ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి వైసీపీ మద్దతు.. జగన్ పై షర్మిల మాస్ కామెంట్స్
ఉపరాష్ట్రపతి ఎన్నికలో NDA కూటమి నిలబెట్టిన బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడానికి YCPకి సిగ్గుండాలని షర్మిల ధ్వజమెత్తారు. అవినీతి కేసులకు భయపడి బీజేపీకి మళ్ళీ దాసోహం అయ్యారని ఆరోపించారు.;
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ పై ఏపీసీసీ చీఫ్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణణ్ కు వైసీపీ మద్దతు పలకడాన్ని ఆమె ఆక్షేపించారు. వైసీపీ ముసుగు మళ్లీ తొలగిందని, లోపనున్న కాషాయ కండువా మరోసారి బయటపడిందని షర్మిల ట్వీట్ చేశారు. అంతేకాకుండా ప్రధాని మోదీకి, బీజేపీకి జగన్ బీ-టీంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించిన షర్మిల.. ప్రధాని మోదీకి జగన్ దత్తపుత్రుడని ఆరోపించారు. ఇదే సమయంలో బీజేపీ కోసమే రాష్ట్రంలో టీడీపీ, జనసేన, వైసీపీ పనిచేస్తున్నాయని ధ్వజమెత్తారు. అందుకే BJP అంటే "బాబు, జగన్, పవన్ అంటూ సూత్రీకరించారు. ‘‘ముగ్గురు మోడీ గారి తొత్తులే. బీజేపీకి ఊడిగం చేసే బానిసలే. టీడీపీ, జనసేన పార్టీలది తెరమీద పొత్తు. YCPది తెరవెనుక అక్రమ పొత్తు. YCP తీరు రాష్ట్రంలో కూటమి పక్షాలతో కుస్తీ. ఢిల్లీలో మతపిచ్చి బీజేపీతో దోస్తీ.’’ అని షర్మిల ఆరోపించారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికలో NDA కూటమి నిలబెట్టిన బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడానికి YCPకి సిగ్గుండాలని షర్మిల ధ్వజమెత్తారు. అవినీతి కేసులకు భయపడి బీజేపీకి మళ్ళీ దాసోహం అయ్యారని ఆరోపించారు. 5 ఏళ్లు దోచుకుతిన్నది దాచుకోడానికే బీజేపీకి జై కొట్టారన్నారు షర్మిల. ‘‘ఈ దేశంలో ఓట్ చోరితో రాజ్యాంగం ఖూనీ అయ్యేది వైసీపీకి కనిపించదు. మోడీ గారు ప్రజాస్వామ్యం అపహాస్యం చేస్తుంటే విమర్శించడానికి YCP నోరు పెకలదు. మణిపూర్, గోద్రా అల్లర్లలో RSS చేస్తున్న రక్తపాతం మీద మౌనం వహిస్తారు. మోడీ గారి అక్రమాలు బయటపెట్టే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాత్రం ఉవ్వెత్తున లేస్తారు. మోడీకి ఆపద వచ్చిందని అండగా నిలబడతారు. ఈ దేశ ప్రతిపక్షాలన్నీ కలిసి రాజకీయాలతో సంబంధం లేని ఒక తెలుగు బిడ్డ, న్యాయ నిపుణుడిని నిలబెడితే, బీజేపీ నిలబెట్టిన RSS వాదికి మద్దతు ఇస్తారా ?’’ అంటూ షర్మిల సూటి ప్రశ్నలు వేశారు. ఇది తెలుగు ప్రజలకు చేసిన ద్రోహం కాకపోతే మరేంటి ? దీనిపై రాష్ట్ర ప్రజలకు YCP సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఉప రాష్ట్రపతి ఎన్నికలు పురస్కరించుకుని వైసీపీ అధినేత జగన్ ను కలవాలని షర్మిల ప్రయత్నిస్తున్నారని రెండు రోజుల క్రితం వార్తలు వచ్చాయి. తమ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి కాంగ్రెస్ బలపరిచిన తెలుగు బిడ్డకు మద్దతు ఇవ్వాలని జగన్ ను కోరేందుకు షర్మిల ఆయన అపాయింట్మెంట్ కోరినట్లు ప్రచారం జరిగింది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ, ఇంతలో తమ మద్దతు బీజేపీ బలపరిచిన ఉప రాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణణ్ కే అంటూ మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తేల్చేశారు. దీంతో తన ప్రయత్నాలు ఫలించకపోవడంతో షర్మిల ఎదురుదాడి మొదలుపెట్టారు.
సెప్టెంబరు 9న ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. అధికార పక్షం ఏకపక్షంగా గెలిచే అవకాశం ఉన్నా, ప్రతిపక్షాలు వ్యూహాత్మకంగా రిటైర్డ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డిని తమ అభ్యర్థిగా బరిలోకి దించాయి. ఏపీలో లోక్ సభ, రాజ్యసభ సభ్యులు కలిపి 35 మంది ఉన్నారు. ఈ ఓట్లన్నీ అధికార పక్ష అభ్యర్థికి పడే అవకాశం ఉందని అంటున్నారు. అయితే తెలుగు సెంటిమెంట్ తెరపైకి తెచ్చి ఏపీ ఎంపీలపై ఒత్తిడి పెంచాలని కాంగ్రెస్ వ్యూహం రచించింది. అయితే ఎన్డీఏ మిత్రపక్షాలుగా టీడీపీ, జనసేన తమ కూటమి అభ్యర్థికే బలపరిచాయి. దీనికి కాంగ్రెస్ పెద్దగా పరిగణించకపోగా, వైసీపీ తమకు మద్దతు పలుకుతుందని భావించింది. ఏపీలో కూటమితో విభేదిస్తున్న వైసీపీ కేంద్రంలో తమతో చేతులు కలుపుతుందని, అనుకున్న ఓట్లు కన్నా ఎక్కువ ఓట్లు వస్తాయని ఊహించింది. అయతే వైసీపీ ముందుగానే ఎన్డీఏ కూటమికి మద్దతు చెప్పడంతో కాంగ్రెస్ షాక్ తిన్నదని అంటున్నారు. ఇందులోభాగంగానే షర్మిల విమర్శలు గుప్పిస్తున్నారని అంటున్నారు.