ఎలన్ మస్క్ కి ఏమైంది?

ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యతో సోషల్ మీడియాను ఊపేసే మస్క్ ఈసారి తన బాణాన్ని ఏకంగా రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ వైపే గురిపెట్టారు.

Update: 2026-10-10 05:26 GMT

మార్స్‌పైకి రాకెట్లు పంపే ప్లాన్లు.. ట్విట్టర్‌ని కొని దానికి పేరు మార్చే పిచ్చి ప్రయోగాలు.. ఇవన్నీ ఒకెత్తయితే ఈసారి ఎలన్ మామ కన్ను మన ఇండియాపై పడింది. "అసలు ఇండియాకి బాస్ ప్రైమ్ మినిస్టరా లేక అంబానీనా?" అంటూ మస్క్ భయ్యా వేసిన సెటైరికల్ ట్వీట్ చూసి నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. "ట్విట్టర్ కొన్నంత తేలిగ్గా ఇండియన్ మార్కెట్‌ని కొట్టేయొచ్చనుకున్నావా మస్క్ బాస్? నీకు చిప్ ఏమైనా దొబ్బిందా ఏంటి?" అంటూ డిజిటల్ భారత్ ఇప్పుడు మస్క్‌పై రివర్స్ కౌంటర్ల వర్షం కురిపిస్తోంది. "డియర్ పీఎం అంబానీ.." అంటూ ఆయన విసిరిన వ్యంగ్యాస్త్రం ఇప్పుడు ఆయనకే బూమరాంగ్ అయి తిరిగొచ్చింది. అసలు ఇండియాలో ఇంటర్నెట్ లేదని మస్క్ ఏ లోకంలో ఉండి అన్నాడో కానీ ఆ మాట విన్న 96 కోట్ల మంది భారతీయ నెట్ ప్రియులు, కమలాసన్ నుంచి మొదలుపెడితే సెలబ్రెటీలు, పారిశ్రామికవేత్తలు, సామాన్యులు అందరూ ముప్పేట దాడి మొదలుపెట్టారు.

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలన్ మస్క్ మళ్ళీ వార్తల్లో నిలిచారు. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యతో సోషల్ మీడియాను ఊపేసే మస్క్ ఈసారి తన బాణాన్ని ఏకంగా రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ వైపే గురిపెట్టారు. తన సొంత సోషల్ మీడియా అయిన ఎక్స్ వేదికగా ఆయన చేసిన సంచలన ట్వీట్ ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది.

"డియర్ ప్రైమ్ మినిస్టర్ అంబానీ.." మస్క్ వ్యంగ్యాస్త్రాలు

ట్వీట్‌లో మస్క్ ఏకంగా అంబానీని ‘ప్రైమ్ మినిస్టర్ అంబానీ’ అంటూ తీవ్ర వ్యంగ్యంగా సంబోధించారు. "భారతదేశానికి నిజమైన బాస్ ముఖేశ్ అంబానీయే అని నాకు ఇప్పుడే అర్థమైంది" అంటూ ఎద్దేవా చేశారు. భారత్‌లో స్టార్‌లింక్ ప్రవేశానికి అనుమతులు ఇవ్వకుండా అంబానీ కంపెనీలు ఏకపక్షంగా మార్కెట్‌ను ఏలుతున్నాయని.. ప్రజలను దోపిడీ చేస్తున్నాయంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. భారత్‌లో ఇప్పటికీ ఎన్నో ప్రాంతాల్లో సరైన ఇంటర్నెట్ లేదని తమ ‘స్టార్‌లింక్’ వస్తే విద్యార్థులకు, వ్యాపారులకు గొప్ప అవకాశాలు వస్తాయని మస్క్ వాదించారు.

భారత్‌లో నెట్ లేదా? నెటిజన్ల కౌంటర్

మస్క్ వ్యాఖ్యలపై భారతీయ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "భారత్‌లో ఇంటర్నెట్ లేదా? ఏ లోకంలో ఉన్నావ్ మస్క్ భయ్యా?" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ట్రాయ్ నివేదికల ప్రకారం మార్చి 2025 నాటికే భారత్‌లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 96 కోట్లు దాటింది. ఇందులో గ్రామీణ ప్రాంత చందాదారులే 40 కోట్లకు పైగా ఉన్నారు. 98 శాతానికి పైగా గ్రామాలకు ఇప్పటికే మొబైల్ కనెక్టివిటీ ఉంది. అలాంటప్పుడు భారత్‌లో నెట్ లేదంటూ మస్క్ మాట్లాడటం ఆయన అవగాహన రాహిత్యానికి అద్దం పడుతోందని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.

'నీతులు చెప్పే మస్క్' కి నెటిజన్ల దిమ్మతిరిగే ప్రశ్నలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా సుమారు 288 మిలియన్ డాలర్లు కుమ్మరించిన మస్క్ ఇప్పుడు భారత్‌లో రాజకీయం, వ్యాపారం గురించి మాట్లాడటం ఏంటని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. "అక్కడ మీ రాజకీయాల కోసం రూ.కోట్లు తగలేసి, ఇక్కడ భారత్‌లోని నిబంధనలను, వ్యాపారాలను విమర్శిస్తారా?" అంటూ ట్రోల్ చేస్తున్నారు.

పోటీకి సై.. కానీ మన రూల్స్ మనవే

శాటిలైట్ ఇంటర్నెట్ ద్వారా మారుమూల ప్రాంతాలకు వేగవంతమైన నెట్ అందించడం మంచిదే అయినప్పటికీ విదేశీ కంపెనీ ఏదైనా సరే భారత చట్టాలు, స్పెక్ట్రమ్ నిబంధనలు, భద్రతా ప్రమాణాలకు లోబడి నడుచుకోవాల్సిందే. అంబానీ అయినా మస్క్ అయినా.. భారత్ ఎవరి వ్యక్తిగత సామ్రాజ్యం కాదని కేంద్ర ప్రభుత్వం అందరికీ ఒకటే రూల్ పెట్టి స్పష్టం చేసింది. దేశభద్రత, జాతీయ సమైక్యత విదేశీయుల చేతుల్లోకి పోకుండా ఈ నిబంధనలు పెట్టింది.

మస్క్ మాటల వెనుక ఉన్న అసలు ఉద్దేశం భారత్‌లో తన స్టార్‌లింక్ వ్యాపారాన్ని త్వరగా విస్తరించుకోవడమే తప్ప దేశ ప్రజల సంక్షేమం కాదనేది స్పష్టమవుతోంది. మొత్తానికి మస్క్ వేసిన ఈ సెటైరికల్ పాచిక ఆయనకే రివర్స్ అయిందని చెప్పవచ్చు.

Tags:    

Similar News