మస్క్ మావా తో అట్లుంటది మరి.. స్పేస్ ఎక్స్ ఐపీఓ వస్తే ‘స్పేస్’ లోకి వెళ్లేది రాకెట్లు కాదు.. ఉద్యోగుల బ్యాంక్ బ్యాలెన్స్

కానీ ఇప్పుడు అందరి దృష్టి మస్క్ బాబాయ్ మీద లేదు సరికదా.. ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్ లో పని చేసే కుర్రాళ్ల మీద పడింది.

Update: 2026-06-11 12:30 GMT

ఎలాన్ మస్క్ అనగానే మనకు గుర్తొచ్చేవి ఎక్స్ లో ఆయన పెట్టే విచిత్రమైన పోస్ట్ లు.. అంగారకుడిపై ఇళ్లు కడతాడనే ఊహాగానాలు.. లేదా ఎప్పుడు పేలుతుందో తెలియని రాకెట్లు. కానీ ఇప్పుడు అందరి దృష్టి మస్క్ బాబాయ్ మీద లేదు సరికదా.. ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్ లో పని చేసే కుర్రాళ్ల మీద పడింది.

అవును.. మీరు విన్నది నిజమే.. స్పేస్ ఎక్స్ ఐపీఓ మార్కెట్లోకి రాబోతుందనే వార్తలతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్ల కంటే.. ఆ కంపెనీలో పని చేసే ఉద్యోగులే ఎక్కువ కలల లోకంలో తేలిపోతున్నారు.

జీతం తక్కువ.. షేర్లు ఎక్కువ.. మస్క్ తాత వేసిన ‘మాస్టర్ ప్లాన్’

సాధారణంగా ఏ స్టార్టప్ కంపెనీలోనైనా ఉద్యోగులను చేర్చుకునేటప్పుడు ఒక డైలాగ్ చెప్తారు. "ఇప్పుడు జీతం కొంచెం తక్కువ ఇస్తాం కానీ.. కంపెనీ షేర్లు ఇస్తాం. భవిష్యత్తులో మీరు కోటీశ్వరులు అయిపోతారు" అని. చాలా కంపెనీల్లో ఈ ముక్క నమ్మి జాయిన్ అయినవాళ్లు ఆ తర్వాత తలలు పట్టుకుంటారు. కానీ మస్క్ దగ్గర ఆ పప్పులు ఉడకలేదు. ఆయన నిజంగానే ‘స్పేస్’ లెవెల్ ప్లాన్ వేశాడు.

విశ్లేషకుల అంచనాల ప్రకారం.. స్పేస్ ఎక్స్ గనుక షేర్ మార్కెట్‌లో అడుగుపెడితే.. సుమారు 4,000 నుండి 4,400 మంది ప్రస్తుత, మాజీ ఉద్యోగులు రాత్రికి రాత్రే మిలియనీర్లు అయిపోతారట..

ట్విస్ట్ ఏంటంటే ఇందులో కేవలం పెద్ద పెద్ద రాకెట్ సైంటిస్టులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు మాత్రమే లేరు. కంపెనీ క్యాంటీన్‌లో కాఫీలు ఇచ్చిన సిబ్బంది, రాకెట్ ముక్కలను అతికించిన వెల్డర్లు, ఆఫీస్ బాయ్స్ కూడా ఉన్నారు. రేపు పొద్దున వీళ్లంతా రోల్స్ రాయిస్ కార్లలో ఆఫీస్‌కి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కార్పొరేట్ ప్రపంచంలో ఒక అన్ ప్రిడక్టబుల్ నియమం ఉంది. కంపెనీ ఎంత లాభాల్లోకి వచ్చినా.. సింహభాగం అంతా పైన కూర్చున్న సీఈఓలు, మేనేజర్ల అకౌంట్లలోకి వెళ్తుంది. కింద ఉన్న ఉద్యోగులకు మాత్రం "ఈసారి దీపావళికి స్వీట్ బాక్స్ కొంచెం పెద్దది ఇస్తున్నాం" అనే బోనస్ డైలాగ్స్ మిగులుతాయి.

కానీ స్పేస్ ఎక్స్ కథ వేరు. రాకెట్లు భూమి మీద పడి పేలిపోతున్నప్పుడు కూడా మస్క్‌ను నమ్మి, జీతాలు తక్కువైనా షేర్లను నమ్ముకుని పనిచేసినందుకు.. ఇప్పుడు వాళ్ల అకౌంట్లు ‘టపాసులు’ పేల్చబోతున్నాయి. దీన్నే కొందరు మేధావులు “ఉద్యోగుల సంపద పండుగ” అంటున్నారు.

అంతా బాగానే ఉంది కానీ.. ఆ మస్క్ మామ నోరు విప్పాలిగా?

మార్కెట్ అంతా ఇంతలా ఊగిపోతుంటే మన ఎలాన్ మస్క్ మాత్రం ఏమీ తెలియనట్టు సైలెంట్‌గా ఉన్నాడు. ఎప్పుడు ఏ మూడ్‌లో ఉంటాడో తెలియని మస్క్ ఐపీఓ గురించి ఇంకా అధికారికంగా నోరు మెదపలేదు. బహుశా ఎక్స్ లో ఏదైనా మీమ్ పోస్ట్ చేసి సర్ప్రైజ్ ఇద్దామని ప్లాన్ చేస్తున్నాడేమో.. ఒకవేళ ఈ ఐపీఓ కనుక వస్తే.. అది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద లిస్టింగ్‌లలో ఒకటిగా నిలవడం ఖాయం.

స్పేస్ ఎక్స్ కథలో అసలు హీరో ఎలాన్ మస్క్ మాత్రమే కాదు.. "మస్క్ గారు ఏ క్షణంలోనైనా కంపెనీని మూసేయవచ్చు లేదా మార్స్ కి తీసుకెళ్లవచ్చు" అనే భయం ఉన్నా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పని చేసిన వేలాది మంది ఉద్యోగులు. రాకెట్లను అంతరిక్షంలోకి పంపిన వాళ్ల చేతులు త్వరలోనే నోట్ల కట్టలను లెక్కపెట్టబోతున్నాయి.

కాబట్టి ఫ్రెండ్స్.. నెక్స్ట్ టైం ఎవరైనా మస్క్ కంపెనీలో ‘స్వీపర్’ ఉద్యోగం ఉన్నా వదులుకోవద్దు. ఎందుకంటే.. మస్క్ తో అట్లుంటది మరి..

Tags:    

Similar News