డాలర్ల వేట కంటే.. ప్రశాంతతే మిన్న!

దుబాయ్‌లో స్థిరపడిన ఒక భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన 10 ఏళ్ల అనుభవాన్ని.. అధిక వేతనాన్ని వదిలి డెహ్రాడూన్‌కు తిరిగి రావాలని అనుకోవడం కేవలం ఒక వ్యక్తి నిర్ణయం కాదు. ఇది మారుతున్న ఒక సామాజిక ధోరణికి నిదర్శనం.;

Update: 2026-02-20 15:30 GMT

ఒకప్పుడు విదేశీ ప్రయాణం అంటే కేవలం సంపద సముపార్జన మాత్రమే. కానీ నేడు కాలం మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావం.. పెరుగుతున్న లేఆఫ్‌ల భయాలు.. యాంత్రిక జీవనశైలి వెరసి.. ఐటీ నిపుణులను కొత్తగా ఆలోచింపజేస్తున్నాయి. దుబాయ్‌లో స్థిరపడిన ఒక భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన 10 ఏళ్ల అనుభవాన్ని.. అధిక వేతనాన్ని వదిలి డెహ్రాడూన్‌కు తిరిగి రావాలని అనుకోవడం కేవలం ఒక వ్యక్తి నిర్ణయం కాదు. ఇది మారుతున్న ఒక సామాజిక ధోరణికి నిదర్శనం.

అనిశ్చితి నీడలో ఐటీ రంగం

ఐటీ రంగంలో ఒకప్పుడు ఉన్నంత భద్రత ఇప్పుడు లేదు. ఏఐ విప్లవం వల్ల ఉద్యోగాల్లో అనిశ్చితి పెరిగింది. 32 ఏళ్ల వయస్సులో భార్యాపిల్లలతో కలిసి విదేశాల్లో ఉంటూ రేపు ఉద్యోగం ఉంటుందో లేదో తెలియని స్థితిలో గడపడం కంటే.. స్వదేశంలో సొంతంగా ఏదైనా చేసుకోవడం మేలనే భావన బలపడుతోంది. ఇక్కడ ప్రధానాంశం 'డబ్బు' కాదు.. 'మానసిక ప్రశాంతత'.

‘బోరింగ్ బిజినెస్’.. ఒక తెలివైన వ్యూహం

సాధారణంగా వ్యాపారం అంటే భారీ స్టార్టప్‌లు, మిలియన్ డాలర్ల ఫండింగ్ అని అందరూ అనుకుంటారు. కానీ ఈ టెకీ ఎంచుకుంటున్న ‘బోరింగ్ బిజినెస్’ కాన్సెప్ట్ ప్రశంసనీయం. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు, రెంటల్ ప్రాపర్టీలతో స్థిరమైన నెలవారీ ఆదాయం... బుటిక్ లేదా చిన్న సర్వీస్ బిజినెస్ లంటూ స్థానిక మార్కెట్‌పై పట్టు... హై-రిస్క్ లేని, స్థిరమైన క్యాష్‌ఫ్లో ఇచ్చే ఇటువంటి వ్యాపారాలు దీర్ఘకాలంలో ఆర్థిక భద్రతను ఇస్తాయి.

- భావోద్వేగాలకూ ప్రాధాన్యత

పదేళ్లపాటు కెరీర్ కోసం పరుగెత్తిన తర్వాత కుటుంబంతో గడిపే సమయం విలువ ఎంతో అర్థమవుతుంది. "ముఖ్యమైన సమయాన్ని కోల్పోతున్నానా?" అన్న ఆవేదనలో ఒక సహేతుకమైన నిజం ఉంది. పిల్లల బాల్యం, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల అవసరాలు.. కేవలం వీడియో కాల్స్‌తో తీరేవి కావు. అందుకే ఈ టెకీ తీసుకున్న నిర్ణయం అందరికీ స్ఫూర్తినిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

అడుగు వేసే ముందు జాగ్రత్తలు

అయితే కేవలం ఉద్వేగంతో తీసుకునే నిర్ణయాలు ప్రమాదకరంగా మారవచ్చు. నెటిజన్లు సూచించినట్లుగా కనీసం ఏడాది పాటు కుటుంబ ఖర్చులకు సరిపడా నిధి ఉండాలి. పూర్తిగా ఉద్యోగానికి స్వస్తి చెప్పకుండా మొదట పార్ట్-టైమ్ లేదా రిమోట్ జాబ్ చేస్తూ వ్యాపారాన్ని పరీక్షించాలి. వ్యాపారం నుండి కనీసం 20-30% ఆదాయం రావడం మొదలయ్యాక పూర్తిస్థాయిలో రంగంలోకి దిగడం ఉత్తమం.

ఎంత సంపాదిస్తున్నాం? అనే ప్రశ్న నుండి ఎంత సంతోషంగా జీవిస్తున్నాం? అనే ప్రశ్న వైపు యువత మళ్లడం ఆహ్వానించదగ్గ పరిణామం. రివర్స్ మైగ్రేషన్ (తిరుగు ప్రయాణం) అనేది భారతదేశంలోని చిన్న పట్టణాల అభివృద్ధికి కూడా దోహదపడుతుంది. సాహసోపేతమైన ఈ నిర్ణయం వెనుక సరైన ప్రణాళిక ఉంటే.. అది కేవలం ఆ టెకీకి మాత్రమే కాదు.. అతని లాంటి వేలాది మందికి ఒక స్ఫూర్తిదాయక మార్గదర్శిగా నిలుస్తుంది.

Tags:    

Similar News