సైబర్ బందిపోట్లకు చెక్ పెట్టే ‘సెంటినల్’ అస్త్రం
సైబర్ నేరాలతో అమాయకుల సొమ్ముల్ని అడ్డంగా లాగేస్తున్న సైబర్ బందిపోట్ల ఆట కట్టించేందుకు వీలుగా తెలంగాణ పోలీసులు సరికొత్త అస్త్రాన్ని సిద్దం చేసుకున్నారు.;
సైబర్ నేరాలతో అమాయకుల సొమ్ముల్ని అడ్డంగా లాగేస్తున్న సైబర్ బందిపోట్ల ఆట కట్టించేందుకు వీలుగా తెలంగాణ పోలీసులు సరికొత్త అస్త్రాన్ని సిద్దం చేసుకున్నారు. దీని పేరే సెంటినల్. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో.. సైబరాబాద్ పోలీసులు రూపొందించి అస్త్రమే ఇది. దీని ప్రత్యేకత ఏమిటన్నది చూస్తే.. ఇంతకాలం సైబర్ బందిపోట్ల బారిన పడిన బాధితులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను ఈ టూల్ పరిష్కరిస్తుంది. అదెలానంటే..
సైబర్ బందిపోట్ల కారణంగా డబ్బులు పోగొట్టుకున్న పలువురు బాధితులు 1930కు ఫోన్ చేయటం.. తమ ఫిర్యాదును నమోదు చేయటం తెలిసిందే. ఆ వెంటనే స్పందించిన పోలీసులు బాధితుడి ఖాతా నుంచి మోసగాళ్ల ఖాతాలకు బదిలీ అయిన సొమ్మును విత్ డ్రా చేయకుండా అడ్డుకుంటారు. బ్యాంకుల్ని సంప్రదించి సొమ్మును వెనక్కి తీసుకొస్తారు. అయితే.. ఇలాంటి దానికి అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు సైబర్ ముఠాలు తెలివిగా తాము దోచేసిన సొమ్మును పాతిక ముప్ఫై ఖాతాలకు ముక్కలుగా చేసేసి పంపుతారు. దీంతో.. ఆ సొమ్ముల్ని వెనక్కి తీసుకురావటం కష్టంగా ఉండేది.
ఈ సమస్యను పరిష్కరించేందుకు సెంటినల్ టూల్ ను సిద్ధం చేశారు. ఇదెలా పని చేస్తుందంటే..బాధితుడు ఫిర్యాదు చేసిన తర్వాత సైబర్ బందిపోట్లు కొల్లగొట్టిన సొమ్మును పలు ఖాతాలకు బదిలీ చేసే తీరుకు చెక్ పెట్టేలా దీన్ని రూపొందించారు. అంటే.. ఒక ఖాతా నుంచి ఇరవై ఖాతాలకు డబ్బులు వెళితే.. ఈ టూల్ సాయంతో ఆ ఇరవై ఖాతాలకు సదరు ఫిర్యాదును ఆటోమేటిక్ గా జనరేట్ చేసి.. అన్ని ఖాతాల్లోని సొమ్ముల్ని విత్ డ్రా చేసుకోకుండా స్తంభింపచేస్తారు. అనంతరం వారి డబ్బును వెనక్కి తెప్పించి బాధితులకు ఇప్పిస్తారు. ఈ సొమ్మును కోర్టుల ద్వారా తీసుకోవటం తేలిక అయ్యేలా ఈ టూల్ ను సిద్ధం చేశారు. సైబర్ బందిపోట్ల బారిన పడే వారికి ఇదో ఉపశమనంగా మారుతుందని చెప్పాలి.