ఢిల్లీ నుంచి ఢాకాకు.. హసీనాను అప్పగిస్తాం.. బంగ్లాకు భారత్ హామీ!
బంగ్లాలోని తాత్కాలిక ప్రభుత్వం భారత్ తో సత్సంబంధాలు నెరిపే ఉద్దేశంలో లేదు. కారణం.. ఆ ప్రభుత్వాధినేత మొహమ్మద్ యూనస్ పచ్చి భారత వ్యతిరేకి.;
దాదాపు 16 నెలలు.. బంగ్లాదేశ్ ప్రధాని పదవి వదులుకుని హుటాహుటిన ప్రత్యేక విమానంలో ఢాకా నుంచి ఢిల్లీకి వచ్చేశారు షేక్ హసీనా. తన చెల్లెలు రెహానా కూడా ఆమెతో ఉన్నారు. మొదట హసీనా భారత దేశంలో ఎక్కడ ఉన్నదీ ఎవరికీ తెలియదు. ఇటీవలే ఆమె ఢిల్లీలో ఉన్నట్లుగా స్పష్టమైంది. అయితే, తమ మాజీ ప్రధానిని తమకు అప్పగించేయాలంటూ ఇప్పటికే పలుసార్లు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత్ ను కోరింది. దీనిపై మన దేశం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇటీవల బంగ్లా అంతర్జాతీయ నేర ట్రైబ్యునల్ (ఐటీసీ) మరణశిక్ష విధించింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ కు తిరిగి పంపుతారా? అనే ప్రశ్నలు వచ్చాయి. సహజంగా భారత్ లో ఆశ్రయం పొందుతున్నవారిని, పైగా మరణశిక్షల ముప్పు పొంచి ఉన్నవారిని వారి దేశాలకు తిప్పిపంపిన దాఖలాలు లేవు. ఆరు దశాబ్దాల కిందటే భారత దేశానికి వచ్చిన దలైలామానే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఇప్పుడు హసీనా విషయంలో మాత్రం భారత ప్రభుత్వం భిన్నంగా స్పందించింది. ఆమె అప్పగింతను పరిశీలిస్తామని తెలిపింది. బంగ్లా ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు, ఆ దేశ ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రయత్నిస్తామని పేర్కొంది.
మరణ శిక్ష ముప్పు ఉన్నా పంపేస్తారా...?
బంగ్లాలోని తాత్కాలిక ప్రభుత్వం భారత్ తో సత్సంబంధాలు నెరిపే ఉద్దేశంలో లేదు. కారణం.. ఆ ప్రభుత్వాధినేత మొహమ్మద్ యూనస్ పచ్చి భారత వ్యతిరేకి. అంతేకాదు, భారత దేశ ఈశాన్య రాష్ట్రాల సమగ్రతపైనే వ్యాఖ్యలు చేసేంత ద్వేషి. అలాంటి వ్యక్తి సారథ్యంలోని ప్రభుత్వం విధించిన మరణశిక్ష ముప్పు పొంచి ఉన్న హసీనాను భారత్ తిరిగి అప్పగించడం కాస్త చర్చనీయమే. పైగా హసీనాతో పాటు ఆమె చెల్లెలు రెహానాను కూడా అప్పగించాల్సి ఉంటుందేమో?
78 ఏళ్ల వయసులో..
షేక్ హసీనాకు ప్రస్తుతం 78 ఏళ్లు. ఆమెపై బంగ్లాదేశ్ లో వందకు పైగా కేసులు నమోదయ్యాయి. కనుచూపుతో దేశాన్ని శాసించి, తన మాటే వేదంగా పెత్తనం సాగించిన ఆమె ఈ వయసులో మరణశిక్ష ఎదుర్కొంటున్నారు. భారత ఉప ఖండంలో మరణశిక్ష పడిన రెండో దేశాధినేత ఈమె. 1979 ఏప్రిల్ 4న పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని కూడా అయిన జుల్ఫికర్ అలీ భుట్టోను ఉరి తీశారు. ఈయన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) వ్యవస్థాపకుడు. మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో ఈయన కుమార్తెనే. ప్రస్తుత పాకిస్థాన్ ప్రభుత్వంలో ఈ పార్టీ భాగస్వామి.