డీలిమిటేషన్ : 2026 లెక్కతోనే బీజేపీ ముందుకు ?
జనాభా ప్రాతిపదికన ఎంపీ ఎమ్మెల్యే సీట్లను పునర్ విభజన చేయవద్దు అన్నది దక్షిణాది రాష్ట్రాల డిమాండ్.;
జనాభా ప్రాతిపదికన ఎంపీ ఎమ్మెల్యే సీట్లను పునర్ విభజన చేయవద్దు అన్నది దక్షిణాది రాష్ట్రాల డిమాండ్. అలా కనుక జరిగితే జనాభా నియంత్రణ కఠినంగా అమలు చేసినందుకు గానూ భారీగా నష్టపోతామని అనేక దక్షిణాది రాష్ట్రాలు అంటున్నాయి. అయితే బీజేపీ ఈ విన్నపాలు విన్న మీదట స్వామి కార్యం స్వకార్యం అన్నట్లుగా మహిళా బిల్లు రిజర్వేషన్లు అమలుతో కలిపి డీలిమిటేషన్ ని ముందుకు తెచ్చింది. దీని వల్ల 2026 లో జనాభా లెక్కలు పూర్తి కాకుండానే దేశవ్యాప్తంగా సీట్లు పెంచుకుంటే 2029 ఎన్నికలకు మహిళా రిజర్వేషన్లు వస్తాయి అలాగే డీలిమిటేషన్ పూర్తి అవుతుందని అని లెక్క వేసింది. కానీ డామిట్ కధ అడ్డం తిరిగింది అన్నట్లుగా ఇపుడు లోక్ సభలో బిల్లు వీగిపోయింది.
అనివార్యమైన పరిస్థితి :
ఇదిలా ఉంటే ఇపుడు డీలిమిటేషన్ విషయంలో బీజేపీ ముందు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అందులో మొదటిది ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా మరోసారి పాతికేళ్ళకు డీలిమిటేషన్ ప్రక్రియను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడం. అంటే ఇపుడున్న 543 ఎంపీ సీట్లతోనే 2051 దాకా ముందుకు సాగడం అన్న మాట. దీని వల్ల దేశంలో ఎక్కడా సీట్లు పెరగవు. అదే సమయంలో దక్షిణాదికి అన్యాయం జరిగింది వివక్ష అన్న మాటలు విమర్శలు అసలు ఉండవని అంటున్నారు. అలా కాదు ఇప్పటికే యాభై అయిదేళ్ళు పూర్తి అయింది. మరో పాతికేళ్ళు అంటే ఇవే సీట్లతో పార్లమెంట్ ని నడపడం కష్టమని పెరిగిన జనాభాకు తగిన విధంగా ఎంపీ సీట్ల పెరుగుదల ఉండాలి అనుకుంటే కనుక కచ్చితంగా డీలిమిటేషన్ చేయాల్సిందే. అది రాజ్యాంగం ప్రకారం అనివార్యత కూడా.
జనాభా గణన పూర్తితో :
అలాంటి పరిస్థితి వస్తే 2027 ద్వితీయార్ధం వరకూ వేచి చూడడమే ఒక మార్గం. అలా జనాభా గణన ద్వారా వచ్చిన కొత్త లెక్కలను ఆధారం చేసుకుని కొత్తగా సీట్లను పెంచడం. అది 2001లో చేసిన రాజ్యాంగ సవరణకు అనుకూలమైన విధానం కాబట్టి ఎవరూ ఏమీ అనేది కూడా ఉండదని అంటున్నారు. దాంతో బీజేపీ ఏ మార్గం ఎంచుకుంటుంది అన్నదే ఇపుడు చర్చ. అయితే విపక్షాల చేతిలో ఓటమి చెంది దెబ్బ తిన్న బెబ్బులిగా బీజేపీ ఉంది కాబట్టి ఇక మీదట ఏ విన్నపాలూ పట్టించుకోకుండా తాజా జనాభా లెక్కల ప్రకారం కనుక సీట్ల పెంపు చేపడితే దక్షిణాదికి అదే అసలైన అన్యాయం అని అంటున్నారు. ఎందుకంటే అక్కడే ఉంది అసలైన మతలబు అంటున్నారు.
మరింతగా తగ్గుదల :
ఇక 1971 నాటికి దేశ జనాభాలో దక్షిణాది రాష్ట్రాల శాతం 24 శాతం పైగా ఉంది. అందుకే అదే నిష్పత్తిలో సీట్ల పంపిణీ జరిగింది. కానీ 2001 కి వచ్చేసరికి మాత్రం అది కాస్తా ఇంకా తగ్గింది. ఎందుకంటే జనాభా నియంత్రణ చేయడం వల్ల. ఇక 2026 నాటికి చూస్తే మరింతగా తగ్గుతుంది అని అంటున్నారు. అంటే ఏ 18 శాతానికో పడిపోతుంది అని అంటున్నారు. మరి ఆ జనాభా లెక్కలను తీసుకుంటే కనుక ఏపీలో ప్రస్తుతం ఉన్న పాతిక ఎంపీ సీట్లు కాస్తా 23 లేదా 22 గా తగ్గిపోతాయని అంటున్నారు. అలాగే తెలంగాణాలో ఉన్న 17 కాస్తా 15 కి తమిళనాడులో ఉన్న 39 సీట్లు ఏ 35 కో కర్ణాటకలో ఉన్న 28 సీట్లు పాతికకు, కేరళలో ఉండే 20 సీట్లు ఏ 15 గానో తగ్గిపోతాయని అంటున్నారు.
చాన్స్ మిస్ చేసుకున్నారా :
అందుకే బీజేపీ దేశమంతటికీ ఒకే విధానం అన్నట్లుగా ప్రస్తుతం ఉన్న సీట్లకు యాభై శాతం అదనం అని పెంచింది. ఒకవేళ అది కాదు అనుకుంటే 2011 జనాభా లెక్క ప్రకారం అయినా చేసేందుకు ఒకే చెప్పింది. ఈ రెండింటిలో కూడా 50 శాతం అదనం సీట్లే మేలు అయిన విధానం. కానీ బీజేపీ మీద గుడ్డి వ్యతిరేకతతో 131 రాజ్యాంగ సవరణ బిల్లుని పార్లమెంట్ లో విపక్షాలు తోసి పుచ్చాయి. దాంతో ఇపుడు బంతి బీజేపీ చేతిలోకి వచ్చిపడింది. బీజేపీ కనుక 2026 లెక్కల ప్రకారం వెళ్తే ప్రస్తుతం దక్షిణాదికి ఉన్న 129 సీట్లు కాస్తా ఏ 115 గానో తగ్గిపోతాయని అంటున్నారు. సో బీజేపీని ఓడించామని చెబుతున్న విపక్షాలు ఇంతకీ తాము గెలిచాయా ఓడాయా అన్నది రాబోయే రోజులలో తేలుతుంది అని అంటున్నారు.