ప్రపంచ దృష్టిని ఆకర్షించిన దక్షిణ కొరియా.. తల్లులకు అండగా ఏమి చేసిందంటే?

సాధారణంగా ఒక మహిళ గర్భం దాల్చింది అంటే తిరిగి ప్రసవించే వరకు.. ఆ తర్వాత ఆరు నెలలపాటు ఆ మహిళను కంటికి రెప్పలా చూసుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు.;

Update: 2025-09-11 20:30 GMT

సాధారణంగా ఒక మహిళ గర్భం దాల్చింది అంటే తిరిగి ప్రసవించే వరకు.. ఆ తర్వాత ఆరు నెలలపాటు ఆ మహిళను కంటికి రెప్పలా చూసుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు. తన ప్రాణంలో ఇంకొక ప్రాణానికి ఊపిరి పోస్తూ..ఆ మహిళ ఎన్ని కష్టాలు పడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే సాధ్యమైనంత వరకు గర్భం దాల్చినప్పుడు ,ప్రసూతి సమయంలో విశ్రాంతి అవసరం. నిజానికి గర్భం దాల్చినప్పుడు విశ్రాంతి అవసరం అయినా తప్పని పరిస్థితుల్లో ఉద్యోగాల్లో ఉన్నవారు.. తమ ఉద్యోగాన్ని కొనసాగించాల్సి వస్తుంది. లేకపోతే జీవన మనుగడ.. ఆర్థిక ఆధారం కష్టమవుతుందనటంలో సందేహం లేదు.

అందుకే చాలామంది మహిళలు గర్భం దాల్చాక.. ప్రసూతి సమయం దగ్గర పడే వరకు ఉద్యోగం చేస్తూనే ఉంటారు. ఇలాంటి వారికి ఆయా సంస్థలు కూడా కొంతవరకు సహాయాన్ని కలిగిస్తే.. నిర్ధాక్షిణ్యంగా ఉద్యోగాల నుంచి తీసేసిన కార్పొరేట్ సంస్థలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూ.. ఒక దేశం తల్లుల కోసం అండగా నిలవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాదు ఈ దేశం తల్లుల కోసం ఇస్తున్న ఆర్థిక భరోసాకి ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఆ దేశం ఏంటి? తల్లులకు ఏ విధంగా అండగా నిలుస్తోంది? అనే విషయం ఇప్పుడు చూద్దాం.

అసలు విషయంలోకి వెళ్తే వర్కింగ్ ఉమెన్ ప్రెగ్నెంట్ అని తెలిస్తే చాలు అక్కడి ప్రభుత్వం అండగా నిలబడి ఆర్థిక సహాయం అందిస్తుంది. ప్రసూతి సహాయం మాత్రమే కాదు పుట్టిన బిడ్డకు ఎనిమిది సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఆర్థిక అండగా నిలుస్తుంది. ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా? అది దక్షిణ కొరియా.. విషయంలోకి వెళ్తే నేహా అరోరా అనే ఒక భారత సంతతి తల్లికి తన గర్భ సమయంలో దక్షిణ కొరియా ప్రభుత్వం అందించిన ఆర్థిక మద్దతు గురించి ఆమె నెట్టింట సగౌరవంగా షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా ఆ ప్రభుత్వం కాబోయే తల్లులకు అందించే ఆర్థిక సహాయం గురించి వివరంగా నెటిజన్ లకు ఆమె తెలియజేశారు.

నేహా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఇలా చెప్పుకొచ్చారు.. "నేను గర్భం దాల్చాను అని నిర్ధారణ అయిన వెంటనే వైద్య పరీక్షలు, మందులు, తదితర ఖర్చులకు దక్షిణ కొరియా ప్రభుత్వం రూ.63,100 ఇచ్చింది. దాంతోపాటు ట్రావెల్ ఖర్చులకోసం అదనంగా రూ.44,030 అందించింది. ఇలాంటి సహాయం నాకు డెలివరీ సమయంలో కూడా ఆ ప్రభుత్వం నుండి లభించింది. ప్రసవం సమయంలో ఒకేసారి సుమారుగా రూ.1.26 లక్షల వరకు ఆర్థిక సహాయం చేసింది. దీనిని అక్కడి ప్రభుత్వంలో అధికారికంగా "కంగ్రాగ్యులేటరీ మనీ ఆన్ డెలివరీ" అని పిలుస్తారు.. అంటే "అభినందన ప్రసూతి సహాయం" అని చెప్పవచ్చు.

ఇక నేను డెలివరీ అయిన తర్వాత కూడా నాకు నెలవారీగా ఆర్థిక సహాయం అందించారు. అలా ప్రతినెల మొదటి ఏడాది రూ.63,100 అందించగా.. రెండవ ఏడాది ప్రతినెల రూ.31,000 ఆర్థిక సహాయం అందించారు. అంతేకాదు నా బిడ్డకు మూడవ సంవత్సరం నుండి ఎనిమిదేళ్ల వయసు వచ్చేవరకు ప్రతి నెల రూ.12,600 ఆర్థిక సహాయం అందించారు" అంటూ దక్షిణ కొరియా ప్రభుత్వం పై, ఆ ప్రభుత్వం గర్భం దాల్చిన మహిళల పట్ల తీసుకున్న జాగ్రత్తల పట్ల ఆమె తెలియజేస్తూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అంతేకాదు అందుకు సంబంధించిన వీడియో ని కూడా ఆమె పంచుకున్నారు. ప్రస్తుతం ఈ విషయం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు దక్షిణ కొరియా ప్రభుత్వం ప్రసూతి ప్రయోజనాలను ప్రశంసించడమే కాకుండా భారతదేశంలో అందించే ప్రసూతి ప్రయోజనాలతో కూడా పోలుస్తున్నారు.

Tags:    

Similar News