ఇంట్లో చిరుత.. అత్తను తెలివిగా సేవ్ చేసిన కోడలు

అనూహ్య పరిస్థితుల్లో ధైర్యాన్ని ప్రదర్శించటం.. భారీ రిస్కు చేయటం.. తెలివిని ప్రదర్శించటం అంత సామాన్యమైన విషయం కాదు.;

Update: 2026-04-18 04:10 GMT

అనూహ్య పరిస్థితుల్లో ధైర్యాన్ని ప్రదర్శించటం.. భారీ రిస్కు చేయటం.. తెలివిని ప్రదర్శించటం అంత సామాన్యమైన విషయం కాదు. వీటికి తోడు ప్రాణాన్ని పణంగా పెట్టటం అంత సులువైన వ్యవహారం కాదు. ఓవైపు నిలువెల్లా భయంతో శరీరం వణుకుతున్న వేళ.. దాన్ని అధిగమించేలా ధైర్యాన్ని ప్రదర్శిస్తూ.. తెలివితో వ్యవహరించి.. ప్రాణాలకు తెగించే రిస్కు చేయటం చాలా అరుదైన పని. ఇలా అరుదైన బ్లెండ్ తో వ్యవహరించిన ఒక కోడలు తీరు అత్త నిండు ప్రాణాల్ని కాపాడేలా చేసింది.

విన్నంతనే వణుకుపుట్టే సాహసాన్ని చేసిన సదరు కోడలు సుజాత తీరుకు భళా కోడలా.. అనకుండా ఉండలేం. కర్ణాటకలో ఒక కోడలు వ్యవహరించిన తీరు తెలిసిన వారంతా వావ్.. అనకుండా ఉండలేకపోతున్నారు. ఇంతకూ అసలేం జరిగిందంటే.. ఇంట్లోకి దూరిన చిరుత విషయం తెలిస్తేనే ప్రాణాలు పోయినంత పరిస్థితి వస్తుంది. అందునా.. సదరు చిరుత తన అత్త పడుకున్న గదిలోకే చేరి నిద్రపోతున్న సీన్ చూస్తే.. ఎవరికైనా తడి ఆరిపోతుంది.

సరిగ్గా ఇలాంటి సీన్ చూసింది కర్ణాటకలోని మైసూర్ నడిబొడ్డున సిద్దార్థనగర్ కు చెందిన ఒక కోడలు. తన అత్త శైలజ బెడ్రూంలో నిద్రపోతోంది. పని మధ్యలో అత్త రూం వైపు చూసిన కోడలు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అత్త నిద్రపోతున్న మంచం కింద చిరుత నిద్రపోతున్న విషయాన్ని గుర్తించిన ఆమె.. తీవ్రమైన ఆందోళనకు గురైనప్పటికి.. దాన్ని బయటపడనీయకుండా.. ఎలాంటి చప్పుడు చేయని ఆమె.. చిరుత ఉన్న అత్తగారి గదిలోకి వెళ్లి.. ఆమె ఆందోళనకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకుంది.

చప్పుడు చేయకుండా అత్త శైలజను గది నుంచి బయటకు తీసుకొచ్చిన ఆమె.. గది తలుపు మూసేసింది. వెంటనే భర్త సురేశ్ కు సమాచారం ఇచ్చి.. ఆయన సాయంతో అటవీ శాఖకు అసలు విషయాన్ని తెలియజేశారు. వెంటనే స్పందించిన అటవీ శాఖ సిబ్బంది చిరుతపై మత్తు ఇంజక్షన్ ను ప్రయోగించి.. స్ప్రహ తప్పిన అనంతరం దాన్ని బంధించి తమతో తీసుకెళ్లారు. క్లిష్ట సమయంలోనూ సమయస్ఫూర్తిని ప్రదర్శించిన కోడలు సుజాత తీరును అందరూ అభినందించారు. ఏమైనా.. ఈ కోడలు కూతురు కంటే మించినట్లుగా వ్యవహరించింది కదూ?

Tags:    

Similar News