చందనోత్సవం : వైభవంగా...ప్రశాంతంగా !
సింహాచలం అప్పన స్వామి చందనోత్సవం ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత వైభవంగా ప్రశాంతంగా సాగింది అని భక్త జనులు అంటున్న మాట.;
సింహాచలం అప్పన స్వామి చందనోత్సవం ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత వైభవంగా ప్రశాంతంగా సాగింది అని భక్త జనులు అంటున్న మాట. ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో సక్రమంగా చేశారని కొనియాడుతున్నారు. ఈ మధ్య కాలంలో చందనోత్సవం ఈ తరహాలో సాగింది లేదని తాము చూసింది లేదని కూడా చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం పట్టుదలతో శ్రమించి అన్ని విధాలుగా భక్తులకు ఏర్పాట్లు చేసింది అని అంటున్నారు.
చేదు అంబువం నుంచి :
సరిగ్గా ఏడాది క్రితం 2025 ఏప్రిల్ 30న చందనోత్సవం జరిగింది. ఆ సమయంలో వర్షం అర్ధరాత్రి కురియడంతో గోడ కూలి ఏడుగురు భక్తులు మరణించారు. దాంతో అత్యంత విషాదంగా సింహాచలం ఆలయ చరిత్రలో నిక్షిప్తం అయింది. ఆ చేదు ఘటనను ఏడాది అంతా గుర్తుంచుకున్న అధికారులు ఈసారి అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని గట్టి సంకల్పంతో పనిచేశారు. దాదాపుగా మూడు నెలల నుంచి అధికారులు పడిన కష్టానికి తగిన ఫలితం కూడా కనిపించింది. కూటమి ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అలెర్ట్ చేస్తూ అన్ని విధాలుగా అధికారులను సంసిద్ధం చేసింది. దాంతో ఈసారి చందనోత్సవం సూపర్ సక్సెస్ అయింది. ఏ ఒక్కరూ అసంతృప్తి చెందకుండా అప్పన్న స్వామి వారి నిజ రూప దర్శనం చేయించి పంపించారు. చాలా జాగ్రత్తగా ప్రతీ ఒక్క భక్తుడి విషయంలో అటు అధికారులు కానీ ఇటు పోలీసులు కానీ వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
అందరి సహకారంతోనే :
ఇదిలా ఉంటే సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక చందనోత్సవం అత్యంత వైభవంగా ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా జరిగిందని అధికారులు ప్రకటించారు. చందనోత్సవ ముగింపు సందర్భంలో కూడా ఎక్కడా ఇబ్బందులు రాకుండా తొక్కిసలాట చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే సోమవారం తెల్లవారుజామున మూడు గంటల నుంచే క్యూ లైన్లు ప్రారంభమై ఎటువంటి అంతరాయం లేకుండా భక్తులకు స్వామి వారి నిజరూప దర్శనం కల్పించామని అధికారులు చెప్పారు. ఇక ఈ ఏడాది సుమారు 1.5 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లుగా అంచనాలు ఉన్నాయి. అంతే కాదు వచ్చిన భక్తులకు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లలోనే ఆహార సదుపాయాలు వంటివి నిరంతరాయంగా కొనసాగించారు. ఈ నేపధ్యంలోనే . ప్రభుత్వం చేపట్టిన ఏర్పాట్లపై భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.
చివరి భక్తుడి వరకూ :
దాదాపుగా ఇరవై గంటల పాటు సాగిన దర్శనాలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. అంతే కాదు చిట్ట చివరి భక్తుడికి దర్శనం చేయించేవరకూ జిల్లా అధికార యంత్రాంగం అదే స్పూర్తిని ప్రదర్శించింది. మరో వైపు మంత్రుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన సూచనలు అందించడంతో ఈసారి చందనోత్సవం ఎన్నడూ లేని విధంగా సాఫీగా సాగి చరిత్రలో నిలిచిపోయింది అని అంటున్నారు. ఇక ఈ సంవత్సరం నిర్వహణలో వచ్చిన అనుభవాలను సమగ్రంగా డాక్యుమెంట్ చేసి, వచ్చే ఏడాది మరింత మెరుగైన సౌకర్యాలతో రెండు లక్షల మంది భక్తులు వచ్చినా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రణాళికలు రూపొందిస్తామని అధికారులు వెల్లడించారు.