‘కలికాల’కేయుల ‘వైరల్’ ఫీవర్ తగ్గేదెలా?
రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వీడియోలు తీసి వైరల్ చేసేంత తీరిక, ఓపిక ఉన్న ఈ కలికాలకేయులకు...ఆ ఫోన్ పక్కనపడేసి క్షతగాత్రులకు సాయం చేసి వారి ప్రాణాలు కాపాడే మానవత్వం మాత్రం లేదు.;
‘‘మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు...మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు... నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు యాడ ఉన్నడో గానీ కంటికీ కనరాడు’’ అంటూ ప్రముఖ గేయ రచయితే, ప్రజాకవి అందె శ్రీ ఎంతో ఆర్ద్రతతో రాసిన ఈ పాట అక్షర సత్యం అని చాలామంది ప్రజలు నిరూపిస్తున్నారు. వింత పోకడలకు...విపరీత ధోరణులకు..వేలం వెర్రికి నిలువెత్తు తార్కాణం ఈ కలికాలం అని ‘కలికాలకేయులు’ రుజువు చేస్తున్నారు. సాటి మనిషి చనిపోతున్నా...సాయం చేసే అవకాశమున్నా..మనకెందుకులే అని మిన్నకుంటున్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వీడియోలు తీసి వైరల్ చేసేంత తీరిక, ఓపిక ఉన్న ఈ కలికాలకేయులకు...ఆ ఫోన్ పక్కనపడేసి క్షతగాత్రులకు సాయం చేసి వారి ప్రాణాలు కాపాడే మానవత్వం మాత్రం లేదు.
మొన్న కర్నూలులో బస్సు దగ్ధం ఘటన...నిన్న మీర్జాగూడ బస్సు యాక్సిడెంట్ ఘటన...అవి జరిగిన సమయంలో చాలామంది ప్రజలు వీడియోలు తీస్తూ చోద్యం చూశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మీర్జాగూడ బస్సు ప్రమాదం నుంచి బయటపడిన ఒక మహిళ చెప్పిన విషయాలు వింటే ఇటువంటి సమాజంలో మనం ఉన్నామా అని ఆశ్చర్యం కలుగక మానదు. రెప్పపాటులో అంతా జరిగిపోయిందని, కన్నుమూసి తెరిచేలోపు నడుము లోతు కంకరలో చాలామంది కూరుకుపోయామని ఆమె తెలిపారు. సాయం చేయమని అడిగితే కొందరు వీడియోలు తీస్తూ ఉండిపోయారని, మరికొందరు మాత్రం సాయం చేసేందుకు ముందుకు వచ్చి తమ ప్రాణాలు కాపాడారని చెప్పారు.
ఈ రెండు బస్సు ప్రమాద ఘటనలే కాదు...గతంలో కూడా ఈ తరహా ప్రమాదాలు జరిగినప్పుడు చాలామంది వీడియోలు తీసేందుకు లేదంటే అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు మొగ్గుచూపారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అందరూ అలా ఉన్నారని కాదు. తమ ప్రాణాలు పణంగా పెట్టి సాటివారికి సాయం చేసే వారూ ఉన్నారు. మొన్న కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో బస్సు అద్దాలు పగులగొట్టి కొందరి ప్రాణాలు కాపాడిన యువకులు ఆ కోవలోకే వస్తారు. తమ ప్రాణాలు పణంగా పెట్టి వేరే వారి ప్రాణాలు కాపాడమని ఎవరూ చెప్పరు. అయితే, అవకాశం ఉన్నంత వరకు, మన ప్రాణాలకు ప్రమాదం ఉండదని తెలిసి కూడా సాయం చేయకుండా చోద్యం చూస్తూ వీడియోలు తీసే వారి గురించి మాత్రమే మాట్లాడుకోవాల్సి వస్తోంది.
ఈ రోజు పరాయివాళ్లు ప్రమాదంలో ఉన్నారు కాబట్టి మనకెందుకులే అనుకోవచ్చు...రేపు మనకో, మనకు బాగా కావలసిన వాళ్లకో ఈ పరిస్థితి వస్తే?(అటువంటి పరిస్థితి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాం) ..అప్పుడు మనలాగే చోద్యం చూస్తూ జనం వెళ్లిపోతుంటే...ఆ దృశ్యం ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది కదూ? అందుకే..నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి చేతనైన సాయం చేయండి..మీరు చేసే చిన్న సాయం వారి ప్రాణాలు కాపాడవచ్చు. ఏదైనా ప్రమాదానికి గురైన వారికి గోల్డెన్ అవర్ లోపు చేసే సాయం...ఆ తర్వాత అందే వైద్యం ఎంతో కీలకం అన్న విషయం గుర్తుంచుకోండి. ఇన్ స్టా రీల్ లైఫ్ లో కాదు..రియల్ లైఫ్ లో హీరోలు కండి! రీల్స్, షార్ట్స్ వైరల్ చేయడం కోసం పాకులాడే ‘కలికాల’కేయుల ‘వైరల్’ ఫీవర్ కు మానవత్వమే మందు!