'మన్మథుడు' సినిమాను మించిన సీన్... పాక్ ప్రధానిని ఆడుకుంటున్న నెటిజన్లు!
ఇజ్రాయెల్ - హమాస్ ల యుద్ధం ముగింపునకు సంబంధించి ఈజిప్టులో శాంతి ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే.;
ఇజ్రాయెల్ - హమాస్ ల యుద్ధం ముగింపునకు సంబంధించి ఈజిప్టులో శాంతి ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆసక్తికరమైన ఈ కార్యక్రమంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పొగడ్తల ప్రసంగం, అంతకు ముందు ఆయనకు ట్రంప్ ఇచ్చిన లీడ్.. ‘మన్మథుడు’ సినిమాలో కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం మధ్య సన్నివేశాన్ని మించి ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అవును... 'మన్మథుడు' సినిమాలో 'ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేసి ఉంటారు’ అని కోట శ్రీనివాసరావుని బ్రహ్మానందం పొగుడుతారు. అది విని పొంగిపోయిన కోట.. అందరినీ పిలిపించి ఆ మాట వారిముందు కూడా చెప్పమని బ్రహ్మానందాన్ని అడుగుతారు. సరిగ్గా అదే తరహా సన్నివేశం.. అంతర్జాతీయ వేదికపై ట్రంప్, షరీఫ్ మధ్య జరిగింది.
వివరాళ్లోకి వెళ్తే... ఇజ్రాయెల్ - హమాస్ ల యుద్ధం ముగింపునకు సంబంధించి ఈజిప్టులో శాంతి ఒప్పందం జరిగిన సందర్భంగా మైకు ముందుకు వచ్చిన ట్రంప్.. పాక్ ప్రధాని షరీఫ్ ని ఉద్దేశించి.. తనతో ఇంతకు ముందు రోజు చెప్పింది మళ్లీ చెబుతారా / చెప్పాలనుకుంటున్నారా? అని అర్ధం వచ్చేలా అడిగారు! దీనికి చిరునవ్వులు చిందిస్తూ పాక్ ప్రధాని ముందుకు వచ్చారు!
అప్పుడు మొదలుపెట్టిన పాక్ ప్రధాని.. తన ఐదు నిమిషాల ప్రసంగంలో ట్రంప్ పై పొగడ్తల వర్షం కురిపించారు. ఇందులో భాగంగా... అధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలో అవిశ్రాంత ప్రయత్నాల తర్వాత గాజాలో శాంతి సాధన అయ్యింది. అందువల్ల ఈ రోజు చరిత్రలో గొప్ప రోజులలో ఒకటి.. ఆయన నిజంగా శాంతిని కోరుకునేవాడు అంటూ అనర్గలంగా ప్రశంసల వర్షం కురిపించారు.
ఇదే సమయంలో.. ట్రంప్ ఈ ప్రపంచాన్ని శాంతి, శ్రేయస్సుతో జీవించేలా చేసేందుకు అవిశ్రాంతంగా కృషి చేశారని కొనియాడుతూ... శాంతిని పెంపొందించడానికి ట్రంప్ చేసిన అద్భుతమైన, అసాధారణ కృషికి గుర్తింపుగా.. పాకిస్తాన్ ఆయనను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసింది. ఆయన శాంతి ప్రేమకు మనం చేయగలిగినది ఇదేనని నేను భావిస్తున్నాను అని అన్నారు.
అక్కడితో ఆగని పాకిస్థాన్ ప్రధానమంత్రి... భారత్ - పాక్ మధ్య యుద్ధం తానే ఆపానని, సీజ్ ఫైర్ క్రెడిట్ తనదేనంటూ ట్రంప్ చేసే వాదనకు మరోసారి మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా... ట్రంప్ తన అద్భుతమైన బృందంతో జోక్యం చేసుకోకపోతే.. భారత్ - పా క్ మధ్య ఆ ఘర్షణలు పశ్చిమాసియాకు విస్తరించి ఉండేవి.. ఏం జరిగిందో చెప్పేందుకు కూడా ఎవరూ మిగిలేవారు కాదంటూ వ్యాఖ్యానించారు.
ఈ విధంగా దక్షిణాసియాలోనే కాకుండా మధ్యప్రాచ్యంలో కూడా లక్షలాది మంది ప్రాణాలను కాపాడినందుకు డొనాల్డ్ ట్రంప్ ను నోబెల్ శాంతి బహుమతికి మళ్ళీ నామినేట్ చేస్తానని చెప్పారు. దీంతో ట్రంప్ చిరునవ్వుతో స్పందిస్తూ.. "వావ్! నేను దాన్ని ఊహించలేదు" అని అన్నారు.
మండిపోతున్న నెటిజన్లు!:
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై పాకిస్థాన్ ప్రధాని ఈ రేంజ్ లో పొగడ్తల వర్షం కురిపించడంతో నెటిజన్లు మంటెక్కిపోతున్నారు! ఈ సందర్భంగా ఘాటుగా స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా... సమయం దొరికినప్పుడల్లా షరీఫ్ అనవసరంగా ట్రంప్ ను ప్రశంసిస్తుండడం పాకిస్థానీయులకు ఇబ్బందికరంగా ఉందని ఆ దేశానికే చెందిన చరిత్రకారుడు అమర్ అలీ జాన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
ట్రంప్ బూట్లు మెరవాలంటే పాక్ ప్రధాని రావాలి!:
ఇదే సమయంలో కాలమిస్ట్ ఎస్.ఎల్. కాంతన్ స్పందిస్తూ... 'ట్రంప్ తన బూట్లు ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా మెరిసిపోవాలనుకున్నప్పుడల్లా.. ఆయన పాకిస్తాన్ చిన్న ప్రధానమంత్రిని ఆహ్వానిస్తారు. భౌగోళిక రాజకీయాల్లో ఇంతటి దారుణాన్ని ఎప్పుడూ చూడలేదు' అని ఆయన 'ఎక్స్'లో రాశారు. దీంతో... కడుపు మండిన వ్యంగం ఈ రేంజ్ లో ఉంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!
పాకిస్థాన్ ను తోలుబొమ్మలు అమ్మేశాయి!:
ఇదే సమయంలో ‘ఎక్స్’ వేదికగా స్పందించిన మరో వినియోగదారుడు... 'షెహబాజ్ షరీఫ్ గతంలో కూడా డోనాల్డ్ ట్రంప్ ను పొగిడాడు. నిన్న అంతర్జాతీయ మీడియా ముందు ఆయన అదే మాటలను పునరావృతం చేశారు. పాకిస్తాన్ ను తోలుబొమ్మలు కొన్ని బిలియన్ డాలర్లకు అమ్మేశాయి" అని ఘాటుగా రాశారు. మరో యూజర్ స్పందిస్తూ.. షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ లోని 240 మిలియన్ల ప్రజలకు అవమానం అని అన్నారు.