ఈ ఎంపీ అభ్యర్థి అప్పులు సుమారు రూ. 650 కోట్లు... ఫ్లాష్ బ్యాక్ ఇదే!
ఎన్నికల సమయంలో పోటీ చేసే అభ్యర్థులు సమర్పించే అఫిడవిట్లలో పలు ఆసక్తికరమైన విషయాలు తెరపైకి వస్తుంటాయనే సంగతి తెలిసిందే
ఎన్నికల సమయంలో పోటీ చేసే అభ్యర్థులు సమర్పించే అఫిడవిట్లలో పలు ఆసక్తికరమైన విషయాలు తెరపైకి వస్తుంటాయనే సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... వందల కోట్ల ఆస్తులు ఉండి, సొంత కారు లేదనేవారు ఒకరైతే... వందల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పేవారు ఇంకొందరు. ఈ క్రమంలో తాజాగా ఒక ఎంపీ అభ్యర్థి తనకు రూ.649.50 కోట్ల అప్పులు ఉన్నాయని తన అఫిడవిట్ లో పొందుపరచడం ఇప్పుడు ఆసక్తిగా మారింది.
అవును... ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల అఫిడవిట్ లలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తుంటాయనే సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇటీవల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కుమరుడు నకుల్ నాథ్.. లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేస్తూ... 700 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి కానీ.. సొంత వాహనం లేదని పేర్కొన్నట్లు వచ్చిన వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో తమిళనాడులోని డీఎంకే పార్టీకి చెందిన ఎంపీ అభ్యర్థి ఎస్ జగత్రక్షకన్ తాజాగా తన అఫిడవిట్ లో ఆసక్తికరమైన విషయాలను పొందుపరిచారు. ఇందులో భాగంగా... తనకు రూ.649.50 కోట్ల అప్పులు ఉన్నాయని వెల్లడించారు. దీంతో ఈ విషయం వైరల్ గా మారింది. ఈయన అరక్కోణం నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఈయనపై గత ఏడాదే ఐటీ రైడ్స్ కూడా జరిగాయి. తమిళనాడులోని డీఎంకే ఎంపీ ఎస్ జగత్రక్షకన్ నివాసంలో ఆదాయపు పన్ను శాఖ గత ఏడాది అక్టోబర్ లో సోదాలు నిర్వహించింది. ఇందులో భాగంగా.. కొన్ని విద్యాసంస్థలతో పాటు సుమారు 40 చోట్ల ఐటీ శాఖ సోదాలు జరిపిందనే వార్తలు అప్పట్లో సంచలనంగా మారాయి.
అంతకముందు 2020 సెప్టెంబర్ లో ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ. 89.19 కోట్ల ఆస్తిని ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్వాధీనం చేసుకుంది! ఫెమా నిబంధనలను ఎంపీ ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈడీ కేసు దర్యాప్తు చేపట్టింది!
ఇక తమిళనాడులోని ఎన్నికల్లో పోటీ చేసే ఎంపీ అభ్యర్థుల్లో జగద్రక్షకన్ తర్వాత శివగంగై బీజేపీ అభ్యర్థి దేవనాధన్ యాదవ్ తనకు రూ.98.30 కోట్ల అప్పులు ఉన్నట్లు పేర్కొనగా.. వేలూరు డీఎంకే అభ్యర్థి కదిర్ ఆనంద్ తనకు రూ.51.61 కోట్ల అప్పులు ఉన్నట్లు వెల్లడించారు.