తోబుట్టువులందరికీ ఒకే సారి వివాహం.. ఉత్తరాఖండ్‌లో వింత సంప్రదాయం!

పెళ్లిళ్లు అంటే ఆడంబరం, లక్షలాది రూపాయల ఖర్చుగా మారిపోయిన ఈ రోజుల్లో, ఉత్తరాఖండ్‌లోని జౌన్సార్ బావర్ ప్రాంత ప్రజల సంప్రదాయం ఆదర్శవంతంగా అనిపిస్తోంది.;

Update: 2026-05-01 04:47 GMT

పెళ్లిళ్లు అంటే ఆడంబరం, లక్షలాది రూపాయల ఖర్చుగా మారిపోయిన ఈ రోజుల్లో, ఉత్తరాఖండ్‌లోని జౌన్సార్ బావర్ ప్రాంత ప్రజల సంప్రదాయం ఆదర్శవంతంగా అనిపిస్తోంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థను గౌరవిస్తూ, ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి వారు అనుసరిస్తున్న విధానం సామాజికంగా విలువైనది. నేటి కాలంలో ఒక్క పెళ్లి చేయడమే తల్లిదండ్రులకు తలకు మించిన భారంగా మారుతోంది. కానీ, ఉత్తరాఖండ్‌లోని గిరిజన ప్రాంతమైన జౌన్సార్ బావర్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అక్కడ ఒకే ఇంట్లో పెళ్లీడుకు వచ్చిన పిల్లలు ఎంత మంది ఉన్నా, వారందరికీ ఒకేసారి, ఒకే వేదికపై వివాహం జరిపించడం ఆచారంగా వస్తోంది. దీనివల్ల సమయం, డబ్బు ఆదా అవ్వడమే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత కూడా పెరుగుతుంది.

ఒకేసారి 6 పెళ్లిళ్లు

తాజాగా ఈ ప్రాంతానికి చెందిన దౌలత్ సింగ్ కుటుంబం వార్తల్లో నిలిచింది. ఆ కుటుంబంలోని ఐదుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయికి ఒకేసారి, ఒకే వేదికపై వివాహం జరిపించారు. ఇలా ఒకే చోట కుటుంబానికి మొత్తం వివాహం జరిపించడం ‘జోజోడా’ అని పిలుస్తారు. అంటే ఒకే కుటుంబంలోని పెళ్లీడుకు వచ్చిన వారందరినీ ఒకే బంధంతో కలపడం. సాధారణంగా పెళ్లి అంటే వరుడు ఊరేగింపుగా వధువు ఇంటికి వెళ్తాడు. కానీ, ఈ జౌన్సార్ బావర్ సంప్రదాయం దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ సంప్రదాయం ప్రకారం, వధువులే తమ బంధుమిత్రులతో కలిసి ఊరేగింపుగా వరుడి ఇంటికి వస్తారు. వధువు కుటుంబానికి వరుడి తరపు వారు స్వాగతం పలికి, వారి ఇంట్లోనే పెళ్లి వేడుకలను నిర్వహిస్తారు.

ఈ పెళ్లి వేడుకలో ఆరుగురు వధువులు ఒకే రకమైన దుస్తులు, అలంకరణతో మెరిసిపోతారు.

ఒకే కొమ్మకు పూసిన రు పూవుల్లాకనిపిస్తారు వారు వేదికపై ఉన్నప్పుడు, ఎవరు ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారో గుర్తుపట్టడం అతిథులకు ఒక అద్భుతమైన సవాలుగా అనిపిస్తుంది. సాధారణంగా పర్వత ప్రాంతాల్లో పెళ్లిళ్లంటే వారం పాటు సాగే తంతు. కానీ ఇక్కడ ఆరు పెళ్లిళ్లను కేవలం కొద్ది గంటల్లోనే ముగించి, సమయాన్ని మరియు శ్రమను ఎలా ఆదా చేయవచ్చో ఈ కుటుంబం నిరూపించింది.

ఈ వివాహం ద్వారా ఆ గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిన బంధువులంతా ఒకే చోట కలిసే అవకాశం కలగడం మరో విశేషం. ‘పిక్చర్ అభీ బాకీ హై’ అన్నట్లుగా, ఈ సామూహిక వివాహం కేవలం ఒక వేడుకగానే కాకుండా, పర్వత ప్రాంతాల్లో పెరుగుతున్న వలసల మధ్య బంధాలను కలిపే ఒక వారధిలా నిలిచింది. ఈ వినూత్న సంప్రదాయం భవిష్యత్తులో మరిన్ని కుటుంబాలకు స్ఫూర్తినిస్తుందో లేదో చూడాలి!

సంప్రదాయం వెనుక గౌరవం..

వేర్వేరుగా పెళ్లిళ్లు చేస్తే అయ్యే లక్షల రూపాయల ఖర్చు, ఇలా అందరికీ కలిపి చేయడం వల్ల చాలా వరకు తగ్గుతుంది. ఈ పద్ధతి వల్ల కుటుంబంలోని వారందరూ ఒకేసారి కొత్త జీవితంలోకి అడుగుపెడతారు, ఇది వారి మధ్య అనుబంధాన్ని మరింత బలపరుస్తుంది. అనవసరమైన ఆడంబరాలకు తావులేకుండా, సంప్రదాయబద్ధంగా సాదాసీదాగా వేడుకలు జరుగుతాయి.

జౌన్సార్ బావర్ ప్రాంత ప్రజలు పాటిస్తున్న ఈ 'జోజోడా' పద్ధతి నేటి సమాజానికి ఒక పాఠం లాంటిది. పెళ్లి అంటే కేవలం ప్రదర్శన కాదు, అది రెండు మనసుల కలయిక అని ఈ సంప్రదాయం నిరూపిస్తోంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు ఇటువంటి సామూహిక వివాహ పద్ధతులు ఎంతో మేలు చేస్తాయి. ఉత్తరాఖండ్ కొండ ప్రాంతాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ఆచారం, ఆధునిక యుగంలో కూడా తన ఉనికిని చాటుకోవడం విశేషం.

Tags:    

Similar News