ఉపయోగించాలి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..

భయపెడుతున్న సూపర్ ఫ్లూ..

సూపర్ ఫ్లూ అంటే.. ఇదొక ఇన్ఫ్లు ఎంజా -A రకానికి చెందిన H3N2 వైరస్. సాధారణంగా వైరస్లలో సహజంగా జరిగే యాంటీజెనిక్ డ్రిఫ్ట్ ప్రక్రియ వల్ల ఈ కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. దీని ఉపరితలంపై ఉండే హెమగ్లూటినిన్ అనే ప్రోటీన్ లో కీలకమైన మార్పులు జరగడం వల్ల మన శరీరంలో ఉన్న రోగనిరోధక శక్తి దీనిని గుర్తించడంలో ఇబ్బంది పడుతుంది. తద్వారా ఈ వ్యాధి బయటపడుతుంది. అయితే ఈ ఏడాది ఆస్ట్రేలియాలో మొదటిసారి ఈ వైరస్ ను గుర్తించగా.. ఇప్పుడు అమెరికాలో దాదాపు 30కి పైగా రాష్ట్రాలలో ఈ వైరస్ విజృంభించింది. అమెరికాలోనే కాదు బ్రిటన్, జపాన్ వంటి దేశాలలో కూడా విజృంభించడంతో మిగతా దేశ ప్రజలు కూడా భయపడిపోతున్నారు.

సూపర్ ఫ్లూ లక్షణాలు..

ఒక్కసారిగా తీవ్రమైన జ్వరం, ఊపిరితిత్తుల్లో వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తలనొప్పి , కండరాల నొప్పులు, విపరీతమైన నీరసం, ముఖ్యంగా పిల్లల్లో వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.

సూపర్ ఫ్లూ చికిత్స..

ఇకపోతే సూపర్ ఫ్లూ చికిత్స ఎలా? అనే విషయానికి వస్తే.. ఈ సబ్ క్లేడ్ K వేరియంట్ కి పూర్తి స్థాయిలో సరిపోయే టీకా ప్రస్తుతం అందుబాటులో లేదు. అయినప్పటికీ టీకా వేయించుకుంటే వ్యాధి తీవ్రత తగ్గుతుందని, ప్రాణాపాయం నుండి బయట పడవచ్చని వైద్యులు స్పష్టం చేశారు. ఇకపోతే అమెరికాలో ఇప్పటికే ఈ వైరస్ కారణంగా 5000 మంది మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి.

జాగ్రత్తలు..

ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలి. చేతులను శుభ్రం చేసుకోవడం , మాస్క్ ధరించడం, ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం , ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండడం లాంటి జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్యాన్ని నిపుణులు చెబుతున్నారు.

Tags:    

Similar News