సీదరి...ఒంటరి!
ఆయనకు లక్ ఒక్కలా రాలేదు. యువ వైద్యుడిగా ఉంటూ రాజకీయాల పట్ల ఆసక్తి కనబరచారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పలాసకి పాదయాత్రగా వచ్చినపుడు ఆయనతో పాటుగా అడుగులు వేశారు.;
ఆయనకు లక్ ఒక్కలా రాలేదు. యువ వైద్యుడిగా ఉంటూ రాజకీయాల పట్ల ఆసక్తి కనబరచారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పలాసకి పాదయాత్రగా వచ్చినపుడు ఆయనతో పాటుగా అడుగులు వేశారు. దాంతో పాటుగా ఆయన ప్రదర్శించిన చురుకుదనం దూకుడు అన్నీ జగన్ కి నచ్చేశాయి. దాంతో ఆయననే పలాసా వైసీపీ ఇంచార్జిగా నియమించి 2019లో ఏకంగా టికెట్ ని అనౌన్స్ చేశారు. ఆయనే సీదరి అప్పలరాజు.
అయితే అప్పటిదాకా పార్టీలో ఉన్న సీనియర్లు అంతా ఈ ప్రకటనతో తప్పుకుని టీడీపీ గూటికి చేరుకున్నారు. వాస్తవానికి పలాస నియోజకవర్గం టీడీపీ గట్టి పట్టున్నది. ప్రముఖ బీసీ నేత సర్దార్ గౌతు లచ్చన్న కుమారుడు గౌతు శ్యామసుందర శివాజీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గం అది. జగన్ డేరింగ్ గా సీదరికి టికెట్ ఇచ్చ్చారు మరో వైపు పార్టీలోని వారు చాలా మంది బయటకు వెళ్ళారు, గెలుపు డౌట్ అని అనుకుంటున్న నేపథ్యంలో జగన్ ప్రభంజనంలో సీదరి గెలిచారు. అలా గౌతు కుటుంబ రాజకీయ వారసురాలు అయిన గౌత్ శిరీషని ఆయన ఓడించారు.
అలా 2020 నాటికి సీదరి అప్పలరాజు జగన్ మంత్రివర్గంలో మంత్రి కూడా అయిపోయారు. నాలుగేళ్ళ పాటు ఆయన మంత్రిగా కొనసాగారు. దాంతోనే పలాసలో వైసీపీలో వర్గ పోరు స్టార్ట్ అయింది అని చెబుతారు. తన గెలుపునకు సహకరించని వారిని ఆయన పక్కన పెడుతూ తనకంటూ కొత్త టీంని ఏర్పాటు చేసుకున్నారు అన్నది ఒక విమర్శగా ఆయన మీద ఉంది.
అంతే కాదు స్థానికంగా బలమైన సామాజిక వర్గం అంతా ఏకమై ఆయనకు టికెట్ ఇవ్వవద్దు అని 2024 ఎన్నికల ముందు రచ్చ చేసింది. అయినా జగన్ ఆయనకే చాన్స్ ఇచ్చారు. అయితే ఆయన అందరితో పాటే ఓడారు కనుక నియోజకవర్గం ఇన్చార్జి బాధ్యతలు ఆయనకే ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. సంప్రదాయ మత్స్యకార వర్గానికి చెందిన సీదరి అప్పలరాజుకు మంత్రి పదవి ఇచ్చి బీసీలలో ఆ వర్గానికి ప్రాముఖ్యత ఇచ్చామని వైసీపీ చెప్పుకుంటోంది.
అయితే కాళింగ సామాజిక వర్గం కూడా పలాసలో ఉంది. వారంతా తమకు ఎపుడు పలాసలో రాజకీయ ప్రాధాన్యత అని అడుగుతున్నారు. దాంతో పలాసలో సామాజికంగా వర్గ పోరు అయితే రాజుకుంటోంది అని అంటున్నారు నియోజకవర్గంలోని మూడు మండలాలలోని నాయకులు కొందరు ఇటీవల సమావేశమై తమలో ఒకరిని నియోజకవర్గం ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వాలని కోరుతున్నారు సీదరిని ఆ పదవి నుంచి తప్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు
ఇంకో వైపు చూస్తే సీదరికి ఈ వర్గ పోరు వల్ల ఒంటరి అయ్యారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సీనియర్లు అంతా ఆయనను వ్యతిరేకిస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. అయితే జగన్ కి సీదరి అత్యంత సన్నిహిత నేతగా ఉన్నారు. దాంతో పాటు ఆయన ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. మంత్రిగా పనిచేశారు. బీసీలలో సైతం అత్యంత వెనకబడిన సామాజిక వర్గానికి చెందిన యువ నేత.
పైగా గౌతు కుటుంబాన్ని ఓడించిన వారుగా పేరు ఉంది. అందువల్ల ఆయన వైపే పార్టీ మొగ్గుచూపుతుందా లేక ఆయనను వ్యతిరేకిస్తున్న వర్గం మాట చెల్లుతుందా అన్నదే చర్చగా ఉంది. అయితే సీదరిని తప్పించాలంటే ఆ స్థాయి నేత ఉండాలి కదా అని అంటున్నారుట. మొత్తానికి అయితే సీదరికి అధినాయకత్వం అండగా ఉంటే సొంత నియోజకవర్గంలో సొంత పార్టీలో మాత్రం మద్దతు కరవు అవుతోంది అని అంటున్నారు. ఆయన ఇప్పటికైనా అందరినీ కలుపుకుని వెళ్తే మరింత కాలం ఈ యువ నేత రాజకీయం సాగుతుందని అంటున్నారు.