డాక్టర్ సిదిరి.. కాశీబుగ్గలో మాజీ మంత్రి సమయస్ఫూర్తి
కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో చోటుచేసుకున్న తొక్కిసలాటపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.;
కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో చోటుచేసుకున్న తొక్కిసలాటపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఓ భక్తుడు నిర్మించిన ఆలయానికి వేలాదిగా భక్తులు రావడం దుర్ఘటనకు దారితీసిందని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారించింది. సంఘటన సమాచారం తెలుసుకున్న వెంటనే జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు, స్థానిక శాసనసభ్యురాలు గౌతు శిరీష హుటుహుటిన ప్రమాదస్థలికి చేరుకున్నారు. వీరికంటే ముందుగానే అక్కడికి వచ్చిన వైసీపీ నేత, మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు సమయస్ఫూర్తితో వ్యవహరించారని ప్రశంసలు అందుకుంటున్నారు.
వృత్తిరీత్యా డాక్టర్ అయిన అప్పలరాజు.. కాశీబుగ్గ ఆలయంలో ప్రమాదం జరిగిన సమాచారం తెలుసుకున్న వెంటనే అక్కడికి చేరుకున్నారని చెబుతున్నారు. ఆలయానికి అప్పలరాజుకు ఇంటికి సుమారు 500 మీటర్ల నుంచి కిలోమీటరు దూరం ఉంటుందని అంటున్నారు. దీంతో విషయం తెలిసిన వెంటనే అక్కడకు చేరుకున్న అప్పలరాజు తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించారు. డాక్టరుగా మారి తొక్కిసలాటతో ఊపిరి ఆడకుండా ఇబ్బంది పడుతున్న క్షతగాత్రులకు సీపీఆర్ చేశారు. ఆయనను చూసి అక్కడ ఉన్న వారు సైతం సీపీఆర్ చేయడం వల్ల పలువురు శ్వాస తీసుకున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.
వైసీపీ నేత అప్పలరాజు చొరవ తీసుకోవడాన్ని అంతా ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. నిజానికి ఆయన నుంచి ఇలాంటి స్పందనను ఎవరూ ఊహించలేదని కూడా టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. గత ప్రభుత్వంలో వివాదాస్పద నేతల్లో ఒకరిగా అప్పలరాజు కూడా ముద్రపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనపైనా పలు కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా వైసీపీ నేతలకు ఎక్కువగా చెడ్డపేరు తెచ్చిన పరుష పదజాలం, సోషల్ మీడియా పోస్టులపై అప్పలరాజు విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే ఈ విషయంలో ఆయన ప్రభుత్వాన్ని నిందించడాన్ని వెనకపెట్టి, ముందుగా బాధితులను ఆదుకోవడానికి చొరవ తీసుకోవడం విశేషంగా చెబుతున్నారు.
డాక్టర్ వృత్తిని వదలి రాజకీయాల్లోకి వచ్చిన అప్పలరాజు 2019 ఎన్నికల్లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో ఓడిపోయారు. ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే ఆయనకు మంత్రి పదవిని ఇచ్చింది వైసీపీ. అదేవిధంగా గత ప్రభుత్వంలో మధ్యలో కొందరు మంత్రులను తప్పించారు. కానీ, అప్పలరాజును కొనసాగించారు. దీనికి అప్పలరాజు దూకుడు రాజకీయమే కారణమన్న విశ్లేషణలు ఉన్నాయి. దీనివల్ల నియోజకవర్గంలో కొన్నివర్గాలకు ఆయన దూరమయ్యారనే అభిప్రాయం కూడా ఉంది. కానీ, శనివారం నాటి ఘటనతో అప్పలరాజు బౌన్స్ బ్యాక్ అయ్యారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తొక్కిసలాటపై ఆయన స్పందించిన తీరు కూడా అందరినీ ఆలోచనకు గురిచేసిందని అంటున్నారు.