పరువు హత్య కేసు.. సంచలన వీడియో బయటకు.. ప్రమాదాన్ని ముందే ఊహించిందా?

బాధితురాలు చెప్పినట్లే ఆమె స్నేహితుడు ఈ నెల 6న పోలీసులకు ‘శక్తి’యాప్ ద్వారా వీడియో షేర్ చేయగా, అప్పటికే ఆమె మరణించిందని పోలీసులు గుర్తించినట్లు చెబుతున్నారు.

Update: 2026-06-12 17:47 GMT

శ్రీకాకుళం జిల్లాలో చర్చనీయాంశంగా మారిన పరువు హత్య కేసులో సంచలన వీడియో బయటకు వచ్చింది. హైదరాబాద్ లో గ్రూప్-1 శిక్షణ తీసుకుంటున్న దుంపల హరిణి (24) గత నెలలో స్వగ్రామమైన శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం సొర్లిగాం వెళ్లగా, అంతకు ముందే చిత్రీకరించినట్లుగా చెబుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో తాను తన స్వగ్రామం వెళుతున్నానని, ఈ నెల 5న తిరిగి హైదరాబాద్ వచ్చేందుకు రిజర్వేషన్ చేసుకున్నట్లు హరిణి తెలిపింది. ఒకవేళ తాను తిరిగి రాకపోయినా, తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా తనకు ప్రమాదం వాటిల్లినట్లు భావించాలని హైదరాబాద్ పోలీసులను కోరుతూ హరిణి చేసిన వీడియో ఇప్పుడు బయటకు రాగా, అప్పటికే మరణించడం తీవ్ర అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు.

హైదరాబాద్ బాలానగర్ లో తాను నివసిస్తున్నప్పటికీ తన తల్లిదండ్రులు స్వస్థలం శ్రీకాకుళం అంటూ హరిణి ఆ వీడియోలో తెలిపింది. కుటుంబంతో మనస్పర్థలు కారణంగా తన ప్రయాణంపై హరిణి ముందుగానే భయాందోళన వ్యక్తం చేయడం, దీనిపై వీడియో చేసి తన స్నేహితుడికి పంపినట్లు చెబుతున్నారు. గత నెల 31న హరిణి మరణించగా, ఆమెకు కుటుంబ సభ్యులే హాని తలపెట్టి ఉంటారని అనుమానంతో హరిణి స్నేహితుడు ఆ వీడియోను మీడియాకు పోలీసులకు విడుదల చేశాడు. దీంతో హరిణి మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బాధితురాలు చెప్పినట్లే ఆమె స్నేహితుడు ఈ నెల 6న పోలీసులకు ‘శక్తి’యాప్ ద్వారా వీడియో షేర్ చేయగా, అప్పటికే ఆమె మరణించిందని పోలీసులు గుర్తించినట్లు చెబుతున్నారు. హరిణి గత నెల 31న స్వగ్రామానికి రాగా, ఆ రోజు రాత్రే మరణించిందని కుటుంబ సభ్యులు చెప్పారని పోలీసులు చెబుతున్నారు. అయితే బాధితురాలు వీడియో ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులకు అసలు విషయం తెలిసిందని అంటున్నారు. ముందుగా గుండె పోటుతో హరిణి మరణించిందని చెప్పినా, పోలీసుల పంథాలో విచారణ జరపగా, తల్లి, భర్త, తాతా కలిసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారని స్థానికులు చెబుతున్నారు.

కాగా, మృతురాలు హరిణి వీడియో సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ప్రాణాపాయం ఉందని తెలిసినా ఆమె స్వగ్రామానికి వెళ్లి బలైపోయిన ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. మేనమామతో వివాహ బంధాన్ని కొనసాగించలేక హైదరాబాద్ లోనే ఉండిపోవాలని హరిణి భావించిందని, ఆ క్రమంలో వేరే వ్యక్తితో ఏర్పడిన పరిచయం వల్ల కుటుంబంలో తగాదాలు జరిగినట్లు చెబుతున్నారు. ఈ విషయం తెలిసి విడాకుల కోసం మాట్లాడదామని పిలిచి హరిణిని హతమార్చారని ఆరోపిస్తున్నారు. అయితే అపాయాన్ని ముందే ఊహించిన హరిణి ప్రాణాలు కాపాడులేకపోవడమే విషాదమని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సంఘటనతో చదువుకున్న యువతులకు కూడా స్వేచ్ఛ, రక్షణ కరువయ్యాయనే వాదన వినిపిస్తున్నారు.

Tags:    

Similar News