నీతులు చెప్పొద్దని సోషల్ మీడియాలో నాపై పోస్టింగులు.. విశాఖ ఎంపీ శ్రీభరత్ ఆసక్తికర వ్యాఖ్యలు
కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించాలని ప్రతిపాదిస్తున్న సమయంలో టీడీపీకి చెందిన ఎంపీ చేసిన వ్యాఖ్యలు హైలెట్ అవుతున్నాయి.;
ఆరోగ్యశ్రీ పథకం అమలుపై గీతం చైర్మన్, విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వానికి రూ. 115 కోట్ల విద్యుత్ బకాయిలు ఉన్నట్లు ఆయనపై వస్తున్న ఆరోపణలపైనా వివరణ ఇచ్చారు. ఓ యూట్యూబ్ చానల్ కి ఎంపీ శ్రీభరత్ తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. ప్రధానంగా ఆరోగ్యశ్రీపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇంట్రస్టింగుగా ఉన్నాయని అంటున్నారు. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించాలని ప్రతిపాదిస్తున్న సమయంలో టీడీపీకి చెందిన ఎంపీ చేసిన వ్యాఖ్యలు హైలెట్ అవుతున్నాయి.
ఆరోగ్యశ్రీ పథకం వల్ల ప్రైవేటు మెడికల్ కాలేజీలకే ఎక్కువ లబ్ధి జరుగుతోందని విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటు పరం చేస్తున్నారనే వైసీపీ విమర్శల నేపథ్యంలో విశాఖ ఎంపీ తీవ్రంగా స్పందించారు. మాజీ సీఎం రాజశేఖరరెడ్డి హయాంలో ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారని, ఈ పథకం వల్ల ప్రైవేటు ఆస్పత్రులు ఎక్కువగా లాభపడ్డాయని అన్నారు. అంత డబ్బుతో ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించే బదులు, ప్రభుత్వ వైద్యాన్ని మెరుగుపరచాల్సింది కదా? అంటూ ప్రశ్నించారు.
ప్రైవేటుకు మెడికల్ కాలేజీలు ఇస్తున్నామనే వాదనను ఆయన కొట్టిపడేశారు. మెరుగైన సేవలకే పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోందని చెప్పారు. ఆరోగ్యశ్రీ వల్ల ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు బాగుపడుతున్నాయని భావిస్తున్నప్పుడు కూటమి ప్రభుత్వం ఆ పథకాన్ని రద్దు చేయొచ్చు కదా? అనే ప్రశ్నపైనా ఎంపీ తెలివిగా స్పందించారు. ఆరోగ్యశ్రీని తాము తప్పుపట్టడం లేదని, కొన్ని మార్పులతో అమలు చేస్తే బాగుంటుందని సూచిస్తున్నట్లు తెలిపారు.
ఇక తెలంగాణలో గీతం వర్సిటీ కరెంటు బిల్లుల బకాయి కొండలా పేరుకుపోయిందనే ప్రశ్నకు చైర్మన్ హోదాలో భరత్ వివరణ ఇచ్చారు. ఒక్క నెల కరెంటు బిల్లు కట్టకపోయినా కనెక్షన్ పీకేస్తారని, కానీ తాము 16 ఏళ్లుగా కరెంటు బిల్లు కట్టలేదని ప్రచారం చేస్తున్నారని తెలిపారు. గీతం వర్సిటీకి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తమ వర్సిటీకి పక్కనే ఉన్న ఖాయిలా పడిన ఫెర్రో ఎల్లాయిస్ యూనిట్ బకాయిలను తమపై వేస్తున్నారని తెలిపారు. తమ సంస్థ 2009లో తెలంగాణలో వర్సిటీని ప్రారంభించిందని, ఇప్పటివరకు క్రమం తప్పకుండా బకాయిలు చెల్లిస్తున్నట్లు భరత్ వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వానికి తాను బకాయి పడ్డానని, ఆ బకాయి చెల్లించి నీతులు చెప్పాలంటూ సోషల్ మీడియాలో తనను కొందరు ప్రశ్నిస్తున్నారని కూడా భరత్ వ్యాఖ్యానించారు.