సర్ తో మమత సవారీ... బీజేపీతో హోరా హోరీ !
పశ్చిమ బెంగాల్ మీద బీజేపీ కన్ను పడింది. ఈ మాట అంటే చాలా పతది అనుకుంటారు.;
పశ్చిమ బెంగాల్ మీద బీజేపీ కన్ను పడింది. ఈ మాట అంటే చాలా పతది అనుకుంటారు. అవును 2021లోనే బీజేపీ టార్గెట్ చేసింది కదా అని కూడా చెప్పాలి. 2011లో బెంగాల్ అసెంబ్లీలో బీజేపీకి సీట్లు లేవు, 2016 లో కేవలం మూడు సీట్లే దక్కాయి. కానీ 2021లో ఏకంగా 77 సీట్లకు ఎగబాకింది. 2026 ఎన్నికల్లో టార్గెట్ 160 సీట్లు. మరి మూడు నుంచి 77 అంటే ఎన్ని రెట్లు సీట్లు బీజేపీ పెంచుకుందో తెలిసిందే. అలాంటిది రెట్టింపు సీట్లు తెచ్చుకోలేదా. ఇదే కమలం పార్టీ పెద్దల వ్యూహం. దాంతోనే మమత సామ్రాజ్యం మీద ఫుల్ ఫోకస్ పెట్టేశారు.
ఆపరేషన్ బెంగాల్ :
బీహర్ కధ ముగిసింది. ఫలితం కూడా ధూం ధాం గా వచ్చింది. ఎన్డీయేకు 200 ప్లస్ సీట్లు వస్తాయని ఎవరో కాదు ఎన్డీయే పెద్దలే ఊహించలేదు. అంతలా బీహార్ ఎన్నికల్లో స్వీప్ చేసిన బీజేపీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బెంగాల్ మీద దృష్టి పెట్టేసింది. 2026 మే నెలలోనే బెంగాల్ ఎన్నికలు ఉన్నాయి. అంటే గట్టిగా చూస్తే ఆరు నెలల సమయం కూడా లేదు. దాంతో కమలనాధుల వ్యూహాలు పదును తేరుతున్నాయి. బీహార్ లో ఏ రకంగా వ్యవహరించారో అదే తీరున బెంగాల్ లోనూ స్ట్రాటజీ అమలు చేస్తున్నారు.
సర్ తో చెక్ :
సర్ ని ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలలో అమలు చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. దానికి బీజేపీ మద్దతు ఇస్తోంది. ఎపుడో రెండు దశాబ్దాల క్రితం ఓటర్ల జాబితా సవరణ సాగింది. ఇపుడు ప్రత్యేకంగా ఓటర్ల జాబితా సవరణను సర్ పేరుతో చేపడుతున్నామని కేంద్ర ఎన్నికల సంఘం చెబుతోంది. దీని వల్ల నకిలీ ఓటర్లను మరణించిన వారిని అసలు ఈ దేశ పౌరసత్వం లేని వారిని తప్పించి అసలైన ఓటర్లకు అవకాశాలు ఇవ్వడానికే అని కేంద్ర ఎన్నికల సంఘం అంటోంది. అత్యంత పారదర్శకంగా దీనిని నిర్వహిస్తున్నామని చెబుతోంది. కానీ విపక్ష రాష్ట్రాలలో సర్ కి అక్కడ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక బెంగాల్ లో చూస్తే సర్ తో రోహింగ్యాలు బంగ్లా దేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారికి చెక్ చెప్పవచ్చు అని బీజేపీ భావిస్తోంది.
బంగ్లా దేశీయుల పరార్ :
సర్ ని ఈ నెల 4వ తేదీ నుంచి పశ్చిమ బెంగాల్ లో అమలు చేస్తున్నారు. ప్రతీ ఇంటికీ బూత్ లెవెల్ ఆఫీసర్ వెళ్ళి వారి వివరాలు నమోదు చేసుకుంటున్నారు వారి ధృవ పత్రాలు తనిఖీ చేస్తున్నారు. దాంతో ఏ రకమైన అధికార పత్రాలు లేకుండా అక్రమంగా నివాసం ఉంటున్న వేలాది మంది అక్రమ వలసదారులు అంతా బంగ్లాకు తిరిగి పయనం అవుతున్నారు. గత కొద్ది రోజులుగా గంగా తీరం గుండా పడవలలో వీరంతా వెళ్తున్న దృశ్యాలు అయితే బీజేపీ మద్దతుదారులు వీడియోలు తీసి మరీ చూపిస్తున్నారు. వీరంతా అక్రమంగా ఓటర్లుగా మారి ప్రజాస్వామ్యాన్ని దెబ్బ తీస్తున్నారు అని అంటున్నారు. అయితే సర్ పేరుతో అసలైన ఓటర్లకే ఇబ్బందులు పెడుతున్నారు అని మమతా బెనర్జీ వాదిస్తున్నారు. ఈసీ మీద బీజేపీ మీద నిప్పులు చెరుగుతున్నారు.
దేశవ్యాప్తంగానే పోరు :
సర్ ని బెంగాల్ లో అమలు చేయడంతో మమతా బెనర్జీ కలకత్తా కాళీ మాత అవతారమే ఎత్తారు. ఆమె ఆగ్రహంగా బీజేపీని ఈసీని కలిపి మరీ విమర్శిస్తున్నారు. ఎన్నికలు ప్రజాస్వామికంగా నిర్వహించకుండా చేస్తున్న నిర్వాకం ఇదని ఫైర్ అవుతున్నారు. అవసరం అనుకుంటే తాను దేశవ్యాప్తంగా సర్ కి వ్యతిరేకంగా ఉద్యమిస్తాను అని ఆమె కేంద్ర ప్రభుత్వానికి ఈసీకి సవాల్ చేశారు. అయితే సర్ వంటి ఎన్నికల ప్రక్రియను రాజ్యాంగపదవిలో ఉన్న మమతకు తగదని బీజేపీ నేతలు అంటున్నారు. అక్రమ చొరబాటుదారులు వలసదారుల ఓట్లను తొలగిస్తే మమతకు వచ్చిన ఇబ్బంది ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు
ఇదీ సన్నివేశం :
బీహార్ లో ఏకంగా సర్ పేరుతో 50 లక్షలకు పైగా ఓట్లను తీసి పక్కన పెట్టారు. ఇక పశ్చిమ బెంగాల్ లో కూడా లక్షలలోనే అక్రమ ఓటర్లు ఉన్నారని బీజేపీ భావిస్తోంది. వారి అండతోనే తృణమూల్ కాంగ్రెస్ వరసబెట్టి మూడు సార్లు అధికారంలోకి వచ్చింది అని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈసారి అక్రమ ఓటర్లు తొలగిపోతే గెలుపు తమదే అని అంటున్నారు. మూడు సార్లు గెలిచిన మమతకు యాంటీ ఇంకెంబెన్సీ తారస్థాయిలో ఉందని అదే తమకు విజయం సమకూరుస్తుందని అంటున్నారు. మొత్తానిక్ సర్ అన్న పులి మీద మమత స్వారీ అయితే చేస్తున్నారు అదే సమయంలో బీజేపీతో హోరాహోరీ తలపడుతున్నారు. రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.