పసివాళ్ళ పాలిట కాల యుముడిగా !
ఇది అడవి కాదు, కానీ జనారణ్యం అని చెప్పుకోవాలేమో. ఇక్కడ బలహీనులు పసివారికి ఏ మాత్రం భద్రత ఉండటం లేదు అని అంటున్నారు.;
ఇది అడవి కాదు, కానీ జనారణ్యం అని చెప్పుకోవాలేమో. ఇక్కడ బలహీనులు పసివారికి ఏ మాత్రం భద్రత ఉండటం లేదు అని అంటున్నారు. చిన్నారులు ఆడుకోవడానికి బయటకు వేస్తే చాలు గద్ద తన్నుకుని పోయినట్లుగా వీధి కుక్కలు కలబడుతున్నాయి. వారిని చీల్చి చెండాడుతున్నాయి. ఇక ఆ దయనీయ దృశ్యాలను సీసీ కెమెరాలో చూసిన వారికి ఒళ్ళు జలదరిస్తోంది. అయ్యో ఈ చిన్నారులు ఎక్కడ ఉన్నారు, వారిని అలా పీక్కు తింటున్నా చేసేది ఏమీ లేదా అని ప్రతీ వారిలో ఆలోచనలు అయితే కలుగుతున్నాయి.
జంతు ప్రేమతో :
చాలా మంది పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. జంతు ప్రేమికులు అయితే కుక్కల పట్ల జాలి చూపిస్తున్నారు కానీ పూటకొక విధంగా వీరంగం వేస్తూ చిన్నారులనే లక్ష్యంగా చేసుకుంటూ వారి పట్ల కాల యముడిగా మారుతున్న వీధి కుక్కల విషయంలో ఏమి చేయాలో పరిష్కారాలు మాత్రం ఎవరూ చెప్పడం లేదని అంటున్నారు. వీధి కుక్కలకు వ్యతిరేకంగా ఏదైనా నిర్ణయం వెలువడడమే ఆలస్యం చాలా మంది సెలబ్రిటీస్ వాటిని ఖండిస్తూ ట్వీట్లు చేస్తూంటారు. కానీ పసి కూనలను పగబట్టిగా కొరికి చంపుతున్న వీధి కుక్కల వీడియోల విషయంలో ఎందుకు రియాక్ట్ కావడం లేదన్న ప్రశ్నలు ఉన్నాయి.
రోజుకొక సంఘటన :
హైదరాబాద్ మహా నగరంలో రోజుకు ఒక రకంగా వీధి కుక్కల దాడులు జరుగుతున్నాయి. డిసెంబర్ నెల వచ్చి ఇంకా వారం కూడా కాలేదు, కానీ అపుడే కుక్క కాటుకు గురి అయిన బాధిత చిన్నారుల విషాద ఘటనలు వరసగా వెలుగు చూస్తున్నాయి. ఇక మొదట హిమాయత్ నగర్ మన్ సూరాబాద్ లోని శివశక్తి కాలనీలో ఒక ఎనిమిదేళ్ళ మూగ బాలుడి మీద వీధి కుక్కలు దాడి చేసి పాశవికంగా గాయాలు చేశాయి. ఆ ఘటన మరవక ముందే యూసఫ్ గూడాలో మరో ఘటన వెలుగు చూసింది. ఈ పిల్లవాడు చేసిన తప్పు వీధిలో ఆడుకోవడం. ఎక్కడ నుంచి వచ్చిందో ఒక కుక్క ఆ బాలుడి మీద పడి కిందకు తోసేసి మరీ నానా రకాలుగా హింసించింది. ఆ సమయంలో అదృష్టవశాత్తు ఎవరో ఒక వ్యక్తి ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూడడం ఆ వెంటనే కుక్కను తరిమికొట్టడంతో ఆ బాలుడి ప్రాణాలు దక్కాయి. ఇది ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
చర్యలు తీసుకోవాలి :
పెద్ద ఎత్తున వీధి కుక్కలు పెరిగిపోతున్నాయి. అవి ఆహారం కోసమో లేక వికారంతో ఉండడం వల్లనో కోపంతో చేసే దాడులు అన్నీ ఇన్నీ కావు అని అంటున్నారు. దాంతో తమ కంటే చిన్నగా నిస్సహాయంగా కనిపించే వారి మీద అవి దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా పసి బిడ్డల మీదనే పడి వారిని కొరికి తీవ్ర గాయాల పాలు చేస్తున్నాయి. దీని మీద జీహెచ్ఎంసీ అధికారులు ఏ రకమైన చర్యలు తీసుకోవడం లేదని బాధిత జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సుప్రీం తీర్పు :
ఇదిలా ఉంటే ఈ మధ్యనే సుప్రీం కోర్టు తీర్పు కూడా వెలువరించింది. వీధి కుక్కలు కనిపిస్తే షెల్టర్ లో వాటిని తరలించాలని కూడా అన్ని రాష్ట్రాలకు సూచించింది. అంతే కాదు పాఠాశాలలు, పార్కులు జన సంచారం ఉండే చోట నుంచి వాటిని దూరంగా తరలించాలని ఆదేశించింది. ఈ విషయం మీద రాష్ట్రాలు ఏ విధంగా అమలు చేస్తాయో తెలియదు కానీ వీధి కుక్కలు మాత్రం రెచ్చిపోతూ ప్రతాపం చూపిస్తున్నాయి. బైకర్ల మీద కూడా వీధి కుక్కలు ఎటాక్ చేస్తున్న సంఘటనకు అనేకం జరుగుతున్నాయి.
ప్రాణాపాయానికి గురి :
బైకర్లపై కుక్కలు చేసే దాడులు తీవ్రమైన సమస్యగా చూడాలని అంటున్నరు తరచుగా దూకుడుగా ఉండే కుక్కలు సైక్లిస్టులను బైకర్లను వెంబడించడం వల్ల వారు పడిపోవడం ప్రమాదాలకు గురి కావడం జరుగుతోంది. అలాగే వారిని కుక్కలు , కాటు వేయడంతో కూడా ప్రాణాపాయానికి గురి అవుతున్నారు. అలాగే తీవ్రమైన గాయాలతో కొన్నిసార్లు మరణాలు కూడా సంభవిస్తున్నాయని అంటున్నారు. వీటి మీద కూడా ఫోకస్ పెట్టాల్సి ఉందని అంటున్నారు. ఏది ఏమైనా వీధి కుక్కల విషయంలో అంతా కలసి సరైన నిర్ణయం తీసుకోవాలని బాధితులే కాదు సగటు ప్రజానీకం కోరుతున్నారు.