అమెరికాలో తీవ్ర విషాదం.. ప్రాణం కోల్పోయిన మరో తెలుగు విద్యార్థి
వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రాజేశ్ తండ్రి నారాయణకు ఏకైక కుమారుడు. మెరుగైన భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ కుటుంబాన్ని రాజేశ్ మరణం తీవ్రంగా కుంగదీసింది.;
అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు యువకుల విషాదాంతాలు కలిచివేస్తున్నాయి. విసా నిబంధనలు కఠినతరం చేయడంతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న విద్యార్థులు అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల తూర్పుగోదావరి, హైదరాబాద్ కు చెందిన విద్యార్థులు గుండెపోటుతో మరణించగా, మంగళవారం కృష్ణా జిల్లా రుద్రవరం గ్రామానికి చెందిన STEM OPT విద్యార్థి కావూరి రాజేశ్ గుండెపోటుతో నేలకొరిగాడు. అత్యావసర చికిత్స చేసినా ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు. రాజేశ్ మృతి సమాచారం తెలియగానే ఆయన స్వగ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
విసా నిబంధనలు కఠినతరం చేయడంతో కొంతకాలంగా రాజేశ్ ఒత్తిడికి గురవుతున్నట్లు సమాచారం. దాదాపు ఒకటిన్నర సంవత్సరం నుంచి నిరుద్యోగంతో రాజేశ్ బాధపడుతున్నట్లు చెబుతున్నారు. అయినప్పటకి ఏదో ఒక విధంగా కాలం వెళ్లదీస్తున్న రాజేశ్ ఇటీవల బాగా కుంగిపోయినట్లు ఆయన స్నేహితులు చెబుతున్నారు. రాజేశ్ చాలా తెలివైన విద్యార్థి అని సౌమ్యుడని అంటున్నారు. మృధు స్వభావి కావడంతో ఒత్తిడి తట్టుకోలేకపోయారంటున్నారు.
వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రాజేశ్ తండ్రి నారాయణకు ఏకైక కుమారుడు. మెరుగైన భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ కుటుంబాన్ని రాజేశ్ మరణం తీవ్రంగా కుంగదీసింది. కుమారుడిని తలచుకుని తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. కుమారుడి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేలా ప్రభుత్వం సహాయం చేయాలని కోరుతున్నారు. ఇటీవల కాలంలో అమెరికాలో భారతీయ విద్యార్థుల మరణాలు తీవ్రంగా కుంగదీస్తున్నాయి. గుండెపోటుతో కొందరు, దుండగుల కాల్పుల్లో మరికొందరు అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతున్నారు. తాజా పరిణామాలతో అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.