రెండో పెళ్లి తర్వాత తొలి భార్యపై టీమ్ఇండియా మాజీ క్రికెటర్ విజయం
ధావన్ కు రూ.5.70 కోట్లు తిరిగి చెల్లించాలంటూ ఆయేషాను ఆదేశించింది. ఆస్తి పరిష్కారంలో భాగంగా ఆమె పొందిన ఈ డబ్బు.. మోసంతో పొందినదని తప్పుబట్టింది.;
రెండో పెళ్లి చేసుకున్న కేవలం నాలుగు రోజుల్లో టీమ్ మాజీ క్రికెటర్ కు మొదటి భార్యపై గొప్ప విజయం దక్కింది. ఇప్పటికే కుమారుడికి దూరమై మనో వేదన అనుభవిస్తున్న అతడికి మానసిక విజయం లభించింది. ఏకంగా రూ.5 కోట్లు కట్టాలంటూ అతడి మాజీ భార్యను కోర్టు ఆదేశించింది. అంతే కాకుండా.. మోసం కారణంగా ఆస్తి పరిష్కారం చెల్లదంటూ తీర్పునిచ్చింది. అసలు అతడి వివాహమే ఆశ్చర్యం.. అంతలోనే విడాకులు కూడా మరింత ఆశ్చర్యం.
ఇది జరిగిన కొన్నాళ్లకు తాజాగా రెండో వివాహం జరగడం గమనార్హం. ఇదంతా టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ వ్యక్తిగత జీవితంలో జరిగిన పరిణామాలు. ఆస్ట్రేలియాలో స్థిరపడిన ఆయేషా ముఖర్జీని ధావన్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈమెకు అంతకుముందే వివాహమైంది. అయినా, ధావన్ ప్రేమించి పెళ్లాడాడు. కానీ, వీరి వివాహ బంధం పదేళ్లు మాత్రమే కొనసాగింది. తర్వాత విడాకులయ్యాయి. అయితే, ఆస్ట్రేలియా కోర్టు ఆమోదించిన విడాకుల పరిష్కారం చెల్లదంటూ గురువారం పాటియాలా హౌస్ ఫ్యామిలీ కోర్టు తీర్పునిచ్చింది.
ధావన్ కు రూ.5.70 కోట్లు తిరిగి చెల్లించాలంటూ ఆయేషాను ఆదేశించింది. ఆస్తి పరిష్కారంలో భాగంగా ఆమె పొందిన ఈ డబ్బు.. మోసంతో పొందినదని తప్పుబట్టింది. ఆయేషా.. ఆస్ట్రేలియాలో అందుకున్న 894 డాలర్లకు పైగా మొత్తం బెదిరింపుల ద్వారా పొందినదని తప్పుబట్టింది.
ఆ అధికారం ఆస్ట్రేలియా కోర్టుకు లేదు
ధావన్-ఆయేషా మధ్య విషయంలో ఆస్ట్రేలియా కోర్టు ఆమోదించిన విడాకుల పరిష్కారం చెల్లదని ఢిల్లీ కోర్టు తీర్పు చెప్పింది. వీరి వివాహం రిజిస్టర్ అయినది భారత్ లో అనే విషయం ప్రస్తావించింది. అందుకనే ఆస్ట్రేలియా కోర్టు జారీ చేసే ఏ ఆదేశాలకూ ధావన్ కట్టుబడే పని లేదని పేర్కొంది. ధావన్ కు రూ.5.70 కోట్లను 9 శాతం వడ్డీతో చెల్లించాలని స్పష్టం చేసింది. 2024 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా ఆదేశాలిచ్చింది.
-ఆస్ట్రేలియా కోర్టు..రెండేళ్ల కిందట ధావన్ ఆస్తిలో 15 శాతం ఆయేషాకు ఇవ్వాలని తీర్పుచెప్పింది. ఆమె రూ.7.46 కోట్లతో పాటు ధావన్ రూ.15.95 కోట్లు ఇవ్వాలని పేర్కొంది. అయితే, ఈ ఆస్తుల పంచాయితీ చాలా ఉంది. ధావన్ ఆస్తికి 99 శాతం యజమానిగా ముఖర్జీని చూపడాన్ని ఢిల్లీ కోర్టు ప్రస్తావించింది. ధావన్ ను ఆస్ట్రేలియాలో ఆస్తులు కొనుగోలు చేసేలా ప్రేరేపించి వాటిని ముఖర్జీ తన పేరిట పెట్టుకున్నట్లు సమాచారం.
-ఈ కేసుల విచారణలో ఆయేషా ముఖర్జీ ఢిల్లీ కోర్టు ఎదుట విచారణకు హాజరు కాలేదు. దీంతో ధావన్ కు అనుకూలంగా తీర్పుచెప్పింది. ధావన్... 2012లో ఆయేషాను పెళ్లాడాడు. అంతకుమందే ఇద్దరు పిల్లలున్న ఆమెకు.. ధావన్ ద్వారా 2013లో కుమారుడు పుట్టాడు. ఇక రెండేళ్ల కిందట విడాకులు అయ్యాక.. ధావన్ ఈ నెల 24న మరో వివాహం చేసుకున్నాడు.