భారత్ లోనూ 'స్టార్ లింక్...' కేంద్రం ఓకే.. ఇక కమ్యూనికేషన్ విప్లవమే
ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అందించేదే ’స్టార్ లింక్’. ఈ మేరకు స్టార్ లింక్ సేవలను భారత్ లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా అనుమతి ఇచ్చింది;
అపర కుబేరుడు ఎలాన్ మస్క్ మామ భారత మార్కెట్లోకి అడుగుపెడుతున్నాడు.. ఎంతో ప్రసిద్ధి చెందిన తన కారు ’టెస్లా’ ఇప్పటివరకు ఇండియాలోకి రాలేకున్నా.. ఎంతో ప్రయత్నం చేసినా సాధ్యం కాకున్నా.. మస్క్ మరో రూపంలో వచ్చేస్తున్నాడు. అదే స్టార్ లింక్. ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అందించేదే ’స్టార్ లింక్’. ఈ మేరకు స్టార్ లింక్ సేవలను భారత్ లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా అనుమతి ఇచ్చింది. దీనికోసం అవసరమైన అనుమతి (లైసెన్సు) కేంద్ర టెలికాం శాఖ జారీ చేసింది. ఇప్పటికే దిగ్గజ సంస్థ రిలయన్స్ కు చెందిన జియోతో పాటు యులెల్సాట్ వన్ వెబ్ కు భారత్ లో ఈ లైసెన్సు కలిగి ఉన్నయి. స్టార్ లింగ్ దరఖాస్తు చేసుకున్న 15 నుంచి 20 రోజుల్లో ట్రయల్ స్పెక్ట్రమ్ మంజూరు చేస్తామని కేంద్ర టెలికాం శాఖ తెలిపింది.
ఇంతకూ స్టార్ లింక్ స్పెషాలిటీ ఏమిటి?
టెస్లా నుంచి ట్విటర్ (ఎక్స్) వరకు మస్క్ ఏం చేసినా సంచలనమే. ఆయన సంస్థ స్పేస్ ఎక్స్ కు అనుబంధమైనదే స్టార్ లింక్. అంతేకాదు.. ఇదొక అసాధారణం అని కూడా చెప్పొచ్చు. 130 దేశాల్లో ఇప్పటివరకు సేవలందిస్తోంది. సుదూరాన ఉండే భూస్థిర ఉపగ్రహాలపై ఆధారపడకుండా.. లియో (లో ఎర్త్ ఆర్బిట్) ఉపగ్రహాల ద్వారా సేవలందించడమే దీని ప్రత్యేకత.
స్టార్ లింక్ ఇప్పటికే 7 వేలపైగా ఉపగ్రహాలను ప్రయోగించడం గమనార్హం. భూమికి 550 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోనే ఇవి తిరుగుతుంటాయి. ఇంత తక్కువ దూరంలో ఉండడంతో తక్కువ లేటెన్సీతోనే ఇంటర్నెట్ పొందవచ్చు.
సూపర్ ఇంటర్నెట్..
ఇప్పటికీ మన దేశంలో కొండలు, మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు చాలా కష్టం. ఒకవేళ ఉన్నా.. స్పీడ్ తక్కువ. కానీ, స్టార్ లింక్ వస్తే ఈ ఇబ్బంది ఉండదు. అంతేకాక వేగం కూడా అధికంగా ఉంటుంది. స్టార్ లింక్ సేవల్లో చిన్న యాంటెనా ఉంటుంది. ఇది ఉపగ్రహ గమనం ఆధారంగా తిరుగుతుంటుంది. భారత్ లోనూ స్టార్ లింక్ సేవలు మొదలైతే ప్రపంచ మొబైల్ బ్రాండ్ బ్యాండ్ ను అందించాలన్న మస్క్ కల సాకారం మరో అడుగు ముందుకు పడినట్లే.
మస్క్ ను అపర కుబేరుడిని చేసిన ’స్పేస్ ఎక్స్’కు వెన్నుముక స్టార్ లింకే కావడం గమనార్హం. 2019లో స్టార్ లింగ్ ఉపగ్రహ ప్రయోగాలు ప్రారంభం అయ్యాయి. ఈ ఆరేళ్లలోనే ఏడు వేలకు పైగా ప్రయోగించడం విశేషం. స్టార్ లింక్ కు ఇప్పటికే 40 లక్షలకు పైగా సబ్ స్క్రైబర్లు ఉన్నారు. భారత్ లోకి వస్తే ఇది ఇంకా పెరుగడం ఖాయం.
మూడేళ్ల కిందట రష్యా యుద్ధం మొదలుపెట్టినప్పుడు ఉక్రెయిన్ కు స్టార్ లింక్ తన సేవలను అందించి.. కమ్యూనికేషన్లను కాపాడుకుంది. స్టార్ లింక్ సైనిక వెర్షన్ ’స్టార్ షీల్డ్’.