19 అంటే నాలుగే చాన్స్...వైసీపీ ఏం చేస్తుంది ?
స్థానిక ఎన్నికల పర్వం ఏపీలో మొదలైన దగ్గర నుంచి వైసీపీ పట్టువదలని విక్రమార్కుడు మాదిరిగా కోర్టులలో పిటిషన్లు వేస్తూ వస్తోంది.
స్థానిక ఎన్నికల పర్వం ఏపీలో మొదలైన దగ్గర నుంచి వైసీపీ పట్టువదలని విక్రమార్కుడు మాదిరిగా కోర్టులలో పిటిషన్లు వేస్తూ వస్తోంది. ఫిర్యాదులు చేస్తూ వస్తోంది. సుప్రీం కోర్టులో అయితే వైసీపీకి కొంత అనుకూలమైన తీర్పు వచ్చిందని అంతా అనుకున్నారు. వైసీపీ నేతలు అయితే హుషారు చేశారు. న్యాయం గెలిచింది అన్నారు. అయితే తీర్పు సారాన్ని అర్ధం చేసుకుని అన్నారా లేక అతి ఉత్సాహంగా మారి అన్నారా తెలియదు. రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం సుప్రీం కోర్టు తీర్పుని సంపూర్ణంగా అధ్యయనం చేసిన మీదట ఏపీలో కలెక్టర్లు, ఎప్సీల నుంచి నివేదికలు వచ్చ్చిన దాని మీద సమగ్రమైన పరిశీలన చేసిన మీదట ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
నాలుగు చోట్ల మాత్రమే :
ఏపీలో మునిసిపోల్స్ లో 19 చోట్ల ఘర్షణలు జరిగాయని తాము నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇక సుప్రీంకోర్టు అయితే ఆయా చోట్ల అందిన ఫిర్యాదులను పరిశీలించి నామినేషన్ల గడువు పెంపుపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. దీంతో గత రెండు రోజులుగా కలెక్టర్లు ఎస్పీలతో సుదీర్ఘంగా చర్చించిన రాష్ట్ర ఎన్నికల సంఘం నాలుగు చోట్ల మాత్రమే నామినేషన్ల స్వీకరణకు రెండు రోజుల పాటు గడువు పెంచింది.
వార్డులలో సైతం :
ఇక ఈ నాలుగు చోట్ల కూడా వార్డులు చూస్తే కడప కార్పొరేషన్ లో 11 వార్డులు ఉన్నాయి. అవి 6, 11, 13, 15, 16, 17, 24, 31, 34, 52, 55గా పేర్కొంది. అలాగే రాజంపేట మున్సిపాలిటీలో 11 వార్డులు ఉన్నాయి. అవి 6, 12, 13, 14, 17, 19, 23, 24, 25, 26, 27 గా పేర్కొన్నారు. మైదుకూరు మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులు, తిరుపతి కార్పొరేషన్ లో 18 వార్డులు అంటే 1, 2, 3, 4, 5, 6, 9, 11, 12, 13, 14, 19, 55, 56, 57, 59, 65, 66 గా పేర్కొన్నారు. అంటే వీటి పరిధిలోనే ఈ నెల 23, 24 తేదీలలో రెండు రోజుల పాటు నామినేషన్లకు గడువుని పెంచి నామినేషన్లు స్వీకరిస్తారు అన్న మాట.
వైసీపీ వైపే చూపు :
ఇపుడు బంతి వైసీపీ కోర్టులోకే మళ్ళీ వచ్చి పడింది. మొత్తం 19 చోట్ల తమ నామినేషన్లు తీసుకోలేదని వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్ళింది అంటున్నారు. అందులో పల్నాడు జిల్లా, నెల్లూరు జిల్లాతో పాటు అనేక చోట్ల ఏకగ్రీవాలుగా చూపించినవి ఉన్నాయని చెబుతున్నారు. తాము నామినేషన్లు వేయకుండానే చాన్స్ ఇవ్వకుండానే ఏకగ్రీవాలు చేసుకున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఈ 19 మాత్రమే కాకుండా ఏపీలో అనేక చోట్ల ఇలాగే పరిస్థితి ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇలా తమకు మరింత అవకాశం దక్కుతుందని అన్ని చోట్లా రెండు రోజుల గడువు పొడిగిస్తారు జనరల్ గానే ఈ చాన్స్ ఉంటుందని ఊహించిన వైసీపీ వర్గాలు అయితే షాక్ తిన్నారని అంటున్నారు. దీని మీద వైసీపీ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో అంతా చూస్తున్నారు.