సినిమాను తలపించేలా డైరెక్టర్, ఆయన భార్య దారుణ హత్య.. వారి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

ఒక్కొక్కసారి నిజజీవితంలో కూడా.. సినిమాను తలపించేలా జరిగే ఘటనలు అందరిలో భయాందోళనలకు గురి చేస్తూ ఉంటాయి.;

Update: 2025-12-15 10:37 GMT

ఒక్కొక్కసారి నిజజీవితంలో కూడా.. సినిమాను తలపించేలా జరిగే ఘటనలు అందరిలో భయాందోళనలకు గురి చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఘటన అందరిని ఆశ్చర్యపరచడమే కాకుండా పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. ఒక హాలీవుడ్ డైరెక్టర్ ఆయన భార్యను ఎవరో అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి హతమార్చారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో యావత్ సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది. ఎన్నో అద్భుతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ఈ దంపతులపై ఇంత కిరాతకంగా దాడి ఎవరు చేశారు? అనే విషయంపై అటు పోలీసులు ఇటు అభిమానులు కూడా ఆరా తీస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ గా, నటుడిగా పేరు సొంతం చేసుకున్న రాబ్ రీనర్ , ఆయన సతీమణి మిచెల్ సింగర్ అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో ఉన్న వారి నివాసంలో విగత జీవులుగా పడి వున్నట్లు స్థానిక మీడియా కథనాలు వెలువడగా.. వారిద్దరూ కత్తి పోట్లకు గురైనట్లు ఆ వార్తల సమాచారం. అయితే దీనిపై స్థానిక పోలీసులు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. వారి శరీరంపై కత్తిపోట్లు ఉండడంతో పోలీసులు దీనిని హత్యగా కేసు ఫైల్ చేసుకున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ కేసులో డైరెక్టర్ రెండో కొడుకు నిక్ రీనర్ పై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇక దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ఈ నేపథ్యంలోనే ప్రముఖ డైరెక్టర్ రాబ్ రీనర్ గురించి పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అనే కోణంలో నెటిజన్స్ కూడా తెగ వెతికేస్తున్నారు. విషయంలోకి వెళ్తే.. ఈయన అసలు పేరు రాబర్ట్ నార్మన్ రైనర్. 1947 మార్చి 6న న్యూయార్క్ నగరంలోని బ్రోంక్స్ లో ఒక యూదు కుటుంబంలో జన్మించిన ఈయన న్యూయార్క్ లోని న్యూ రోషెల్ లో48 బోనీ మేడో రోడ్ లో నివసించేవారు. ఈయన UCLA లో ఫిలిం స్కూల్లో చదువుకున్నారు. 1960ల ప్రారంభంలో పెన్సిల్ వేనియాలోని న్యూ హోప్ లో బక్స్ కౌంటీ ప్లే హౌస్ లో ట్రైనీ అలాగే అప్రెంటిస్ గా పనిచేశారు.. ఇక 1962 ఫిబ్రవరి 27న ప్రసారమైన డీ జోన్స్ నటించిన వాగన్ ట్రైన్ సీజన్ 5లో నటించారు.

1980ల్లో దర్శకుడిగా మారిన ఈయన.. తన ఐదు దశాబ్దాల కెరియర్లో దిస్ ఈజ్ స్పైనల్ ట్యాప్, స్టాండ్ బై మీ, వెన్ హ్యారీ మెట్ సాలీ వంటి సూపర్ హిట్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ముఖ్యంగా ఆల్ ఇన్ ద ఫ్యామిలీ అనే ఫన్నీ టీవీ షోలో మైకేల్ స్టివిక్ అనే పాత్రతో మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. తన నటనతో ఏకంగా రెండుసార్లు ఎమ్మీ అవార్డులు అందుకున్న ఈయన.. ఏకంగా ఆస్కార్ కి కూడా నామినేట్ అయ్యారు.

Tags:    

Similar News