పనిభారం తగ్గించుకోవడానికి 10 మందిని చంపిన నర్సు.. కోర్టు భారీ శిక్ష!
హాస్పటల్ లో నైట్ షిఫ్ట్ లో పని చేస్తున్న ఓ మేల్ నర్స్ చేసిన పని ప్రపంచ వ్యాప్తంగా షాకింగ్ గా మారింది.;
హాస్పటల్ లో నైట్ షిఫ్ట్ లో పని చేస్తున్న ఓ మేల్ నర్స్ చేసిన పని ప్రపంచ వ్యాప్తంగా షాకింగ్ గా మారింది. పనిభారం తగ్గించుకోవడం కోసమని అతడు ప్రాణాంతక ఇంజెక్షన్లతో 10 మంది రోగులను హత్య చేశాడు. ఇదే క్రమంలో మరో 27 మందిని హత్య చేయడానికి ప్రయత్నించాడు. దీంతో ఈ కేసులో అతడిని దోషిగా తేల్చిన కోర్టు భారీ శిక్ష విధించింది.
అవును... ప్రాణాంతక ఇంజెక్షన్లతో 10 మంది రోగులను హత్య చేయడంతోపాటు మరో 27 మందిని హత్య చేయడానికి ప్రయత్నించినందుకు ఒక పాలియేటివ్ నర్సును దోషిగా నిర్ధారించిన జర్మన్ కోర్టు.. అతడికి జీవిత ఖైదు విధించింది. రాత్రిపూట తన పనిభారాన్ని తగ్గించడానికి తన వృద్ధ రోగులకు మత్తుమందులు / పెయిన్ కిల్లర్ లు ఇంజెక్ట్ చేసినట్లు ప్రాసిక్యూటర్లు వాదించారు.
పశ్చిమ జర్మనీలోని వుర్సెలెన్ లోని ఒక ఆసుపత్రిలో డిసెంబర్ 2023 - మే 2024 మధ్య ఈ నేరాలు జరిగాయని చెబుతున్నారు. దీంతో... అతని కెరీర్ లో అనేక ఇతర అనుమానాస్పద కేసులపైనా దర్యాప్తును అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇతడు 2007లో నర్సింగ్ ప్రొఫెషనల్ గా శిక్షణ పూర్తి చేసిన తర్వాత 2020 నుండి వుర్సెలెన్ లోని ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నాడు.
ఈ సందర్భంగా కోర్టులో ప్రాసిక్యూటర్ మాట్లాడుతూ.. ఉన్నత స్థాయి సంరక్షణ అవసరమయ్యే రోగుల పట్ల అతను చిరాకు చూపించాడని.. సానుభూతి లేకుండా ప్రవర్తించాడని.. అతను మరణానికి మాస్టర్ గా నటిస్తున్నాడని ఆరోపించారు. నైట్ షిఫ్ట్ లో తన పనిభారాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో ఈ పనికి పూనుకున్నాడని తెలిపారు.
మాజీ నర్సు నీల్స్ హోగెల్ కేసుకు పోలిక!:
ఈ కేసు మాజీ నర్సు నీల్స్ హోగెల్ కేసును పోలి ఉందని చెబుతున్నారు. ఇందులో భాగంగా... 2019 లో ఉత్తర జర్మనీలోని రెండు ఆసుపత్రులలో 85 మంది రోగులను హత్య చేసినందుకు నీల్స్ కు జీవిత ఖైదు విధించబడింది. 1999 - 2005 మధ్య కాలంలో అతను తన సంరక్షణలో ఉన్న వ్యక్తులకు ప్రాణాంతకమైన మోతాదులో గుండెకు సంబంధించిన మందులను ఇచ్చాడని కోర్టు నిర్ధారించింది!