చమురు ధరలే కారణం కాదు.. రూపాయిని దెబ్బతీస్తున్న ప్రపంచ పెట్టుబడుల మార్పు

రూపాయి విలువ తగ్గడానికి కేవలం ఇరాన్ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెంపు మాత్రమే కారణం అనుకుంటే పొరపాటే.. గ్లోబల్ ఇన్వెస్టర్లు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్ల వైపు అడుగులు వేస్తున్నారు.

Update: 2026-10-22 18:30 GMT

రూపాయి విలువ తగ్గడానికి కేవలం ఇరాన్ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెంపు మాత్రమే కారణం అనుకుంటే పొరపాటే.. గ్లోబల్ ఇన్వెస్టర్లు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్ల వైపు అడుగులు వేస్తున్నారు. మరోవైపు భారత మార్కెట్ అత్యధిక విలువలతో ఖరీదైనదిగా మారడం రూపాయి ఒత్తిడికి ప్రధాన హేతువుగా మారుతోంది.

చమురు ధరల ప్రభావం ఉంటే సరిపోతుందా?

భారత రూపాయి క్షీణించినప్పుడల్లా సాధారణంగా అందరి దృష్టి ముడి చమురు ధరలు, బలపడుతున్న డాలర్, గ్లోబల్ జియోపోలిటికల్ ఉద్రిక్తతలపైనే పడుతుంది. మన దేశం ఇంధన అవసరాల కోసం దిగుమతులపై తీవ్రంగా ఆధారపడుతుండటంతో చమురు ధరకు డాలర్ డిమాండ్‌కు నేరుగా సంబంధం ఉంటుంది. అయితే చమురు ధరలు తగ్గగానే రూపాయి వెంటనే పుంజుకుంటుందా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే రూపాయి భవిష్యత్తును నిర్ణయించడంలో అమెరికా వడ్డీరేట్లు, దేశీయ ద్రవ్యోల్బణం, వాణిజ్య లోటుతో పాటు అంతర్జాతీయ నిధులు ఏ దేశానికి, ఏ రంగానికి మళ్లుతున్నాయనేది అత్యంత కీలకం.

ఖరీదైన మార్కెట్‌గా భారత్.. విదేశీ ఇన్వెస్టర్ల రీ-థింకింగ్

ప్రస్తుతం మన స్టాక్ మార్కెట్లకు దేశీయ మ్యూచువల్ ఫండ్లు, ప్రత్యేకించి ఎస్ఐపీల రూపంలో వస్తున్న నిధులు బలమైన మద్దతుగా నిలుస్తున్నాయి. అయితే విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు ఎల్లప్పుడూ మెరుగైన రాబడుల వైపు చూస్తుంటారు. భారత కంపెనీల ఆదాయ వృద్ధితో పోలిస్తే షేర్ల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని విదేశీ ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. భారత మార్కెట్ ఖరీదైనదిగా మారడంతో విదేశీ ఇన్వెస్టర్లు ఇక్కడి షేర్లను విక్రయించి డాలర్లలోకి మారుతున్నారు. దీనివల్ల కరెన్సీపై ఒత్తిడి తీవ్రమవుతోంది.

ఏఐ, సెమీకండక్టర్ల వైపు గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ వేవ్

ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడుల ధోరణిలో ఒక విప్లవాత్మక మార్పు కనిపిస్తోంది. సాంప్రదాయ రంగాల కంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు, డేటా సెంటర్లు, అధునాతన తయారీ రంగాలు ప్రపంచవ్యాప్తంగా భారీ నిధులను ఆకర్షిస్తున్నాయి. అమెరికాలో ఏఐ మోడళ్లు , క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వైపు ఇన్వెస్టర్లు మొగ్గుచూపుతుండగా తైవాన్ గ్లోబల్ సెమీకండక్టర్ తయారీలో కీలక స్థానంలో ఉంది. అలాగే చైనా కూడా ఏఐ, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ టెక్నాలజీ రంగాలపై దృష్టి పెంచింది. ఈ సాంకేతిక విప్లవం కేవలం తాత్కాలిక లాభాల కోసం కాకుండా భవిష్యత్ ఉత్పాదకతను, అంతర్జాతీయ పోటీతత్వాన్ని పెంచే దీర్ఘకాలిక సామర్థ్యాన్ని కలిగి ఉంది.

భారత్ ముందున్న అసలు సవాలు ఏంటి?

మన దేశంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఫార్మా రంగాల్లో మంచి సామర్థ్యం ఉంది. అయితే కేవలం పెట్టుబడి ప్రతిపాదనలు, ప్రకటనలతో సరిపెట్టుకోకుండా పరిశోధన, నైపుణ్యాభివృద్ధి , స్థానిక సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడం అత్యంత అవసరం. అధిక లాజిస్టిక్స్ ఖర్చులు, అనుమతుల్లో ఆలస్యాన్ని నివారించడం ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను మెరుగుపరచాలి. అలాగే స్పష్టమైన నిబంధనలు, స్థిరమైన పన్ను విధానం ద్వారా దీర్ఘకాలిక ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా మాత్రమే రూపాయిని బలోపేతం చేయగలం.

తాత్కాలిక పరిష్కారాలు పనిచేస్తాయా?

ఫారిన్ కరెన్సీ నాన్-రెసిడెంట్ డిపాజిట్ల ద్వారా డాలర్ల లభ్యత పెంచి మారకపు మార్కెట్లో తాత్కాలిక ఊరట పొందవచ్చు. కానీ ఇది శాశ్వత పరిష్కారం కాదు.. ఎందుకంటే దీనికి తిరిగి చెల్లించాల్సిన వడ్డీ, కరెన్సీ రిస్క్ ఖర్చులు తోడవుతాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి వడ్డీరేట్ల పెంపు కొంతవరకు ఉపయోగపడినా గ్లోబల్ సరఫరా లోపాలను ఇది నేరుగా తగ్గించలేదు. పైగా అధిక వడ్డీరేట్లు రుణాల వ్యయాన్ని పెంచి ఆర్థిక వృద్ధిని నెమ్మదింపజేస్తాయి.

రూపాయికి దీర్ఘకాలిక బలం ఎక్కడి నుంచి?

ఇప్పుడు విధాన నిర్ణేతల ముందు చమురు ధరలు తగ్గితేనే రూపాయి నిలబడుతుందా? ఏఐ , సెమీకండక్టర్ల వంటి సాంకేతిక రంగాలలో భారత్ వేగంగా పురోగమించగలదా.. స్వల్పకాలిక విదేశీ నిధుల కంటే ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎంతవరకు పెంచుకోగలము అనే ప్రశ్నలు ఉన్నాయి. చమురు ధరల హెచ్చుతగ్గులు కరెన్సీపై తాత్కాలిక ప్రభావమే చూపుతాయి. ఎగుమతుల పోటీతత్వాన్ని పెంచుకోవడం, హై-టెక్ రంగాలలో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్లను ఆకర్షించడం.. స్థిరమైన ఎఫ్డీఐ ప్రవాహాన్ని నిర్మించుకోవడమే భారత రూపాయికి అసలైన, దీర్ఘకాలిక రక్షణ కవచం.

Tags:    

Similar News