సోమిరెడ్డి పాద‌యాత్ర‌.. రెండు రీజ‌న్లు ..!

టిడిపి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గత నాలుగు రోజులుగా సొంత నియోజకవర్గ సర్వేపల్లి లో పాదయాత్ర చేస్తున్నారు;

Update: 2025-06-20 03:15 GMT

టిడిపి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గత నాలుగు రోజులుగా సొంత నియోజకవర్గ సర్వేపల్లి లో పాదయాత్ర చేస్తున్నారు. బహుశా ఆయన స్వయంగా పాదయాత్ర చేయడం ఇది రెండోసారి. గత ఎన్నికలకు ముందు ఆయన కుమారుడు రాజగోపాల్ రెడ్డి పాదయాత్ర చేశారు. వాస్తవానికి ఆ ఎన్నికల్లో తన కుమారుడికి టికెట్ ఇప్పించుకోవాలని చంద్రమోహన్ రెడ్డి ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. కానీ పోటీ బలంగా ఉండడం రాజకీయంగా నెలకొన్న వివాదాలు నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తిరిగి సోమిరెడ్డికే అవకాశం ఇస్తానని చెప్పి ఆయనకే టికెట్ ఇచ్చారు.

కూటమి హవాలో సోమిరెడ్డి కూడా దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత విజయం సాధించారు. ఇక ఇప్పుడు ఆయన వ్యూహం అంతా కుమారుడి పైనే ఉంది. వచ్చే ఎన్నికల నాటికి తన కుమారుని బలోపేతం చేయడం నాయకుడిగా నిలబెట్టడం అసెంబ్లీలో తన కుమారుడిని చూసుకోవడం లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అయితే చిత్రం ఏంటంటే తన కుమారుడు కాకుండా ఆయనే స్వయంగా పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పుడు ఆసక్తిగా మారింది. సహజంగా భవిష్యత్తులో టికెట్ కోరుకునే నాయకులు పాదయాత్ర చేస్తారు. ప్రజలకు చేరువవుతారు.

దీనికి భిన్నంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్వయంగా గత నాలుగు రోజుల నుంచి మండలాల వారీగా పాదయాత్ర చేస్తున్నారు. సర్వేపల్లి లోని సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు చేరువవుతున్నారు. దీని ద్వారా ఆయన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వర్గాన్ని తనవైపు తిప్పుకుంటున్నారా కాకాని రాజకీయాలను ఆయన శాసించేలాగా ప్రయత్నం చేస్తున్నారా అనేది రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. అయితే ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది ప్రస్తుతానికి చెప్పలేని పరిస్థితి.

వరుసగా నమోదు అవుతున్న కేసులు ప్రస్తుతం ఆయన జైల్లో ఉండటం వంటివి రెడ్ల సామాజిక వర్గం లోనే సోమిరెడ్డి పై కొంత వ్యతిరేకతను పెంచుతోంది. తాజా పాదయాత్ర ద్వారా ఆ వ్యతిరేకతను కూడా తగ్గించే ప్రయత్నం చేయాలనేది సోమిరెడ్డి వ్యూహం. ఎందుకంటే ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గంలో సోమిరెడ్డి పెట్టిన కేసుల కారణంగానే కాకాని జైలు పాలు అయ్యారు అన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇది ఎంతవరకు వాస్తవం.. ఎంతవరకు నిజం అనేది పక్కన పెడితే వాదనైతే ఇలాగే సాగుతోంది.

తన‌ను తాను రక్షించుకునే క్రమంలో కూడా సోమిరెడ్డి పాదయాత్రకు శ్రీకారం చుట్టారని భావిస్తున్నారు. ఒకవైపు తన కుమారుడు మరోవైపు తనపై వస్తున్న ఆరోపణలు కారణంగా ప్రజలకు చేరువ అయి వాటి నుంచి బయటపడాలనేది తన కుమారుని రాజకీయంగా నిలబెట్టాలనేది సోమిరెడ్డి వేసుకున్న స్కెచ్. మరి దీంట్లో ఆయన ఏ మేరకు సక్సెస్ అవుతారు అనేది కాలమే నిర్ణయించాలి. రాష్ట్రంలో ఎన్నికలకి నాలుగేళ్ల సమయం పైగానే ఉంది. మరి ఇప్పుడే సోమిరెడ్డి ఇంత జాగ్రత్త పడుతున్నారంటే బలమైన కారణాలే ఉండి ఉంటాయని పరిశీలకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News