ఎన్నికల వేళ హిందూ-ముస్లిం జనాభా లెక్కలా? ఇందులో మర్మమేమి?

సరిగ్గా ఎన్నికల ముంగిట బయటపెట్టడంతో ఇందులో మర్మం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి.

Update: 2024-05-10 10:41 GMT

భారత్ లో 2011లో జనాభా లెక్కలు సేకరించారు. ఆపై పదేళ్లకు అంటే.. 2021లో మరోసారి లెక్కలు తీయాల్సి ఉంది. కానీ, కొవిడ్ కారణంగా నిరవధికంగా వాయిదా పడింది. ఎప్పుడు నిర్వహిస్తారనేది ఇంకా నిర్దిష్టంగా తేలలేదు. ఒకవేళ ఈ ఏడాది చివర్లోనో, వచ్చే ఏడాది మొదట్లోనే జనాభా లెక్కలు చేపట్టే వీలుంది. అంటే.. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాకే అన్నమాట. 2011 జనాభా లెక్కల సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం ఉంది. అయితే, తాజాగా బయటకు వచ్చిన ఓ నివేదిక చర్చనీయాంశంగా మారింది. సరిగ్గా ఎన్నికల ముంగిట బయటపెట్టడంతో ఇందులో మర్మం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి.

దేశంలో 1950లో హిందువుల జనాభా 84.68 శాతం అని.. 65 ఏళ్ల తర్వాత 2015 నాటికి 78.06 శాతానికి తగ్గిందంటూ ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) వెల్లడించింది. హిందువుల వాటాలో 7.82% తగ్గుదల నమోదైందని పేర్కొంది. అయితే, ముస్లింల వాటా 9.84% నుంచి 14.09%కు పెరిగిందని.. వాటాలో పెరుగుదల 43.15%గా నమోదైనట్లు వివరించింది. క్రైస్తవులు, సిక్కుల వాటా స్వల్పంగా పెరిగిందని.. జైనులు, పార్శీల శాతం తగ్గిందని పేర్కొంది.

Read more!

ఇప్పుడే ఎందుకు?

దేశంలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. సగం స్థానాల్లో పోలింగ్ పూర్తయింది. ఇలాంటి కీలక సమయంలో హిందువుల వాటా తగ్గిందంటూ ఈఏసీ-పీఎం నివేదిక బయటకు రావడం గమనార్హం. పైగా ఈ నివేదిక వర్గాల వారీ జనాభా (హిందువులు ఎంత? ముస్లింలు ఎంత) సంఖ్య చెప్పలేదు. కేవలం భారత్ లో హిందువులు తగ్గారని మాత్రమే పేర్కొంది. శామికా రవి నేతృత్వంలోని ఈఏసీ-పీఎం.. 167 దేశాల్లో పరిస్థితులను అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించింది.

వాటిని వెలెత్తి చూపి..

ఈఏసీ-పీఎం నివేదికలో మరో కీలకాంశం.. దక్షిణాసియాలోని బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, శ్రీలంక, భూటాన్‌, అఫ్గానిస్థాన్‌ లో మెజార్టీ (ముస్లింలు) మతస్థుల వాటా పెరిగిందని, మైనార్టీల వాటా ఆందోళనకర రీతిలో తగ్గుతోందని చెప్పడం. బంగ్లాదేశ్‌ లో మెజార్టీ మతస్థుల వాటా 18% అధికంగా నమోదైందని, పాకిస్థాన్‌లో మెజార్టీ వర్గమైన హనాఫీ ముస్లింల వాటా 3.75% పెరిగిందని చెప్పింది.

మత ప్రాతిపదికన..

అయోధ్య రామమందిర నిర్మాణం సహా.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎక్కువమంది పిల్లలున్నవారికి సంపదను దోచిపెడతారంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే తన ప్రచారంలో మతపరమైన అంశాలను ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఇలాంటి వేళ హిందువుల జనాభా తగ్గిందంటూ నివేదిక బయట పెట్టడం.. అది కూడా ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి వెల్లడించడం వెనుక ఏదో పెద్ద వ్యూహమే ఉందని ఆలోచించాల్సి వస్తోంది.

Tags:    

Similar News