సీఎం అయితే క్షమాపణలు చెప్పరా.. నితీష్ కుమార్ ప్రవర్తనపై వ్యతిరేకత!

అయితే ఆ సమయంలో సీఎం నితీష్ పక్కనే ఉన్న డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి వెంటనే అలర్ట్ అయి.. నితీష్ చొక్కా పట్టుకొని లాగి , వద్దంటూ వారించే ప్రయత్నం చేశారు.;

Update: 2025-12-16 08:26 GMT

సీఎం అయినా పీఎం అయినా ఇతరుల పట్ల తప్పుగా ప్రవర్తించినా లేదా అసభ్యకరంగా బిహేవ్ చేసినా తప్పనిసరిగా క్షమాపణ చెప్పి తీరాల్సిందే. ముఖ్యంగా ఎదుటి వ్యక్తులు ఎంత పెద్ద అధికారంలో ఉన్నప్పటికీ.. తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే అన్నమాట వాస్తవం. అయితే ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మహిళ విషయంలో చేసిన పని అందరిని ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా ఆ సీఎం పై వ్యతిరేకతను కలిగించేలా చేస్తోంది. ముఖ్యంగా ఆయన క్షమాపణలు చెప్పాలి అని కొంతమంది కామెంట్లు చేస్తే.. ప్రత్యర్థి రాజకీయ పార్టీలు ఆయన తన పదవికి రాజీనామా చేయాలి అని కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.. దీనికి తోడు సెలబ్రిటీలు కూడా ఈ విషయంపై స్పందిస్తూ ఉండడం గమనార్హం.

అసలు విషయంలోకి వెళ్తే.. 2025 డిసెంబర్ 15న పాట్నాలో జరిగిన రాష్ట్ర సెక్రటేరియట్ సంవాద్ కార్యక్రమంలో సీఎం నితీష్ కుమార్ కొత్తగా నియమితులైన ఆయుర్వేద, యోగ, సిద్ధ , హోమియోపతి, యునానీ వైద్యులకు నియామక పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో మొత్తం 1,283 మంది ఆయుష్ వైద్యులకు నియామక పత్రాలు పంపిణీ చేయగా.. వీరిలో పదిమందికి సీఎం నితీష్ కుమార్ స్వయంగా పత్రాలు అందజేశారు.అయితే ఈ నియామక పత్రం అందుకోవడానికి వచ్చిన మహిళా డాక్టర్ నుస్రత్ పర్వీన్ హిజాబ్ ను ఎత్తి.. ముఖంలోకి చూశారు సీఎం నితీష్. ముఖం చిట్లించి ఇదేమిటి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ .. ఆమె హిజాబ్ ను లాగేసారు. ఈ అనూహ్య చర్యతో షాకై చూస్తున్న డాక్టర్ నుస్రత్ ను అక్కడే ఉన్న ఒక అధికారి పక్కకు లాగేసారు.

అయితే ఆ సమయంలో సీఎం నితీష్ పక్కనే ఉన్న డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి వెంటనే అలర్ట్ అయి.. నితీష్ చొక్కా పట్టుకొని లాగి , వద్దంటూ వారించే ప్రయత్నం చేశారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటనపై అటు సోషల్ మీడియాలోనే కాదు ఇటు విపక్షాలు కూడా తీవ్రంగా మండిపడుతున్నాయి. ముఖ్యంగా కొన్ని పార్టీలు ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి.. మహిళలకు సంరక్షణ కల్పించాల్సింది పోయి.. ఒక ముఖ్యమంత్రి ఇలాంటి చర్యలకు పాల్పడితే ఇక రాష్ట్రంలో మహిళలకు భద్రత ఎక్కడ ఉంది? అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యమంత్రికి అది హిజాబ్ అనే విషయం తెలియదా? మన దేశంలో వివిధ మతాల వారు ఎన్నో సంప్రదాయాలను పాటిస్తారని తెలుసు కదా.. ఒకవేళ ఆయనకు హిజాబ్ అనే విషయం తెలియదు అనుకుంటే.. భద్రతా కారణాల రీత్యా ఆయన హిజాబ్ ను లాగేసారు అనుకుంటే.. ఆయన అలా లాగడం కరెక్ట్ కాదు కదా.. ఒకవేళ తనకు హాని కలుగుతుంది అనే అభిప్రాయ పడితే ఆమెను అడగాల్సింది.. ఆమె అసలు విషయం చెప్పేది కదా.. అయినా ఒక మహిళ పట్ల అలా ప్రవర్తించడం చట్టరీత్యా నేరమే. దీనికి ముఖ్య మంత్రి క్షమాపణ చెప్పాల్సిందే అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

ఇంకొంతమంది సీఎం అయితే క్షమాపణలు చెప్పరా? ఎవరైనా సరే చట్టానికి బద్ధులే కదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై బీహార్ ముఖ్యమంత్రి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ విషయంపై సెలబ్రిటీలు కూడా మండిపడుతున్నారు.దంగల్ మూవీ నటి జైరా వసీం కూడా తన ట్విట్టర్ వేదికగా స్పందించారు. "ఒక మహిళ యొక్క గౌరవ, మర్యాదలు ఆట వస్తువులు కాదు. బహిరంగ వేదికలపై మహిళ హిజాబ్ ను అంత తేలిగ్గా లాగడమే కాకుండా ఆయన నిర్లక్ష్యంగా నవ్వడం చూసి ఒక మహిళగా నాకు మరింత కోపం కలిగింది. అధికారం హద్దులు ఉల్లంఘించడానికి అనుమతి లేదు" అంటూ తన ఎక్స్ లో రాసుకుంది అంతేకాదు ఆ మహిళకు బీహార్ సీఎం క్షమాపణలు చెప్పాలి అని కూడా ఆమె డిమాండ్ చేయడం గమనార్హం.

Tags:    

Similar News