మాజీ ఎంపీ ఎంవీవీకి ఝలక్.. జగన్ షాకింగ్ డెసిషన్!
విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి షాక్ ఇచ్చారన్న ప్రచారంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.;
విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి షాక్ ఇచ్చారన్న ప్రచారంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. గత ఎన్నికల తర్వాత పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న మాజీ ఎంపీ ఎంవీవీ మళ్లీ జగన్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేశారని, కానీ అధినేత జగన్ మాజీ ఎంపీని అసలు పట్టించుకోలేదన్న ప్రచారం విశాఖ పొలిటికల్ సర్కిల్స్ తోపాటు వైసీపీ వర్గాల్లో హీట్ పుట్టిస్తోంది. ఎంవీవీకి షాక్ ఇవ్వడం ద్వారా, ఎన్నికల తర్వాత పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న వారికి ఇకపై పార్టీలో చోటులేదన్న సంకేతాలు పంపినట్లైందని అంటున్నారు.
2019-24 మధ్య విశాఖ ఎంపీగా పనిచేసిన ఎంవీవీ సత్యనారాయణ గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన రాజకీయాలకు దూరమవుతున్నట్లు ప్రకటించారు. వైసీపీ పార్టీ కార్యక్రమాలకు హాజరుకావడం లేదు. విశాఖ నగరంలో ఉన్నప్పుడు సైతం ఆయన పార్టీ కార్యక్రమాలను పట్టించుకోలేదని చెబుతున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత ఈడీ కేసులు నమోదు కావడం, భూ ఆక్రమణలపై ప్రభుత్వం సీరియస్ గా ఉండటంతో ఆయన వైసీపీకి దూరం జరిగినట్లు చెబుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఆయన విషయంలో వెనక్కి తగ్గినట్లు కనిపించడకపోవడంతో మళ్లీ పార్టీకి దగ్గరవ్వాలని ఆయన చూస్తున్నట్లు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది.
దీంతో ఇటీవల మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఇంట జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి అధినేత జగన్ హాజరుకావడం, ఆ సందర్భాన్ని వాడుకుని పార్టీలో తిరిగి యాక్టివ్ అయ్యేలా ఎంవీవీ ప్రయత్నించారని చెబుతున్నారు. అయితే వాసుపల్లి ఇంట్లో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీ ఎంవీవీని జగన్ అసలు పట్టించుకోలేదని, ఆయనను చూసీచూడనట్లు విస్మరించారని కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. సొంత అవసరాల కోసం పార్టీని వాడుకునే వారు తనకు అవసరం లేదన్న ఆలోచనతో జగన్ మాజీ ఎంపీని ఉద్దేశ పూర్వకంగా దూరం పెట్టినట్లు చెబుతున్నారు.
ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ విశాఖకు చాలాసార్లు వచ్చారని, కానీ అప్పుడెప్పుడూ ఎంవీవీని చూడలేదని, ఇప్పుడు ఆయన అవసరం పార్టీకి లేదని అధినేత భావిస్తున్నారని అంటున్నారు. వైసీపీకి అధికారం కోల్పోయిన తర్వాత కార్యకర్తలకు భరోసా ఇవ్వాల్సిన నేతలు ఆ విషయాన్ని విస్మరించడాన్ని జగన్ సీరియస్ గా తీసుకుంటున్నారని అంటున్నారు. ప్రభుత్వం ఉండగా, విశాఖలో గరిష్టంగా ప్రయోజనం పొందిన మాజీ ఎంపీ ఎంవీవీ అధికారం కోల్పోయిన వెంటనే రాజకీయాలు వదిలేస్తానని చెప్పడం, ఇప్పుడు పార్టీ మద్దతు కావాల్సిన పరిస్థితి ఏర్పడటంతో దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారని కార్యకర్తలు చెబుతున్నారు.
దీనిని దృష్టిలో పెట్టుకునే మాజీ సీఎం జగన్ ఆయనను దగ్గరకు రానీయలేదని అంటున్నారు. ఈ పరిణామంతో షాక్ తిన్న మాజీ ఎంపీ ఎంవీవీ పట్టువదలని విక్రమార్కుడిలా అధినేతకు దగ్గరయ్యే ప్రయత్నాలు తీవ్రం చేస్తున్నట్లు చెబుతున్నారు. పార్టీ సీనియర్ నేతలను సంప్రదించి తన విషయమై అధినేత జగన్ పునరాలోచన చేయాలని కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఎంవీవీ విషయంలో జగన్ ఇప్పటికే ఫైనల్ నిర్ణయం తీసుకున్నారని, ఆయన అవసరం పార్టీకి అవసరం లేదని తెగేసి చెబుతున్నట్లు చెబుతున్నారు.