విమాన ప్రయాణాల్లో ఆ 3 నగరాల తర్వాత హైదరాబాదే
ఆకాశయానంలో హైదరాబాద్ ఎయిర్ పోర్టు అదరగొట్టేస్తోంది. విమాన రాకపోకలు.. ప్రయాణికుల రద్దీతో కొత్త రికార్డుల్ని క్రియేట్ చేస్తోంది.;
ఆకాశయానంలో హైదరాబాద్ ఎయిర్ పోర్టు అదరగొట్టేస్తోంది. విమాన రాకపోకలు.. ప్రయాణికుల రద్దీతో కొత్త రికార్డుల్ని క్రియేట్ చేస్తోంది. గగనతల ప్రయాణానికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టు.. రానున్న రోజుల్లో ఏడాదికి 3 కోట్ల మార్కుకు చేరువ కావటం ఖాయం. అంతేకాదు.. దేశంలో అత్యంత వేగంగా సేవలు అందించే విమానాశ్రయ విభాగంలో శంషాబాద్ మొదటి స్థానంలో నిలవటం గమనార్హం.
అంతేకాదు.. ప్రయాణికుల రాకపోకల్లో దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్ పోర్టు మొదటి స్థానంలో ఉండగా.. హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్.. మే నెలల్లో 54 లక్షల మంది ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో ట్రావెల్ చేశారు. ఏప్రిల్ లో మిస్ వరల్డ్ వేడుకలు జరగటంతో రాకపోకలు భారీగా పెరిగాయి. మిస్ వరల్డ్ పోటీలు జరిగిన సమయంలో సగటున రోజుకు 90 వేల మంది రాకపోకలు కొనసాగించినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.
ఇదే జోరు మరో పది నెలలు సాగితే.. ఏడాదికి మూడు కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాధించిన విమానాశ్రయంగా శంషాబాద్ ఎయిర్ పోర్టు నిలుస్తుంది. తెలంగాణకు సరిహద్దు రాష్ట్రాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్.. మహారాష్ట్ర.. కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారు కూడా శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ప్రయాణం చేస్తున్నారు. దీనికి తోడు హైదరాబాద్ లో తరచూ ఏదో ఒక జాతీయ.. అంతర్జాతీయ సదస్సులు.. సమావేశాలు జరగటం కూడా కలిసి వస్తోంది. దేశీయ.. విదేశీ ప్రయాణికుల రద్దీని చూస్తే..హైదరాబాద్ కంటే ముందు ఢిల్లీ ఉండగా.. రెండో స్థానంలో దేశ ఆర్థిక రాజధాని ముంబయి నిలిచింది. మూడో స్థానంలో బెంగళూరు ఉండగా.. నాలుగో స్థానంలో హైదరాబాద్ ఉంది. భాగ్యనగరి తర్వాత అత్యధిక రద్దీ ఉన్న ఎయిర్ పోర్టులుగా చెన్నై..కోల్ కతా విమానాశ్రయాలు నిలుస్తున్నాయి.