సెన్సెక్స్ 3000 పాయింట్లు డౌన్.. మార్కెట్లను భయపెడుతున్న ‘బ్లాక్ మండే’ కథేంటంటే?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హయాంలో మొదలైన వాణిజ్య యుద్ధం ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తోంది.;
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హయాంలో మొదలైన వాణిజ్య యుద్ధం ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తోంది. ఆయన వివిధ దేశాలపై విధిస్తున్న భారీ పన్నుల కారణంగా ఇన్వెస్టర్లు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇటీవల ఆసియా మార్కెట్లలో చోటుచేసుకున్న భారీ పతనం దీనికి నిదర్శనం. జపాన్, దక్షిణ కొరియా, చైనా, హాంకాంగ్, తైవాన్, భారత్ వంటి దేశాల ప్రధాన సూచీలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ నేపథ్యంలో అమెరికా మార్కెట్ వ్యాఖ్యాత జిమ్ క్రెమెర్ 1987 నాటి ‘బ్లాక్ మండే’ మళ్లీ పునరావృతం అయ్యే అవకాశం ఉందని హెచ్చరించడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో కలవరం మొదలైంది. ఇంతకీ ఏమిటా బ్లాక్ మండే..? ఆ రోజు ఏం జరిగింది..? ఇప్పుడు ఎందుకు మళ్లీ అలాంటి భయాలు వెంటాడుతున్నాయి..?
-1987 బ్లాక్ మండే అంటే ఏమిటి?
ప్రపంచవ్యాప్తంగా 1987 అక్టోబర్ 19వ తేదీని ‘బ్లాక్ మండే’గా అభివర్ణిస్తారు. ఆ ఒక్కరోజే అమెరికా స్టాక్ మార్కెట్ చరిత్రలో ఎన్నడూ ఊహించని దారుణ పతనం నమోదైంది. డోజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ సూచీ ఏకంగా 22.6 శాతం కుప్పకూలింది. మరోవైపు ఎస్‌అండ్‌పీ 500 సూచీ 30 శాతం విలువ కోల్పోయింది. ఇది కేవలం అమెరికాకే పరిమితం కాలేదు. ఆస్ట్రేలియా, ఆసియా, ఐరోపా మార్కెట్లను కూడా ఈ పతనం తీవ్రంగా ప్రభావితం చేసింది. దాదాపు నెల రోజుల పాటు ప్రపంచంలోని ప్రధాన మార్కెట్లు 20 శాతం మేర నష్టపోయాయి.
-బ్లాక్ మండేకు కారణాలేంటి?
1987లో స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా పతనమవ్వడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి చూస్తే..బ్లాక్ మండేకు ముందు స్టాక్ మార్కెట్‌లో భారీగా కొనుగోళ్ల జోరు కనిపించింది. 1982 నుంచి చూస్తే చాలా స్టాక్స్ విలువ మూడు రెట్లు పెరిగింది. దీంతో మార్కెట్‌లో ఒక రకమైన సర్దుబాబు అనివార్యమైంది. అప్పట్లో స్టాక్ ట్రేడింగ్‌లో కంప్యూటర్ల వినియోగం ప్రారంభ దశలో ఉంది. ‘సి’ ప్రోగ్రామ్ ఆధారంగా పనిచేసే ఆటోమేటిక్ ట్రేడింగ్ సిస్టమ్‌లు మానవ జోక్యం లేకుండా కొనుగోళ్లు, అమ్మకాలు చేపట్టాయి. ధరలు పెరుగుతున్నప్పుడు ఎక్కువ కొనుగోళ్లు, తగ్గుతున్నప్పుడు ఎక్కువ అమ్మకాలు జరిగేలా ఈ సిస్టమ్‌లు ప్రోగ్రామ్ చేయబడ్డాయి. అక్టోబర్ 19న అమ్మకాల ఆర్డర్లు పెరగడంతో మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. స్టాక్ ఆప్షన్లు, స్టాక్ ఇండెక్స్ ఫ్యూచర్లు, స్టాక్ ఇండెక్స్ ఆప్షన్లు ఒకేసారి గడువు ముగియడం కూడా బ్లాక్ మండేకు ముందు వచ్చిన సోమవారం జరిగింది. దీని ప్రభావంతో మార్కెట్ చివరి గంటల్లో భారీగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది.
- ఇప్పుడు ఎందుకు భయాలు?
ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న వాణిజ్య విధానాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఆయన వివిధ దేశాలపై భారీగా ప్రతీకార పన్నులు విధిస్తుండటంతో వాణిజ్య యుద్ధం మొదలయ్యే ప్రమాదం కనిపిస్తోంది. దీని ప్రభావం ఇప్పటికే ఆసియా మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా నమోదైన మార్కెట్ పతనాన్ని చూసి అమెరికా మార్కెట్ వ్యాఖ్యాత జిమ్ క్రెమెర్ 1987 బ్లాక్ మండేను గుర్తు చేశారు. ట్రంప్ తక్షణమే చర్చలకు సిద్ధంగా ఉన్న దేశాలతో మాట్లాడి పన్నులను తొలగించకపోతే, మార్కెట్లు మరింతగా పతనమయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
నిజానికి ఇటీవల మార్కెట్లలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇన్వెస్టర్లను కలవరపెడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు సెన్సెక్స్ 3000 పాయింట్లకు పైగా పడిపోవడం, నిఫ్టీ 22వేల మార్క్‌ను కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. నిఫ్టీలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ ఏకంగా రూ. 20 లక్షల కోట్ల మేర ఆవిరైంది.
-బ్లాక్ మండే తర్వాత తీసుకున్న చర్యలు:
1987 బ్లాక్ మండే తర్వాత భవిష్యత్తులో ఇలాంటి పతనాలు జరగకుండా ఉండేందుకు అనేక చర్యలు తీసుకున్నారు. అందులో ముఖ్యమైనది ‘సర్క్యూట్ బ్రేకర్లు’ ప్రవేశపెట్టడం. మార్కెట్‌లో ఒక్కసారిగా భారీ పతనం సంభవిస్తే, ట్రేడింగ్‌ను కొంత సమయం పాటు నిలిపివేయడానికి ఈ విధానం ఉపయోగపడుతుంది.
ట్రంప్ తీసుకుంటున్న టారిఫ్‌ల నిర్ణయాలు అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలను దెబ్బతీస్తున్నాయి. దీని ప్రభావం ప్రపంచంలోని అన్ని ప్రధాన మార్కెట్లపై కనిపిస్తోంది. 1987 నాటి బ్లాక్ మండే తరహా పరిస్థితులు మళ్లీ వస్తాయేమోనన్న భయం ఇన్వెస్టర్లను వెంటాడుతోంది. ఒకవేళ ట్రంప్ తన నిర్ణయాలను మార్చుకోకపోతే, రానున్న రోజుల్లో మార్కెట్లు మరింతగా కుప్పకూలే ప్రమాదం లేకపోలేదు.
- ట్రంప్ టారిఫ్‌ల దెబ్బకు కుప్పకూలిన మార్కెట్లు, రూ.20 లక్షల కోట్ల నష్టం!
ట్రంప్ టారిఫ్‌ల ప్రకటనతో అంతర్జాతీయంగా నెలకొన్న వాణిజ్య యుద్ధ భయాలు దేశీయ స్టాక్ మార్కెట్లను కుదిపేశాయి. సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే సూచీలు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ ఏకంగా 3000 పాయింట్లకు పైగా నష్టపోయి 72,431 వద్ద, నిఫ్టీ 920 పాయింట్లు కోల్పోయి 21,984 వద్ద ట్రేడవుతున్నాయి. ఈ ఒక్క రోజులోనే నిఫ్టీ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ దాదాపు రూ.20 లక్షల కోట్లు ఆవిరైంది.
అమెరికాలో మాంద్యం వస్తుందన్న ఆందోళనల నడుమ లోహ కంపెనీల షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కూడా తగ్గింది. అంతర్జాతీయంగా చూస్తే ఆసియా మార్కెట్లు సైతం భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. జపాన్ నిక్కీ, తైవాన్, దక్షిణ కొరియా, చైనా, ఆస్ట్రేలియా సూచీలు భారీగా పతనమయ్యాయి. అమెరికా ఫ్యూచర్ స్టాక్స్ కూడా నష్టాల్లో ఉండటంతో ఆ దేశ మార్కెట్లు కూడా భారీగా పతనమయ్యే అవకాశం ఉంది.
ఈ పతనం 2020 తర్వాత నిఫ్టీకి ఇదే అతిపెద్దది కావడం గమనార్హం. కరోనా సమయంలో నమోదైన నష్టాలను గుర్తుచేస్తూ, ఈ పరిణామాలు మార్కెట్లలో తీవ్రమైన ఆందోళనను కలిగిస్తున్నాయి.